జనతంత్రం
పిడుగులు పడే సమయంలో మన పూర్వీకులు అర్జునుడి పేరును తలుచుకునేవారు. ఆయనకున్న పది పేర్లనూ గటగటా చదివేస్తే ఆ పిడుగుల్ని అర్జునుడు ఆకాశంలోనే బంధిస్తాడని ఓ నమ్మకం. ప్రకృతి కురిపించే పిడుగుల భయం పోగొట్టడానికి ప్రజలకు ఈ అర్జున నామస్మరణ ఉపకరించింది. మరి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే పిడుగులు కురిపిస్తే... ఎవరి నామ స్మరణ చేయాలి? నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ జంటలోని నరుడే అర్జునుడు. కనుక ఇప్పుడు కూడా నరుడే మనకు దిక్కు! పిడుగులు కురిపించే ప్రభుత్వాలను ఎదిరించే శక్తి ప్రజలకే ఉన్నది.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా జనం మీద వరసగా పిడుగుల్ని కురిపిస్తున్నాయనే అభిప్రాయం బలపడుతున్నది. రెండింటి మధ్య కొంచెం తేడా ఉన్నది. తెలంగాణలోని రేవంత్ సర్కార్ సర్జికల్ స్ట్రయిక్స్ తరహాను ఆశ్రయిస్తుంటే, ఏపీలో ఉన్న బాబు సర్కార్ కార్పెట్ బాంబింగ్ నమూనాను ఎంచుకున్నది. నిన్నటి తాజా ఉదంతాలు ఈ తరహా ఆపరేషన్‌కు గట్టి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చేమో! జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన మన తెలుగు నటుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం టార్గెటెడ్ సర్జికల్ స్ట్రయిక్‌గానే చాలామంది భావిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న ‘స్వర్ణాంధ్ర–2047’ పేరుతో ఓ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు.
కార్పెట్ బాంబింగ్
పాతికేళ్ల కింద చంద్రబాబు ప్రకటించిన ‘విజన్–2020’కి కొనసాగింపే ‘స్వర్ణాంధ్ర–2047’. అంతేకాకుండా గతేడాది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ‘వికసిత భారత్– 2047’ పత్రానికి అనుబంధ పత్రంగా ఇది తయారైంది. ప్రపంచ బ్యాంకు ప్రవచించే అభివృద్ధి నమూనాకు నకళ్లు కావడమే ఈ పత్రాలన్నింటిలో ఉన్న ఉమ్మడి లక్షణం. ఈ నమూనా ఫలితంగా సాధించిన ఆర్థికాభివృద్ధి సమాజంలో అసమానతలను కనీవినీ ఎరుగనంత స్థాయిలో పెంచిందనేది ఒక వాస్తవం! ఆర్థికవృద్ధి లెక్కల్లో కనిపించింది. బహుళ అంతస్థుల భవంతుల్లో కనిపించింది. పెరుగుతున్న విమానయానాల్లో కనిపించింది. అదే సంద ర్భంలో చితికిపోతున్న బతుకుల్లో కూడా కనిపించింది. వేలాది మంది రైతులూ, చేతివృత్తిదారుల బలవన్మరణాలకు సాక్షి సంత కాలు పెట్టిన ఉరితాళ్లలో కూడా కనిపించింది.
భారతీయ వ్యవసాయ రంగాన్ని, చేతివృత్తులను దారుణంగా దెబ్బతీసిన బ్రిటిష్ హయాంతో పోల్చినా కూడా ‘విజన్–2020’ తొలి ఐదారు సంవత్సరాల్లో ఈ రంగాల్లో ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. మెజారిటీ ప్రజల ఆదాయా లను పెంచే చర్యలు తీసుకోకుండా వస్తు, సేవల లభ్యతను పెంచడాన్ని ప్రోత్సహించే ఆర్ఢిక విధానాలను అనుసరించడమే ఈ నియో లిబరల్ – ప్రపంచ బ్యాంకు ఆర్థిక మోడల్. దీన్నే ‘సప్లై సైడ్ ఆఫ్ ఎకనామిక్స్’ అంటారు. దీని కారణంగా గడచిన మూడు దశాబ్దాల్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగి పోయాయి.
