మహా కథకుడు ప్రేమ్‌చంద్ కాశీలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఆ రాబడితో బతకలేక సినిమాలకు రాద్దామని బొంబాయి చేరుకున్నాడు. తన మానవీయ, సామ్యవాద ధోరణులకు తగినట్టుగా ఒక సినిమాలో జీతం ఇవ్వని యజమానిపై కార్మికులు తిరగబడాలని రాశాడు. తర్వాత పెద్దగా సినిమాలు రాలేదు. తిరిగి కాశీకి చేరుకుంటే సొంత ప్రెస్ కార్మికులు జీతం కోసం సమ్మె చేశారు. పైగా సమ్మె చేయమని మీరే రాశారు కదా అన్నారు. ప్రేమ్‌చంద్‌కు అనారోగ్యం. క్షయ. జీవితాంతం నానా బాధలు పడ్డాడు. ఇంత గొప్ప కథకుడివి, నీ కష్టం ఏమిటి అని ప్రభుత్వం అడిగి ఉంటే ఆయన బతుకు మరోలా ఉండేది. తెలుగువారు గర్వించదగ్గ కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి పాఠకులను, కళాభిమానులను నమ్ముకుని ఫుల్‌టైమ్ రైటర్‌గా ఉన్నాడు. ఆయన ఆత్మకథ ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ చదివితే రచయితగా ఎన్ని సన్మానాలు పొందాడో బతకడానికి అన్నే అవస్థలు పడ్డాడని అర్థమవుతుంది. చివరి రోజుల్లో ఆయన ఒక ధనవంతునికి లేఖ రాస్తూ ‘నేను పోయాక నా భార్యకైనా సహాయం అందేలా చూడండి’ అని ప్రాథేయపడటం కనిపిస్తుంది.
నాజర్ బుర్రకథ చెబుతున్నాడంటే పల్లెల్లో టికెట్ షో కోసం కట్టిన అడ్డు తడికెలు జనం ధాటికి తెగి పడేవి. పల్నాటి వీరగాథను శౌర్యంతో పాడిన ఈ గాయకుడు చివరి రోజుల్లో శౌర్యంగా బతక లేక పోయాడు. సరైన ఇల్లు లేదు. అనారోగ్యం బాధించింది. ప్రభుత్వంలో పెద్దలందరికీ ఆయన తెలిసినా సరైన సమయంలో సహాయం అందలేదు. తమిళవాడైనా తెలుగు నేర్చుకుని తెనాలిలో ఉంటూ కథలు, నవలలు రాసిన శారద (నటరాజన్) హోటళ్లలో సర్వర్‌గా పని చేస్తూ దారుణమైన పేదరికంలో మరణించడం మనకే చెల్లింది. మద్రాసులో 1970ల కాలంలో జీతం చాలక కనిపించిన ప్రతివాణ్ణీ ‘ఓ ఫైవ్ ఉందా’ అని అడిగిన ప్రఖ్యాత తెలుగు కవిని చూసి, ఏడవలేక నవ్వి ముళ్లపూడి వెంకటరమణ ‘అప్పారావు’ పాత్రను సృష్టించాడని అంటారు. ఆ అప్పారావు ‘ఓ ఫైవ్ ఉందా’ అని అడగనివాడు లేడు. ఫైవ్ అంటే ఫైవ్ రూపీస్. ఒక కాలంలో ఫైవ్ రూపీస్ కోసం అల్లల్లాడిన కళాకారులు ఉన్నారు. నేడు ఓ ఫైవ్ థౌజండ్ కోసం చూసే వారూ ఉన్నారు.
