కన్నీటి కిన్నెర
పురాణ ప్రశస్తి పొందిన శతాబ్దాల నాటి అపురూప వాద్య పరికరం కిన్నెర. ఎలక్ట్రానిక్ వాయిద్యాల హోరులో అంతరించే దశకు చేరుకుంది. ఇప్పుడు దాని తయారీని పట్టించుకునే వారే లేరు. అలాంటి అరుదైన కిన్నెరను నేటికీ మీటుతున్న ఏకైక కళాకారుడు దర్శనం మొగులయ్య (63). కిన్నెరపై ఆయన చేసే స్వర విన్యాసాన్ని విన్నవారు, కన్నవారు ఎన్ని ప్రశంసలు కురిపిస్తున్నా, ఆ కళాకారుడికి పూట గడవడమే కష్టంగా ఉంటోంది. తరతరాలుగా నమ్ముకున్న కిన్నెర తనకు అన్నం పెట్టకున్నా, అదే తన ప్రాణమని చెబుతున్న మొగులయ్య గురువారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో కచేరీ ఇచ్చాడు. ఈ సందర్భంగా పలకరించినప్పుడు ‘సిటీప్లస్’తో తన అనుభవాలను పంచుకున్నాడు. అవి ఆయన మాటల్లోనే...
ఈ కిన్నెరను మా తాతల కాలంలో తయారు చేశారు. దాన్నే మార్చుకుంటొస్తున్న. దీన్ని వాయించడం ఇంకెవ్వరికీ రాదు. నాకొస్తది. ఎంత బాగా వినిపించినా ఏం లాభం? కూటికొస్త లేదు, గుడ్డకొస్త లేదు ఈ విద్య. ఇంటిని నడపాలంటే కూలిపనే దిక్కు. ఇంతకు ముందు కూడా ఈ కళ అన్నంపెట్టనప్పుడు ఐదేళ్లు మట్టిపని చేసిన. కానీ, కిన్నెరను చూస్తే పాట మొదలెట్టాలనిపిస్తది. నా మూడో కొడుకుకు మూర్ఛరోగం. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో ఉన్న పెద్దపెద్ద దవాఖానలన్నీ తిరిగిన. అప్పుసొప్పుజేసి మూడు లక్షలదాకా ఖర్చుపెట్టిన. అవన్నీ ఇప్పుడు గుండెమీదున్నయి.
పిల్లలు నేర్వరు..
ఉండ ఇల్లు లేదు. దున్న భూమి సంపాదించలేదు. బుక్కెడు బువ్వ అడుక్కోవడానికి పనికొచ్చే ఈ విద్యను నేర్చుకోం అంటున్నరు నా కొడుకులు. ముత్తాతల నుంచి వస్తున్న ఈ కళను ఈ తరమోల్లు కూడా అందుకోవాలని, అట్ల దీని సప్పుడు ఆగిపోవద్దని నా కోరిక. నా కుటుంబం ఎల్లే దారి దొరికితే నాకొచ్చిన ఈ విద్యను పదిమందికీ నేర్పిస్త.
మనసున్నోళ్లు ఎందరో...
ఈ కళ నాతోనే పోవద్దని దాసరి రంగ( తెలుగు యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్) ఎంతో ప్రోత్సహించినరు. దీని గురించి పేపర్ల రాసి ఎక్కడెక్కడో ప్రదర్శనలు ఇప్పించిండు. ప్రదర్శనలకు రావడానికి, ఇల్లు రిపేర్‌కు రంగయ్య సారే పైసలిచ్చిండు. లామకాన్‌లో ప్రదర్శన కోసం పైసల్లేక బస్టాండులో దిక్కుతోచక నిలుచుంటే భువనగిరి మారాజు సుధాకర్ సార్ టికెట్ పైసలిచ్చిండు. మూడువేల కోసం అప్పులోల్లు నా కిన్నెరను జప్తు చేసుకుంటే, లాయర్ సార్ (సీవీఎల్ నరసింహారావు) సాయం చేసిండు. గుర్తింపునకు కొదువ లేకపోయినా, దినదినం తిండికి తడుముకోవాల్సి వస్తోంది.
కదిలివచ్చిన కళాభిమానులు
మెట్ల కిన్నెర వాయిస్తూ తెలంగాణ వీరగాథలను అద్భుతంగా వినిపించే మహబూబ్‌నగర్ వాయిద్యకారుడు మొగులయ్య ప్రదర్శనకు జానపద కళాభిమానులు ఎంతోమంది కదిలి వచ్చారు. పండుగ సాయన్న, పానుగంటి మీరాసాహెబ్, వంగ పకీరయ్య కథలను ఆయన వినిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. దయనీయ స్థితిలో వున్న ఈ పేద కళాకారుడికి అక్కడికి వచ్చిన పలువురు తమకు తోచిన విధంగా విరాళాలు అందచేశారు. లామకాన్‌లో జరిగిన ఈ ప్రదర్శన వాగేశ్, శ్రీశైలం ఏర్పాటు చేశారు. సినీ దర్శకులు అజిత్ నాగు, అవసరాల శ్రీనివాస్.. రచయితలు సంగిశెట్టి శ్రీనివాస్, ఎస్.జగన్, రిటైర్డ్ ప్రొఫెసర్‌లు కిషన్‌రావ్, రాములు, కళాకారులు నిస్సార్, బైరాగి, గడ్డం యాదగిరి, కార్టూనిస్ట్ శివాజీతో పాటు రేడియో, టీవీలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఇదీ పరంపర...
పన్నెండేళ్ల బాల్యం నుంచే కిన్నెరతో చెలిమి చేసిన మొగులయ్య పూర్వీకులు కాశీం, వెంకటరాముడు, మొగులాన్, రాములయ్య, ఎల్లయ్యలు. ఎల్లయ్య కొడుకే మొగులయ్య. యాభయ్యేళ్లుగా కిన్నెరతో సావాసం చేస్తున్న మొగులయ్య ఆత్మాభిమానం ఉన్న కళాకారుడు. ఎన్నడూ చేయిచాచి ఎరుగడు. వెదురు, గుండ్రటి సొరకాయలు, తేనె, మైనం, తీగలు, ఎద్దుకొమ్ములు, అద్దాలతో ఎంతో నేర్పుతో ఈ కిన్నెర వాద్యాన్ని ఆయన పూర్వీకులు తయారు చేశారు. పానుగంటి మీర్‌సాబ్ కథ, ఎండమెట్ల ఫకీరయ్య, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ వంటి తెలంగాణ కథలను మొగులయ్య వినసొంపైన తన వాద్యంతో హావభావ సహితంగా వినిపిస్తాడు. ఆయన ప్రదర్శనను తిలకించిన వారు మళ్లీ మళ్లీ తిలకించాలనుకుంటారు. కిన్నెర కమ్మదనాన్ని పదే పదే ఆస్వాదించాలనుకుంటారు. ఈ కన్నీటి కిన్నెరను ఆదుకోదలచినవారు ..9505513891నంబరుకు ఫోన్ చేయండి.
- ఓ మధు