ఈ రకమైన ఆర్థిక ధోరణి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వ యిజర్ అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు. నిఫ్టీలో లిస్టయ్యే టాప్ 500 కంపెనీల ఆదాయం గత పదిహేనేళ్లుగా పెరుగుతూనే ఉన్నది. కానీ ఆ సంస్థలు సిబ్బందిపైన చేసే ఖర్చు మాత్రం తగ్గిపోతున్నది. ఈ ధోరణి వల్ల మార్కెట్‌లో డిమాండ్ తగ్గి పోతుందనీ, ఫలితంగా పారిశ్రామికవేత్తలు కూడా నష్టపోవలసి వస్తుందనీ ఆయన చెప్పారు.
ఈ ఆర్థిక మోడల్ పరిధిలోనే కొద్దిపాటి సర్దుబాటు చేసుకోవాలని పెట్టుబడిదారులకు ఆయన హితవు చెబుతున్నారు. ఇది ఎంతమంది చెవికెక్కుతుందో చూడాలి. జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలో డీబీటీ ద్వారా జనం చేతిలో డబ్బు పెట్టడం సత్ఫలి తాలనిచ్చింది. కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో దేశమంతటా జీఎస్‌టీ వసూళ్లు తగ్గిపోగా ఏపీలో పెరుగుదల నమోదైంది. ఈ రకంగా డిమాండ్ సైడ్‌ను సిద్ధం చేయకుండా ప్రపంచ బ్యాంకు నమూనాను గుడ్డిగా అనుసరిస్తే కొద్దిమంది సంపద పోగేసుకుంటారే తప్ప ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం తథ్యం.
చంద్రబాబు కొత్తగా ప్రకటించిన ‘స్వర్ణాంధ్ర–2047’ పత్రంలో కూడా విశాల ప్రజానీకపు కొనుగోలు శక్తిని పెంచే కార్యక్రమం ఒకటి కూడా లేదు. వట్టి పడికట్టు పదజాలం మాత్రమే ఉన్నది. ‘సూపర్ సిక్స్’ మేనిఫెస్టో కంటే మిన్నగా అరచేతిలో వైకుంఠాన్ని చంద్రబాబు సర్కార్ ఈ పత్రం ద్వారా చూపెట్టింది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రాసుకున్నారు. ఇది సువిశాలమైన బ్రెజిల్ దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ. రెండు మెగా పోర్టులను నిర్మిస్తామని చెప్పారు.
కానీ ఇప్పటికే జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు పోర్టుల నిర్మాణం ప్రారంభించారని మాత్రం చెప్పలేదు. ఏఐ, డీప్ టెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తామనే ఊకదంపుడు సరేసరి! రైతుల ఆదాయాలు పెంచుతూ, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని కూడా చెప్పారు. పనిలో పనిగా అప్పటికి నూరు శాతం అక్షరాస్యతను సాధిస్తామని కూడా చెప్పారు. ఈ నాలుగైదేళ్లలో నూరు శాతం అక్షరాస్యతను సాధించి, 2047 నాటికి నూరు శాతం డిజిటల్ లిటరసీని సాధిస్తే తప్ప ఈ డాక్యు మెంట్‌లోని గొప్పలు సాధ్యం కావు.
పేదవర్గాల ప్రజలు నూటికి నూరు శాతం డిజిటల్ లిటరసీ సాధించగల విద్యావిధానానికి తాను వ్యతిరేకం కనుకనే అక్షరాస్యత రంగంలో తాబేలు నడకను ఎంచుకుని, మిగతా అంశాల్లో ఆకాశానికి నిచ్చెనలు వేశారనుకోవాలి. దేశంలో అత్యధిక ప్రజానీకం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగం, చిన్న, సూక్ష్మ పరిశ్రమల్లోని వారిలో కొనుగోలు శక్తి పెరగకుండా వీరు చెప్పుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యమవుతుంది? జగన్ ప్రభుత్వం అమలుచేసిన ‘రైతు భరోసా’ను ఎగరగొట్టారు.
ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. కనీస మద్దతు ధర గురించి ఊసే లేదు. ఇవేమీ లేకుండా రైతుల ఆదాయాలు ఏ రకంగా పెరగగలవో వివరించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. టెక్నా లజీని విరివిగా వినియోగించడం వలన ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ వైరుధ్ధ్యాన్ని ఎలా అధిగమించగలమన్న వివరణ జోలికి పోలేదు.
‘నేను ’95 మోడల్ చంద్రబాబున’ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించుకున్నారు. అంటే ప్రపంచ బ్యాంకు పోస్టర్ బాయ్ మోడల్! పారిశ్రామికవేత్తలకూ, పెట్టుబడిదారులకూ వనరులన్నీ కట్టబెట్టాలి. ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలి. సామాన్య ప్రజలకు మాత్రం ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు. సబ్సిడీలు ఇవ్వకూడదు. ఇది ప్రపంచ బ్యాంకు విధానం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) అనే మూడు సూత్రాలు దీని వేద మంత్రాలు. ప్రజల్లో చైతన్యం పెరుగు తున్నకొద్దీ సామాజిక పెన్షన్ల లాంటి ఒకటి రెండు విషయాల్లో కొద్దిగా మినహాయింపులు ఇచ్చారు.
చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఏ ఒక్కదాన్నీ అమలుచేయకపోవడానికి కారణం ఆర్థిక పరిమితులు కాదు. ఆయన అవలంబించే ఆర్థిక సిద్ధాంతం అసలు కారణం. తెచ్చే అప్పులు అమరావతి కోసం, అంత ర్జాతీయ కాంట్రాక్టర్ల కోసం, అందులో కమిషన్ల కోసం ఖర్చు పెడతారే తప్ప సామాన్య ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ఖర్చుపెట్టరు. ‘స్వర్ణాంధ్ర–2047’ పేద ప్రజలపై జరగబోయే కార్పెట్ బాంబింగ్ లాంటిది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల వాతలతో ప్రారంభమైంది. ఇకముందు అన్ని రంగాలకూ విస్తరించ నున్నది.
రేవంత్ సర్కార్ సర్జికల్ స్ట్రయిక్స్!
ఏడాది కింద తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. హామీ ఇచ్చిన రైతు రుణమాఫీలో మూడింట రెండొంతుల మేరకు పూర్తి చేయగలిగారు. ఇంకా ఒక వంతు మిగిలే ఉన్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ఇక మిగిలిన గ్యారెంటీలన్నీ గ్యారెంటీగా అటకెక్కినట్టే! పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లయితేనేమీ, కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్లయితేనేమి 50 వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రకటించారు.
అయినప్పటికీ ఏడాది పూర్తయ్యేసరికి కేసీఆర్ ప్రభుత్వమే మేలన్న అభిప్రాయం జనంలో ఏర్పడుతున్నదనే వార్తలు వస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలుండవచ్చు. ప్రధాన కారణాల్లో ఒకటి ఎంపిక చేసుకున్న టార్గెట్లపై చేస్తున్న సర్జికల్ స్ట్రయిక్స్. ఇది కాకతాళీయమో, వ్యూహాత్మకమో తెలియదు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతున్నది.
నిన్నటి అల్లు అర్జున్ అరెస్ట్ సంగతే చూద్దాం. సంధ్య టాకీస్ దగ్గర జరిగిన దుర్ఘటనపై బాధపడని వారుండరు. ఖండించని వారుండరు. ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉన్నదో నిర్ధారణకు రాకుండానే ఎకాయెకిన అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, అదీ బెయిల్ దొరక్కుండా వారాంతంలో చేయడం, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఒక్క రాత్రయినా సరే జైల్లో ఉంచాలన్న పంతం ఈ మొత్తం వ్యవహారంలో కనిపించింది.