‘కళ జమీందార్లకు మాత్రమే ఉండాల్సిన జబ్బు’ అనేవాడు కార్టూనిస్టు మోహన్. రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి శ్రీమంతులు, రాజా రవివర్మ వంటి మహరాజులు కళను అభిమానించి సాధన చేశారంటే వాళ్లకు తిండికి ఢోకా లేకపోవడం ఒక కారణం. కాని కళ పట్ల ఉన్మత్తతతో దాని కోసమే జీవితాన్ని వెచ్చించాలని అనుకుంటే ప్రతిపూటా భోజనం వచ్చి ‘నా చంగతేంటి?’ అని అడక్క మానదు. భార్య, సంతానం, సంసారం... వీరు కూడా! కళలో రాణించాలి, సంసారాన్ని పోషించాలి అనేది అనాదిగా ఈ దేశంలో కళాకారులు ఎదుర్కొంటున్న విషమ పరీక్ష. ‘పథేర్ పాంచాలి’ నవలలో 1910 నాటి కరువు రోజుల్లో ఆ తండ్రి పల్లెటూళ్లోని భార్యను, కొడుకును, కూతురిని ఆకలికి వదిలి, వారి కోసం నాలుగు అన్నం ముద్దలు వెతకడానికి కవిగా, నాటక రచయితగా రాణించడానికి పట్నం వెళతాడు. కాని అతను రాడు. అతని కూతురు దుర్గ సరైన తిండి, వైద్యం లేక మరణిస్తే ఆ దయ నీయమైన మరణం పాఠకుణ్ణి వదలదు. కళకు ఈ దేశంలో పేదరికం అనే వదలని నీడ ఉంటుంది.
ఆశ్రయం పొంది కళ రాణించింది చాల్నాళ్లు. రాజాశ్రయం, జమీందార్ల ప్రాపకం సంపాదించిన కళాకారులు తిండి నిశ్చింతతో బతికారు. అలా ఆశ్రయం పొంద నిరాకరించినవారు, పొందలేక పోయిన వారు ఎన్నో బాధలు పడ్డారు. నిజమైన కళాకారులు ‘జీ హుజూర్’ కొలువుకూ, జీతం రాళ్ల ఉద్యోగాలకు ఒదగరు. గొప్ప ప్రతిభ కలిగి, తమ కళతో సమాజానికి ఉల్లాసము, చైతన్యము, పరివర్తన ఇవ్వగలిగిన కళాకారులు ఎందరో నేడు కళను ‘వీలున్న సమయాల్లో’ సాధన చేస్తూ మిగిలిన సమయమంతా బతుకు తండ్లాటలో గడపవలసి వస్తున్నదన్నది వాస్తవం. కెనడా వంటి దేశాలలో ‘నేనొక నవల రాస్తాను’ అని దరఖాస్తు చేసుకుంటే పని చేసే సంస్థ పూర్తి శాలరీతో ఏడాది నుంచి రెండేళ్ల కాలం సెలవు మంజూరు చేసే వీలుందట. నవలాకారుడు గార్షియా మార్క్వెజ్ తన భార్యతో ‘ఒక రెండేళ్లు ఇంటిని నెట్టుకు రాగలవా? పైసా ఇవ్వలేను. నవల రాసుకుంటాను’ అనంటే ఆమె ‘సరే’ అంది. ఆమె ఇల్లు చూసుకోవడం వల్ల మార్క్వెజ్ ‘హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ అనే క్లాసిక్ రాశాడు. నిజానికి ఆ రెండేళ్లు ఇంటిని నెట్టుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిది!
కళాకారులు పరోక్ష శాసనకర్తలు. వారు సమాజానికి నైతిక పాలననూ, సాంస్కతిక విలువలనూ కల్పిస్తారు. ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను అచ్చు వేయగలదు. కాని కళాకారులే ఏది మంచో, ఏది చెడో జనులకు కళాత్మక పద్ధతిలో హదయాలకు ఎక్కేలా చేస్తారు. అందుకే కళాకారుల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కూడా! తెలంగాణ ప్రభుత్వం పన్నెండు మెట్ల కిన్నెర వాద్యకారుడు మొగిలయ్యకు నివాసం, ఉపాధికి కోటి రూపాయలు మంజూరు చేయడం సంతోషకరమైన అంశం. ఇలా సమాజానికి ఉపయోగపడే, సీరియస్ కళాసాధనలో ఉండే సహాయం అందితే గొప్ప కళాసృష్టి చేయదలిచే కళాకారులకు మరింత నిర్మాణాత్మక పద్ధతిలో ప్రభుత్వ మద్దతు అందే ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కళాకారుల జీవన సమర్థనకు అవసరమైన ప్రయత్నాలు మొదలెట్టాలి. నకిలీ, కృత్రిమ, విశృంఖల, హానికారక వినోద కళల నుంచి దేశ ప్రజలను కాపాడాలన్నా, ప్రాదేశిక సంస్కృతిని నిలబెట్టుకోవాలన్నా ముందు కళాకారులను బతికించుకోవాలి. కళ బతుకు గాక కళాకారుని ఊపిరి యందు!
Comments
Please login to add a commentAdd a comment