అనేక సందర్భాల్లో సెలబ్రిటీలు అనేవాళ్లు తప్పుచేసి దొరికి పోవడం జరిగింది. అటువంటి వాళ్లు కూడా జైలుకెళ్లిన సంద ర్భాలు తక్కువ. అల్లు అర్జున్ పాత్ర ఈ వ్యవహారంలో ఉన్నద నేందుకు తగిన కారణాలు కూడా కనిపించడం లేదు. ఉన్నా నిర్ధారణ కాలేదు. ఎందుకని అంతగా టార్గెట్ చేశారో తెలియదు. ఈ ఘటన వల్ల అల్లు అర్జున్‌కు సానుభూతి మాత్రం పెరిగింది.
చట్టం తన పని తాను చేసుకొని పోవాల్సిందే! సెలబ్రిటీలు అయినంతమాత్రాన నేరం చేసిన వారికి మినహాయింపులు ఉండకూడదు. అట్లాగే సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారు టార్గెట్ కాకూడదు. చట్టం తన పనిని తాను ఎటువంటి వివక్ష లేకుండా చేసుకొనిపోవాలి. అసలెందుకు తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ టార్గెట్ కావలసి వచ్చింది.
అందుకు బయ టకు కనబడే కారణాలైతే ఏవీ కనిపించడం లేదు. ఉంటేగింటే ఏపీ ప్రభుత్వానికి ఓ ఆవగింజంత కారణం ఉండాలి. ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడైన రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతుగా అర్జున్ నంద్యాలకు వెళ్లారు. ప్రచారం చేయలేదు గానీ, ఆ సమయంలో వెళ్లడం, ఆ మిత్రుడు వైసీపీ అభ్యర్థి కావడం వల్ల కూటమి పార్టీలకు కంటగింపు కలిగించి ఉండ వచ్చు.
ఆ ప్రభుత్వం కళ్లల్లో ఆనందం చూడటానికి వీళ్లు, ఈ ప్రభుత్వం కళ్లల్లో ఆనందం చూడటానికి వాళ్లు పనిచేసేంత సాపత్యం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నదా? లేకపోయినా అటువంటి ఊహాగానాలు చేయడానికి అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం అవకాశం కల్పించింది. అక్రమ నిర్మాణాలు కూల్చే పేరుతో ‘హైడ్రా’ను రంగంలోకి దించడం ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారింది.
ఆ కూల్చివేతల్లో కూడా అక్కినేని నాగార్జున వంటి కొందరిని టార్గెట్ చేయడం, మిగతా వాళ్లను వది లేయడం ప్రశ్నార్థకంగా మారింది. ‘హైడ్రా’ భయంతో హైద రాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నగదు చలామణీ మందగించడం వలన ఇతర వ్యాపార రంగాలపై, చుట్టుపక్కల జిల్లాలపై దాని ప్రభావం పడింది. అవసరాలకు భూము లమ్ముకుందామనుకున్న రైతులు కొనే నాధుడు కనిపించక అవస్థలు పడుతున్నారు.
అక్రమ నిర్మాణాల తాట తీయవలసిందే! ఇకముందు జరగకుండా గట్టి హెచ్చరికలు పంపవలసిందే! కానీ, ఈ మంచి కార్యక్రమాన్ని దుందుడుకుగా ప్రారంభించడం, కొందరినే టార్గెట్ చేయడం వ్యవస్థలో దుష్ఫలితాలకూ, ప్రభుత్వంపై నెగెటివ్ ఇమేజ్‌కూ కారణమైంది. ఇటు వంటి సర్జికల్ స్ట్రయిక్స్‌ను ఏడాది కాలంలో ఒక డజన్ దాకా ఉదాహరించవచ్చు. ఈ ధోరణి వదులుకొని, చేసిన పనులు చెప్పుకునే పాజిటివ్ మార్గంలో వెళ్తేనే ప్రభుత్వానికీ, ప్రజలకూ క్షేమకరం!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment