Folk Artist
-
చరిత్రను తిరగరాశారు.. రంగస్థలానికి కొత్త వెలుగు తెచ్చారు
తమిళనాడులోని పురాతన నృత్య–నాటక రూపం ‘కట్టై కుట్టు’లో మహిళల ప్రాతినిధ్యం ఏ రకంగానూ ఉండేది కాదు. ‘కట్టై కుట్టు’ అంటే ‘పురుషులకు మాత్రమే పరిమితమైన కళారూపం’గా ఉన్న పేరును భారతి తమిళవనన్ బృందం మార్చే ప్రయత్నం చేస్తోంది. ‘కట్టై కుట్టు’కు సంబంధించి నటన, సాంకేతికత, సంగీతం, దర్శకత్వం లాంటి వివిధ విభాగాల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శిస్తోంది. ఎంతో మంది ఔత్సాహికులకు స్ఫూర్తి ఇస్తోంది.... కాంచీపురంలో 33 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ‘కట్టై కుట్టు సంఘం’ పురాతన కళాసంప్రదాయం అయిన కట్టై కుట్టును సజీవంగా ఉంచడానికి అంకితం అయింది. ఆ పురాతన కళారూపాన్ని ఈ తరానికి పరిచయం చేయడంతోపాటు ‘ఈ కళలో మహిళలు అద్భుతాలు సృష్టించగలరు’ అని నిరూపించింది. ‘కట్టై కుట్టు నేర్చుకోవడానికి ఆడా, మగా తేడా లేదు. కులం, మతం అడ్డు కాదు అని చెప్పాలనుకున్నాం’ అంటారు కట్టై కుట్టు నిర్వాహకులు. ‘కట్టై కుట్టు’ ప్రదర్శన ఆషామాషీ కాదు. ఖరీదైన అలంకరణతో కూడిన ఓపెన్–ఎయిర్ ప్రదర్శన.సంగీతం, పాటలు, మాటలను ఏకతాటిపైకి తెచ్చి ప్రేక్షకులను రంజింప చేయాలి. ‘ఇంత క్లిష్టమైన కళకు మహిళలు అర్హులు కాదు’ అనే భావనను ‘కట్టై కుట్టు సంఘం’ తొలగించింది. మహిళల అద్భుత కళాప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చింది. మొదట్లో మహిళలను రంగస్థలం మీదికి తీసుకురావడం అనేది అంత తేలిగ్గా జరగలేదు. పురుషులతో కలిసి నటించడానికి కొందరు మహిళలు నిరాకరించారు. కొందరు ఒప్పుకున్నా వారి తల్లిదండ్రులు అభ్యంతర పెట్టారు. ‘ఇదేమైనా ప్రభుత్వ ఉద్యోగమా! తినడానికి తిండి కూడా దొరకదు’ అని కొందరు నిట్టూర్చారు. అయితే ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ కళాప్రియులైన మహిళలను రంగస్థలం మీదికి తీసుకురాగలిగారు. వారిలో నిండైన ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగారు. ‘మీరొక చారిత్రక ఘట్టంలో భాగం అవుతున్నారు’ అని చెప్పారు. ఆ మహిళా కళాకారులు చారిత్రక ఘట్టంలో భాగం కావడమే కాదు చరిత్రను తిరగ రాశారు.‘కట్టై కుట్టు’కు కొత్త వెలుగు తీసుకుచ్చారు. ‘కట్టై కుట్టు’ సంఘంలోని వారందరూ వివాహిత మహిళలే. డిగ్రీ పూర్తి చేసిన వారే. ‘బాడీ మూమెంట్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్, ఒక పెద్ద డైలాగ్‌ను సంగీతంతో మిళితం చేసే విధానంతో కూడిన కట్టై కుట్టు కళారూపాన్ని మహిళా కళకారులు కూడా అద్భుతంగా చేయగలరని నిరూపించాం’ అంటుంది భారతి తమిళవనన్. ఆమె గత పన్నెండు సంవత్సరాలుగా ‘కట్టై కుట్టు’ ప్రదర్శనలు ఇస్తోంది. ఎంతోమంది మహిళలకు నేర్పిస్తోంది. భారతీ కళాకారుల కుటుంబం నుంచి రాలేదు. తన స్వగ్రామం వేలూరులో కట్టై కుట్టు కళాకారులను చూస్తూ పెరిగింది, ‘ప్రదర్శన కోసం వేరే గ్రామాలకు వెళ్లినప్పుడు పురుషులు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు. అలాంటి వారికి మేము మా ప్రతిభతోనే తగిన సమాధానం చెబుతాం. మహిళలు చేయలేరు అన్నవారే ప్రదర్శన తరువాత మమ్మల్ని ప్రశంసించడం మరిచిపోలేని విషయం’ అంటుంది తమిళి జ్వాననన్. వివాహ సమయంలో తప్ప ప్రదర్శనకు ఎప్పుడూ సెలవు ఇవ్వలేదు తమిళి జ్వాననన్. ప్రముఖ కళాకారిణి సంగీత ఈశ్వర్ దగ్గర కట్టై కుట్టు, భరతనాట్యం నేర్చుకున్న తిలగావతి పళని ‘శ్రీకృష్ణ కట్టై కుట్టు కుజు’ పేరుతో స్వంత కట్టై కుట్టు పాఠశాలను నడుపుతోంది. ‘కట్టై కుట్టు కళాకారులు నిరక్షరాస్యులు , మహిళలు ఈ కళారూపానికి తగరు...లాంటి ఎన్నో అపోహలను బద్దలు కొట్టాం’ అంటుంది పళని. ప్రస్తుతం ఆమె తన పాఠశాల ద్వారా 65 మంది విద్యార్థులకు ‘కట్టై కుట్టు’లో శిక్షణ ఇస్తోంది. ప్రతిష్ఠాత్మకమైన ‘కట్టై కుట్టు గురుకులం’ ద్వారా గ్రామీణ ప్రాంతంలోని పిల్లలకు ‘కట్టై కుట్టు’లో శిక్షణ ఇస్తోంది కట్టై కుట్టు సంఘం. వీరిలో నుంచి భారతిలాంటి ఎంతో మంది అద్భుత కళాకారులు రంగస్థల ప్రపంచానికి పరిచయం కావచ్చు. ప్రతి సంవత్సరం ‘కట్టై కుట్టు సంఘం’ కాంచీపురంలో పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచం నలుమూలల ఉన్న కళాభిమానులను ఈ ఉత్సవం ఆకట్టుకుంటోంది. ఎన్నో అవరోధాలు అధిగమించి... మా ఊళ్లో కట్టై కుట్టు కళాకారులను చూస్తూ పెరిగాను. నేను కూడా వారిలాగా చేయాలి అని కలలు కనేదాన్ని. అయితే పెరిగి పెద్దయ్యే క్రమంలో కట్టై కుట్టు రంగస్థలంపై అడుగు పెట్టడానికి ఎన్ని అవరోధాలు ఉన్నాయో తెలిసింది. అయినా సరే, ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లాను. తల్లిదండ్రులు ప్రోత్సహించారే తప్ప అభ్యంతర పెట్టలేదు. ఈ పురాతన కళారూపంలోకి మరింత మంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను. – భారతి తమిళవనన్ -
అమెరికాలో ఘనంగా జానపద జాతర
-
లాలూ కొడుకు ఇంట చోరీ!
పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ పర్యావరణ, అటవీశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో దొంగతనం జరిగింది. జానపద కళాకారులు తన నివాసంలో ఖరీదైన వస్తువులను దొంగిలించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తేజ్ ప్రతాప్ యాదవ్ సన్నిహితుడు మిసాల్ సిన్హా మార్చి 10న సచివాలయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన కళాకారులు దీపక్ కుమార్, మరో ఐదుగురు కలిసి ఈ దొంగతనం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాట్నాలోని తన ప్రభుత్వ బంగ్లాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన జానపద కళాకారులు ప్రదర్శన ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ నెల 9న వారు తిరిగి వెళ్లిన తర్వాత ఇంట్లో రూ. 5 లక్షల విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. అయితే ఈ వస్తువుల గురించి సదరు కళాకారులను అడిగినప్పటికీ ఏమీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే తేజ్ ప్రతాప్ నివాసంలో బృందావనం జానపద కళాకారులు ఏయే వస్తువులు అపహరించారనేది ఇంకా తెలియాలేదని స్టేషన్ ఇంచార్జ్ భగీరథ్ ప్రసాద్ తెలిపారు. -
ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు
కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలలో అవార్డు గ్రహీతగా నిలిచిన సకిన రామచంద్రయ్య తెలంగాణ ఆదివాసీ జానపద కళాకారుడు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్కల పోరాట వీర గాథలను, కోయల ఇలవేల్పుల కథలను డోలి సహాయంతో పొల్లు పోకుండా చెప్పడంలో నేర్పరి. సకిన రామచంద్రయ్యది కోయదొరల వంశం. కోయజాతిలో సంప్రదాయ వేడుకలను జరిపించడంలో డోలీలు ప్రధాన భూమిక పోషిస్తారు. డోలి ఉపతెగకు చెందిన రామచంద్రయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం కూనవరం గ్రామంలో ముసలయ్య, గంగమ్మలకు 1960లో జన్మించాడు. ఈ పద్మశ్రీ గుర్తింపు ఆయన పేదరి కాన్ని ఆదుకోలేకపోయినా మరుగున పడుతున్న డోలికళకు పునరుజ్జీవం తేగలుగుతుంది. గిరిజనుల ఇలవేల్పుల చరిత్రని ఉయ్యాల పాటలు పాడుతూ చెప్పడంలో దిట్ట రామచంద్రయ్య. చదువు కోలేకపోతేనేం... ఆదివాసీల మూలాలు, సంప్రదా యాలని గడగడ చెప్పేస్తాడు. వనదేవతల కథల్ని అక్షరం పొల్లు పోకుండా చెప్తాడు. ఆదివాసుల జాతరల్లో, పండుగల్లో రామచంద్రయ్య పాట ఉండాల్సిందే. (క్లిక్: మన తెలుగు పద్మాలు వీరే...) డోలీ అంటే – రెండు అడుగుల వెడల్పు, మరి కొద్ది ఎక్కువ పొడవుతో వుండే చర్మవాద్యం. ఈ వాద్యాన్ని ఎక్కువగా కోయల ప్రత్యేక పూజలో డోలీ కోయలు వాయిస్తారు. వీరు కోయ ప్రజల కొలుపులు, జాతరలు చేస్తారు. అంతేకాదు చావు, పుట్టుకలకి కర్మ కాండలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లు చేస్తారు. ఆ సమయంలో ఈ డోలు తప్పనిసరి. అంటే ఇది ఒక రకంగా అధికారిక కోయవాద్యం. పేరుకి డోలు అంటారు. కాని ఇది కోయ సంస్కృతికి మూలాధారం. డోలీలు ఈ డోలు వాయిస్తూ దాచి వుంచిన ‘పడిగె’ని తీసి వివిధ జాతర సందర్భాలలో పగిడిద్దరాజు, ఎరమరాజు, బాపనమ్మ, గడికామరాజు, గాదిరాజు, గోవిందరాజు, ఉయ్యాల బాలుడు, దూల రాజు, ఒర్రె మారయ్య, కొమ్ములమ్మ, గుంజేడు ముసలమ్మ వంటి కోయ తెగ వీరులు/ వివిధ గోత్రాల వారి కథలు చెబుతారు. ఈ వాద్యకారులు కోయ చరిత్రని, సంస్కృతిని కాపాడే చరిత్రకారులు. (చదవండి: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) తన ముగ్గురు కూతుళ్ళకు డోలీ కథల వారసత్వం రాకపోవడంతో ఇన్నాళ్ళు సంప్రదాయంగా కాస్తో కూస్తో జీవనోపాధి కల్పించిన ఈ కళ కనుమరుగు కాకూడదని తనయుడు బాబురావుకు నేర్పించే ప్రయత్నంలో ఉన్నాడు రామచంద్రయ్య. ప్రభుత్వం ఈ సంప్రదాయ డోలి కళకు ప్రాచుర్యం కల్పిస్తూ ఈ నిరుపేద గిరిజన కుటుంబాన్ని కూడా అన్నివిధాల ఆదుకోవాలని కోయగిరిజనులు కోరుతున్నారు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) – గుమ్మడి లక్ష్మినారాయణ ఆదివాసీ రచయితల వేదిక -
జానపద దిగ్గజం కన్నుమూత
సాక్షి, బనశంకరి (కర్ణాటక): నాటక కళాకారుడు, జానపద గాయకుడు బసవలింగయ్య హిరేమఠ (63) బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో ఆదివారం కన్నుమూశారు. బెళగావిలోని బైలూరు గ్రామానికి చెందిన ఆయన జానపద కళాకారునిగా ప్రసిద్ధి చెందారు. భార్య విశ్వేశ్వరి కూడా జానపద కళాకారిణి. ఈ దంపతులు అనేక జానపద ప్రదర్శనలు నిర్వహించారు. -
‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?
తెలంగాణ కిన్నెరనాదాన్ని గుర్తింపు లభించింది. అరుదైన.. అంతరించిపోయే కళకు జీవమొచ్చినట్టు అయ్యింది. బతుకుదెరువు కోసం పాటలు పాడుకుంటూ ఊరూరూ తిరిగిన కళాకారుడిని చిత్రసీమ గుర్తించింది. అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం అతడిని కళను గుర్తించి ప్రోత్సహించి సత్కరించింది. ఆ చర్యలు ఫలించి అంతరించిపోయే కళకు సజీవ సాక్షిగా ఉన్న దర్శనం మొగులయ్య గురించి తెలుసుకుందాం. లింగాల: జానపద పాటలనే జీవనోపాధిగా మార్చుకున్న దర్శనం మొగులయ్య, 12 మెట్ల కిన్నెర మొగులయ్యగా అందరికీ సుపరిచితుడు. పాన్‌గల్ మియాసాబ్, పండుగ సాయన్న వీరగాథ వంటివి కిన్నెర వాయిస్తూ పాడేవాడు. అనుకోకుండా వెండి తెరపై పాటలు పాడేందుకు అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్నాడు. సినీ కథానాయకుడు పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’లో ఇంట్రడక్షన్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో ఆయన ప్రయాణం వెండితెరపై వెలుగనుంది. ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట ప్రాంతానికి చెందిన మొగులయ్య గురించి స్థానికులకు తెలియడంతో మొగులయ్య వెండి తెరపై పాటలు పాడుతాడని అసలు ఊహించలేదని అంటున్నారు. గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి అతడికి పింఛన్ సౌకర్యం కల్పించింది. తమిళనాడు ప్రాంతంలో షూటింగ్.. భీమ్లానాయక్ చిత్రానికి అవసరమైన టైటిల్ సాంగ్ షూటింగ్ తమిళనాడులోని ఓ అటవీ ప్రాంతంలో జరిగింది. దీనికి మొగులయ్యకు అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి పాట పాడారు. అది నచ్చడంతో చిత్రంలో పెట్టినట్లు తెలుస్తోంది. జానపద కళలంటే ప్రాణం తాత, ముత్తాల వారసత్వంగా వచ్చిన జానపద పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం. సొంతంగా కిన్నెరను తయారు చేసుకొని గ్రామాల్లో కిన్నెరతో పాటలు పాడుతుంటా. ఇలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా కళను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించింది. నా కళ నచ్చి, మెచ్చిన వారి సాయంతో వెండి తెరపై పాట పాడే అవకాశం వచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు. - దర్శనం మొగులయ్య, కిన్నెర కళాకారుడు, అవుసలికుంట -
ప్రజాకవి నిస్సార్‌ను కాటేసిన కరోనా
సాక్షి, హైదరాబాద్: ప్రజాకవి, రచయిత, గాయకుడు, తెలంగాణ ప్రజానాట్యమండలి సహాయ కార్యదర్శి మహ్మద్ నిస్సార్‌ను (58) కరోనా కాటేసింది. ఈ మహమ్మారి సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం కన్నుమూశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు పడిన కష్టాలను బాధలను పేర్కొంటూ‘ముదనష్టపు కాలం.. ఇంకెంతకాలం’అంటూ ఇటీవలే ఓ పాట పాడారు. అదే ఆయన చివరి పాట. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో లక్షలాది మందిని ఉద్యమ పథంలోకి నడిపిన నిస్సార్‌ది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం. మహ్మద్ అబ్బాస్, హలీమా దంపతులకు 1962 డిసెంబర్ 16న ఆయన జన్మించారు. సుద్దాల హనుమంతుతోపాటు సుద్దాల అశోక్‌తేజ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న నిస్సార్.. సీపీఐ కార్యకర్తగా, తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారుడిగా తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన పదునైన కంచుకంఠంతో పాడిన పాటలు గొప్ప చైతన్యాన్ని కలిగించాయి. ఈ క్రమంలో ప్రజాగాయకుడు గద్దర్ స్ఫూర్తిని అందుకుని ఎన్నో పాటలు పాడారు. పలు కవితలు కూడా రాశారు. దోపిడీ, పీడనలు, అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రజానాట్యమండలి సహా పలువురి సంతాపం.. నిస్సార్ మృతిపట్ల తెలంగాణ ప్రజా నాట్యమం డలి రాష్ట్ర కౌన్సిల్ తీవ్ర సంతాపం ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ఆట–పాట–మాట, ధూంధాం కార్యక్రమాల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తూ, ప్రజల సమస్యలను ఇతివృత్తాలుగా చేసుకుని అనేక జానపద గేయాలు, ప్రజల పాటలను రాసిన వాగ్గేయకారుడు నిస్సార్ అని కందిమళ్ల ప్రతాపరెడ్డి, పల్లె నర్సింహ, కె.శ్రీనివాస్, కన్నం లక్ష్మీనారాయణ, ఉప్పలయ్య, జాకబ్, కొండల్రావు, పి.నళిని నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ పోరాటంలో నిస్సార్ అద్భుతమైన పాటలు రాశారని, అనేక ప్రజా పోరాటాల్లో, పుట్టిన సుద్దాల గురించి రాసిన పాటలతో చిరస్మరణీయులుగా నిలిచిపోతారని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ జోహార్లు అర్పించారు. నిస్సార్ వంటి కళాకారుడు వైరస్‌కు బలి కావడం విచారకరమని సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిస్సార్ మరణంతో పార్టీకి, ప్రజానాట్యమండలికి తీరని నష్టం వాటిల్లిందని ఏఐటీయూసీ నాయకులు టి.నరసింహన్, ఎస్.బాలరాజ్, వీఎస్ బోస్, ఎండీ యూసుఫ్ విచారం వెలిబుచ్చారు. ఆర్టీసీ ఉద్యోగిగా... కళాకారుడిగా జీవన ప్రస్థానం ప్రారంభించినప్పటికీ ఉపాధి కోసం నిస్సార్ అనేక పనులు చేశారు. లారీ క్లీనర్‌గా, డ్రైవర్‌గా కొంతకాలం పనిచేశారు. అనంతరం ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం రావడంతో చాలాకాలం పాటు ఆ ఉద్యోగం చేస్తూనే కళాకారుడిగా ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం గజ్జెకట్టారు. తెలంగాణలోని అన్ని డిపోల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన సాంస్కృతిక యోధుడిగా నిలిచారు. ప్రస్తుతం మియాపూర్–2 డిపోలో ఏడీసీగా పని చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన నిస్సార్‌ను పడకలు ఖాళీ లేవంటూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుకోలేదని, చివరకు గాంధీ ఆస్పత్రిలో చేర్చుకున్నప్పటికీ, వెంటిలేటర్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తంచేశాయి. నిస్సార్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. -
అల... భైరిసారంగపురంలో..
‘‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టుపట్టినాడా ఒగ్గనే ఒగ్గడు’’.. సిక్కోలు యాసతో యూత్‌ని ఆకట్టుకున్న ఈ పాట ఇటీవలే విడుదలైన ‘అల... వైకుంఠపురంలో...’ చిత్రంలోనిది. పాటను సినిమాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జానపద కళాకారుడు బాడ సూరన్న పాడారు. మందస మండలం భైరిసారంగపురం గ్రామానికి చెందిన సూరన్నకు బతుకునిచ్చే చదువు లేదు కానీ.. తన సిక్కోలు యాసతో జానపదాలను బతికిస్తున్నారు! సూరన్న అసలు పేరు సూరయ్య. గంగిరెద్దుల కుటుంబం. స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు అతడిని చదివించలేదు. ముగ్గురు అన్నదమ్ములు, ఒక అక్క. 15 ఏళ్ల వయస్సులో సూరన్న జీవితం చిన్న మలుపు తీసుకుంది. అప్పట్లో ‘భూమి భాగోతం’ అనే జానపద ప్రదర్శనకు తమ ఊరు వచ్చిన వీరగున్నమ్మపురం గ్రామానికి చెందిన మజ్జి బయ్యన్నతో సూరయ్యకు పరిచయం ఏర్పడింది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల కులానికి చెందిన పదమూడు మందితో బయ్యన్న నాటకాన్ని ప్రదర్శించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నాటకం! మాటలు, పాటలు, హాస్యం కూడా బయ్యన్నే వెనుక నుంచి చెప్పేవారు. ఆ నాటకంలో సూరన్న అనే హీరో పాత్రను సూరయ్య వేస్తుండటంతో ఆయన పేరు సూరన్నగా మారిపోయింది. సుమారు 800 ప్రదర్శనలతో ఆ నాటకం మంచి ప్రాచుర్యం పొందింది! ‘తితిలీ.. తితిలీ..’ సూరన్న గంగిరెద్దులను ఆడిస్తూ.. జానపదాలను పాడుతూ, నాటకాలు వేస్తూ మంచి కళాకారుడిగా పదిమంది దృష్టిలోనూ పడ్డారు. జిల్లాను దాటి, ఇతర జిల్లాలు, ఒడిశా రాష్ట్రంలో కూడా సూరన్న ప్రదర్శనలు ఇస్తుండడంతో మంచి గుర్తింపు వచ్చింది. 350 వరకు జానపదాలకు ఆయన అవలీలగా పాడగలరు. ఇప్పటికి 200 వరకు బాణీలు కట్టాడు. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లాకు కలిగిన నష్టాన్ని ‘తితీలీ.. తితీలీ.. తుపానమొచ్చి, ఊరు, వాడా వల్లకాడైతే.. శీకాకుళం జిల్లా సిన్నబోయిందే’ అనే తన పాట ప్రతి ఒక్కరి నోట్లో ఆడిందనీ.. ఈ పాటే తన జీవితానికి రెండో మలుపు అయిందనీ సూరన్న అన్నారు. సూరన్న సన్నాయి, సైడ్డ్రమ్ము, డోలు వాయిద్యాలు కూడా వాయిస్తారు. సంక్రాంతి సమయంలోనైతే సూరన్న గంగిరెద్దుల ప్రదర్శనకు ఊరూరూ నీరాజనాలు పలుకుతుంది. సినిమా తెరపైకి వైజాగ్‌లోని ఆడియో, వీడియో కంపెనీ ‘శ్రీమాతా మ్యూజిక్ హౌస్’ మేనేజింగ్ డైరెక్టర్లు పల్లి నాగభూషణరావు, బిన్నళ నర్సింహమూర్తి సూరన్న ప్రతిభను గుర్తించి, జానపద పాటలను శ్రీమాతా స్టుడియోలో రికార్డింగ్ చేసి, సీడీలు, యూట్యూబ్‌లలో విడుదల చేశారు. వాటిలో.. ‘అల్లుడా గారెండొలా.. బూరెండొలా..’ అనే పాటను యూట్యూబ్‌లో చూసిన సినీదర్శకుడు చిన్నికృష్ణ.. సూరన్నను సంప్రదించి, అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ‘అల.. వైకుంఠపురంలో...’ సెట్‌కి తీసుకెళ్లారు. ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎదుట సూరన్నతో జానపదాలను పాడించారు. దాంతో ముగ్ధులైన త్రివిక్రమ్ అప్పటికప్పుడు ఇదే సినిమాలో పాడే అవకాశం కల్పించారు. దీంతో అల వైకుంఠపురంలో పోరాట దృశ్యాలకు సిక్కోలు యాసలో సూరన్న చేత ‘‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టుపట్టినాడా ఒగ్గనే ఒగ్గడు’’.. పాట పాడించారు. ఆ పాటకు సాహిత్యం ఒడిశాకు చెందిన బల్ల విజయ్‌కుమార్ సమకూర్చారు. మ్యూజిక్ డైరక్టర్ తమన్, అసిస్టెంట్ మ్యూజిక్ డైరక్టర్ శ్రీకృష్ణ.. పాటకు ట్యూన్ చెప్పడంతో సూరన్న తన గళం విన్పించాడు. జానపదాన్నే నమ్ముకుని జీవిస్తున్న తనకు సినిమాల్లో అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఉందని ‘సాక్షి’తో అన్నారు సూరన్న. మొట్టమొదటిసారిగా తను విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో కళాభినేత్రి వాణిశ్రీతో సన్మానం పొందానని, అనంతరం ముప్ఫైమంది వరకు ప్రముఖుల చేతుల మీదుగా సన్మానాలు, సత్కారాలు పొందానని సూరన్న చెప్పారు. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ తనకు ఓ స్పెషల్ కోటు బహుమతిగా ఇచ్చారని, విశాఖలో జరిగిన సినిమా సక్సెస్ మీట్ వేదికపై అల్లు అరవింద్ తనను హత్తుకోవడం జీవితంలో మరచిపోలేనని, ఇది శ్రీకాకుళం జిల్లాకు దక్కిన గౌరవమని ఆనందంగా అన్నారు. – కందుల శివశంకర్, ‘సాక్షి’ శ్రీకాకుళం కొంచాటి ఆనందరావు, ‘సాక్షి’ మందస -
కిన్నెర మెట్లు... బతుకు పాట్లు
సాక్షి, నాగర్‌కర్నూల్ : ఆయన వాయిద్యం విద్యార్థులకు ఓ పాఠ్యాంశం.. ఆయనకొచ్చిన అవార్డులు, సత్కారాలు లెక్కకు మించి.. వేదికలపై వేనోళ్ల ప్రశంసలు.. కానీ రోజూ ఐదు వేళ్లు నోట్లోకి పోని దుస్థితి! అంతరించిపోతున్న కిన్నెర వాయిద్యానికి ప్రాణం పోసి, పల్లె పాటకు పట్టం కట్టి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న మొగులయ్య దీనగాథ ఇదీ!! 70 ఏళ్ల మలిసంధ్యలో ఉపాధి లేక ఆయన యాచకుడిగా మారి బతుకు వెళ్లదీస్తున్నాడు. ఊరూరూ తిరుగుతూ పొట్టబోసుకుంటున్నాడు. ప్రాథమిక విద్యలో పాఠ్యాంశంగా ఆయన కిన్నెర వాయిద్యాన్ని చేర్చడంతో అడపాదడపా స్కూళ్లలో ప్రదర్శనలిస్తూ పిల్లలిచ్చే రూపాయి, రెండు రూపాయలను తీసుకొని కళ్లకద్దుకుంటున్నాడు. కిన్నెరే బతుకుదెరువుగా.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన ఎల్లయ్య, రాములమ్మలకు మొగులయ్య మొదటి సంతానం. తండ్రి ఏడు మెట్ల కిన్నెరతో ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టేలా జానపదాలను రూపొందించుకుని కిన్నెరపై పాడేవాడు. తండ్రి మరణానంతరం మొగులయ్య కిన్నెర వాయిద్యాన్ని వారసత్వంగా అందుకున్నాడు. తండ్రి వాయించిన ఏడు మెట్ల కిన్నెర స్థానంలో సొంత ఆలోచనతో మూడు ఆనపకాయ(సొరకా) బుర్రలను వెదురుబొంగుకు బిగించి 12 మెట్ల కిన్నెర తయారు చేసుకుని పాటలు పాడటం మొదలుపెట్టాడు. గ్రామాల్లో వీధివీధి తిరుగుతూ కళను బతికిస్తూ తన బతుకు వెళ్లదీసుకుంటున్నాడు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన పాన్‌గల్ మియాసాబ్, పోరాటయోధుడు పండుగ సాయన్న వీరగాథ, దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుల గాథలను కిన్నెరపై వాయిస్తూ అందరి ఆదరాభిమానాలు చూరగొన్నాడు. పురాణ గాథలను కళ్లకు కట్టినట్లు ఆలపిస్తూ ఈ తరం వారికి కూడా అర్థమయ్యేలా పాడడం కిన్నెర మొగులయ్య ప్రత్యేకత. గుర్తించింది ఓయూ విద్యార్థులే.. పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన కిన్నెర మొగులయ్య వీధుల్లో తిరుగుతూ కిన్నెర వాయిస్తున్న సమయంలో ఆయనలోని ప్రతిభను కొందరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గుర్తించారు. ఆయన కళను వెలుగులోకి తెచ్చారు. హైదరాబాద్ శిల్పారామం, రవీంద్ర భారతిలో ఆయనతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించి ప్రముఖుల దృష్టిలో పడేలా చేశారు. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడమే కాకుండా తమిళనాడుకు చెందిన వెంకటేశ్వర యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ఢిల్లీ తెలుగు అకాడమీ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, కృష్ణా పుష్కరాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఇలా ఎన్నో రకాల ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలను అందుకున్నాడు. ఊరూరూ తిరుగుతున్న: మొగులయ్య నా భార్య శంకరమ్మ మరణించడంతో లోకమే కుటుంబంగా భావించి ఊరూరూ తిరుగుతున్న. ప్రస్తుతం అదే నా సంపాదన. ఇద్దరమ్మాయిలు, ముగ్గురు కుమారులున్నా వారి బతుకు వారు బతుకున్నారు. ఎవరికీ భారం కాకూడదని ప్రదర్శనలు ఇస్తూ పొట్టపోసుకుంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ నెలనెలా గౌరవ వేతనం అందిస్తానని హామీ ఇచ్చారు. అందుకే వృద్ధాప్యం మీద పడ్డా వృద్ధులకు వచ్చే నెలకు రూ.వెయ్యి పింఛన్‌కు దరఖాస్తు చేయలేదు. గౌరవ వేతనం అందిస్తే ఈ చరమాంకంలో జీవితం సజావుగా సాగుతుంది. అందుకున్న పురస్కారాలివీ.. 2014లో ప్రపంచ జానపద దినోత్సవంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం 2015లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం, రూ.10,116 నగదు 2015 ఏప్రిల్‌లో పాలమూరు కళారూపాల ప్రదర్శనలో కలెక్టర్ టీకే.శ్రీదేవి నుంచి కళాభినందన పత్రం 2015లో హైదరాబాద్‌లో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ నుంచి రూ.5 వేల నగదు పురస్కారం 2016 పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి రూ.20,116, ప్రశంసా పత్రం -
ఆయన కథకు మంత్రముగ్ధుడైన ఎన్టీఆర్..
సాక్షి, జనగామ ఒగ్గు కథా పితామహుడు, పల్లె సుద్దులకు జీవం పోసిన మహనీయుడు చుక్క సత్తయ్య (82) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం జనగామ జిల్లాలోని తన స్వగ్రామం మాణిక్యాపురంలో తుదిశ్వాస విడిచారు. ఒగ్గు కథకు తనదైన బాణీని రూపొందించి వేలాది ప్రదర్శనలతో జానపద కళారూపానికి వన్నెలద్దిన ఆయన మృతితో అభిమానులు, కళాకారులు శోకసంద్రంలో మునిగిపోయారు. జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురంలో ఆగయ్య–సాయమ్మ దంపతులకు 1935 మార్చి 29న సత్తయ్య జన్మించారు. మాణిక్యాపురంలోనే మూడో తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత కులవృత్తి అయిన ఒగ్గు కళను నేర్చుకుని 14 ఏళ్ల నుంచే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గుకళను సరికొత్త తీరాలకు చేర్చారు. పల్లె నుంచి ప్రస్థానం.. కురుమ కులానికి చెందిన సత్తయ్య కళకు పల్లెలోనూ బీజం పడింది. వ్యవసాయ పనులు చేసుకుంటూ సాధన చేసిన కథలు ఆయనకు జాతీయస్థాయి గుర్తింపు తెచ్చాయి. కులవృత్తిలో భాగంగా గ్రామాల్లో తిరుగుతూ యాదవులకు కథలు చెబుతూ కానుకలు స్వీకరించేవారు. ఏడాదిలో ఆరు నెలల పాటు గ్రామాలు తిరిగేవారు. ఇలా కథలు చెబుతున్న తరుణంలోనే ఆయనకు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే అవకాశం దక్కింది. ఒగ్గు కథల రూపంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కుటుంబ నియంత్రణ, వరకట్న నిషేధం, వయోజన విద్య, మద్యపాన నిషేధం, కేంద్ర ప్రభుత్వం 20 సూత్రాల పథకాలపై ప్రదర్శనలు ఇచ్చారు. రేడియో, టీవీల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి గ్రామంతోపాటు కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, ఏపీలోని శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లోనూ తన ప్రతిభతో మెప్పించారు. మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, సిక్కిం, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌తోపాటు దేశ రాజధాని ఢిల్లీలో 26 సార్లు ఒగ్గుకథ ప్రదర్శనలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదంతో అనారోగ్యం 2010లో మాణిక్యాపురంలోనే బైక్‌పై నుంచి పడిపోవడంతోనే సత్తయ్య కాలు విరిగింది. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్నారు. కొన్నాళ్ల అనంతరం వెన్నెముక సమస్య తలెత్తడంతో వరంగల్‌లో వైద్యం చేయించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నిమ్స్‌కు తీసుకెళ్లారు. వెన్నెముక ఆపరేషన్‌కు అంతా సిద్ధం చేసినా.. కాలిలో ఉన్న ఇనుప రాడ్ కారణంగా సాధ్యం కాదని తేల్చారు. దీంతో నాలుగు నెలల నుంచి మాణిక్యాపురంలోని ఇంటి వద్దే ఉంటున్నారు. నడుం నుంచి కింది వైపు స్పర్శ లేకుండా పోవడంతో మంచానికే పరిమితమయ్యారు. ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య చంద్రమ్మ 1999లో మరణించారు. శుక్రవారం స్వగ్రామంలో సత్తయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రముగ్ధుడైన ఎన్టీఆర్ ఎన్టీఆర్ హయాంలో జరిగిన మహానాడులో సత్తయ్య అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఆయన కథ చెబుతుంటే ఎన్టీఆర్ స్టేజీపైకి వచ్చి ఆయనతో కలిసి నృత్యం చేశారని ఆ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు చెబుతారు. తర్వాత కాలంలో చుక్క సత్తయ్యకు ఎన్టీఆర్ గండ పెండేరం తొడిగారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ జానపద కళల శాఖలో ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేసిన సత్తయ్య.. ఒగ్గు కథను పాఠ్యాంశంగా మార్చి బోధించారు. ఒగ్గుకథతో పాటు ఒగ్గుడప్పు విన్యాసాలను కూడా ప్రారంభించింది ఆయనే. 13 విధాల ఒగ్గు విన్యాసాలను నేర్పించారు. 1988లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ‘ఎపిక్ ఆఫ్ మల్లన్న’పేరిట చుక్క సత్తయ్య ప్రదర్శనలను రికార్డు చేసింది. సత్తయ్య ప్రొఫైల్ పేరు: చౌదరపల్లి సత్తయ్య(చుక్క సత్తయ్య) జననం: మార్చి 29, 1935 వివాహం: 1947లో చంద్రమ్మతో పిల్లలు: ఇద్దరు కొడుకులు అంజయ్య, శ్రీశైలం. కూతురు పుష్పమ్మ(పదేళ్ల కిందట మరణించింది) అవార్డులు.. – 2004లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం – 2005లో అప్పటి గవర్నర్ సుశీల్‌సుమార్ షిండే చేతుల మీదుగా కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ – తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ – ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వెంగళరావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహరావు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా చేతుల మీదుగా సన్మానాలు – తమిళనాడు ప్రభుత్వం నుంచి కళాసాగర్ అవార్డు – 2014లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం – 2014లో తానా అవార్డు – ఏపీ ప్రభుత్వం నుంచి రాజీవ్ సాగర్ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం నుంచి కీర్తి పురస్కార్ – తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015లో ఉత్తమ కళాకారుడి అవార్డు దేశ గర్వించదగ్గ కళాకారుడు: సీఎం చుక్క సత్తయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు యావత్ దేశం గర్వించదగిన కళాకారుడిగా ఆయన ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారని కొనియాడారు. సత్తయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒగ్గు కళకు చుక్క సత్తయ్య చిరునామాగా మారారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన సంతాప లేఖలో పేర్కొన్నారు. సమాజం గొప్ప సంప్రదాయ వృత్తి కళాకారుడిని కోల్పోయిందంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సంతాపం ప్రకటించారు. -
గోరటి దీపం
దీపం పాడుతుంది ‘‘ తాండవిస్తుంది ‘‘ బోధిస్తుంది ‘‘ చూపిస్తుంది నడిపిస్తుంది ‘‘ గోరటి దీపం ‘‘ కొండంత వెలుగు ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అంటూ పల్లె జీవితాన్ని తన పదాల అల్లికతోనూ, పాటతోనూ తెలుగువారి హృదయాన్ని తాకిన కవి, జానపద కళాకారుడు గోరటివెంకన్న. జనాన్ని జాగృతం చేసే పాటలతో అందరికీ పరిచయం అయిన ఈ గళం దైవం గురించి ఏం చెబుతుంది? వనస్థలిపురంలోని ఆయన నివాసంలో ఓ సాయంసంధ్యవేళ కలుసుకున్నప్పుడు గోరటివెంకన్న పంచుకున్న దైవపదాలు ఇవి... ‘దీపం వెలిగిస్తున్నారు, కొంత సమయం పడుతుంది’ అని మీ ఇంట్లో వాళ్లు చెప్పారు. మీకు దైవ భక్తి చాలా ఉన్నట్టుంది... ? దీపం మనలోని అంతర్జ్యోతిని వెలిగిస్తుంది. భక్తి అంతర్ముఖులను చేస్తుంది. రోజూ కాసేపు మనల్ని మనం తెలుసు కోవడానికి ఉపయోగపడే సాధనాలివి. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం మా నాయన నుంచి వచ్చిన అలవాటు. నా చిన్నప్పటి నుంచి మా నాయన ఇంట్లో దీపం వెలిగించడం చూసేవాడిని. ఆయన కూడా చెన్నదాసు అనే ఓ అవధూత చెప్పినప్పటి నుంచి దీపం వెలిగించడం మొదలుపెట్టాడు. ఆ అవధూత ఓ పాడుబడిన ఇంట్లో గోడ దాపున కూర్చుని ఎన్నో తత్త్వాలు చెప్పేవాడు. ఆ తత్త్వాలు నన్ను బాగా ఆలోచింపజేసేవి. పల్లె నుంచి వచ్చారు. ఆ పల్లె జీవితంలో భక్తిని ఎలా వంటపట్టించుకున్నారు? ‘వీసేగాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దూ నింగి, ఐదింటి రూపం ఈ గూటి దీపం’ అని పంచభూతాల గురించి వర్ణించి రాసే శక్తి పల్లెనే ఇచ్చింది. ఆ శక్తితోనే వందల పాటలు రాశాను. మాది మహబూబ్‌నగర్‌లోని గౌరారం అనే ఊరు. పల్లె జీవితంలో ప్రకృతే దైవం. అక్కడ అంతా గ్రామదేవతలను పూజించేవారు. నేనూ రాయీరప్ప, చెట్టూపుట్ట.. అన్నింటì కీ మొక్కేవాడిని. గ్రామదేవతల పూజల్లో పాల్గొనేవాణ్ణి. మా నాయిన యక్షగాన కళాకారుడు కూడా కావడంతో దైవానికి సంబంధించిన పాటలు అలవోకగా పాడేవాడు. నేనూ వాటిని వింటూ, చూస్తూ, పాడుతూ ఎదిగా! నా చిన్నప్పుడు దెయ్యాల కథలు బాగా వినేవాడిని. చీకటిపడ్డాక భయమేసేది. భయపడ్డప్పుడల్లా దేవుని తలుచుకోమనేవారు అమ్మవాళ్లు. దీంతో దైవాన్ని ఆసరా చేసుకునేవాడిని. అలాంటి సంఘటనలు తలుచుకుంటే నవ్వొస్తుంటుంది కూడా! ఆ తర్వాత్తర్వాత తార్కికంగా ఆలోచించడం మొదలుపెట్టాను. యూనివర్శిటీ చదువులో సాహిత్యం బాగా వంటపట్టింది. అప్పుడే బుద్ధుని బోధనల పట్ల ఆకర్షితుడినయ్యాను. సృష్టిలో వేటికీ దైవం అవసరం లేదు. మనిషికి మాత్రమే ఎందుకు అవసరం? ఆని ఆలోచించాను. అప్పటినుంచే మానవుడికున్న బుద్ధి వికాసానికి భక్తి అవసరమే అనే నిర్ణయానికి వచ్చాను. బుద్ధుడి బోధనలు మిమ్మల్ని అంతగా ఆకట్టుకోవడానికి కారణాలు... బౌద్ధానికి ముందు ప్రపంచం ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఎందుకు బుద్ధుణ్ణి దశావతారంగా హిందువులు సొంతం చేసుకున్నారు.. అనే దానిమీద ప్రముఖులు రాసిన రచనలు చదివాను. అంతేకాదు వైశాలి, గయ, సారనాథ్, నేపాల్, నాగార్జునసాగర్.. ఇలా బుద్ధుడు తిరుగాడిన ప్రాంతాలన్నీ వెళ్లి చూసొచ్చాను. బౌద్ధానికి ముందు యజ్ఞయాగాది క్రతువులలో మనుషులను కూడా బలి ఇచ్చేవారట. తర్వాత జంతువుల వరుస వచ్చింది. దానిని రూపుమాపడానికే అహింసామార్గాన్ని చూపుతూ బౌద్ధం వచ్చింది. దుఃఖం నుంచి ఎలా వేరుపడాలో తెలియజేసింది. మూఢభక్తి నుంచి ఎదగమని చెప్పింది బౌద్ధం. అందుకే బుద్ధుడు అంటే నాకు చాలా ఇష్టం. నిర్గుణ నిర్వికార నిరంజన అనే భావన సమాజంలో తీసుకురావడం అన్నది చిన్న విషయం కాదు. ఇదే ఆదిశంకరుని అద్వైతవేదాంతం కూడా చెప్పింది. అయితే, నిర్వికార ఉపాసన గురించి తెలిసినప్పటికీ అద్వైతం ప్రజలలో అంతగా చొచ్చుకుపోలేదు. బౌద్ధంలోని విషయాలు అందరూ పాటించదగినవిగా ఉంటాయి. మన తార్కిక ఆలోచనకు అందుతాయి. నిజాన్ని కళ్లకు కడతాయి. ఆ తర్వాత.. రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, వేమన, కబీరుదాసు, బ్రహ్మంగారు లాంటి ఆధ్యాత్మికులు ఎంతో మంది దైవం గురించి కొత్తగా పరిచయం చేస్తూనే వచ్చారు. ‘నీవు – భగవంతుడు వేరు కాదు’ అన్నారు వారంతా! ‘చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చిత్తం చెడు ఒరే ఒరే!’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మనిషి నిర్వికార స్థితికి చేరుకోవడానికి ఈ ప్రపంచంలో ఎంతో ఉద్ధరణ జరిగింది. అందుకే ‘దేవుడు’ అని ఆ పేరుతో కొంతవరకే పరిమితం చేయకూడదు. దైవం అనంతం. ఆధ్యాత్మిక గురువులు చెప్పిన దాని మీద దృష్టిపెడుతూ, దైవం గురించి తెలుసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఇందుకు బౌద్ధం బాగా ఉపయోపడుతుంది. బౌద్ధం చెప్పినట్టు ఒక రూపాన్ని ఆధారం చేసుకోకుండా ఆరాధించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కదా! సాధన చేస్తే అవుతుంది. బుద్ధుని గురించే చెప్పుకుందాం. విగ్రహారాధన కూడదు అంటుంది బౌద్ధం. కానీ, (నవ్వుతూ) విగ్రహాలు అనేవి బుద్ధుని ఆరామాల నుంచే ఎక్కువ వచ్చాయి కదా! అయినా.. రాయి, రప్ప, చెట్టు, పుట్ట, కీటకంలో... అన్నింటా భగవంతుడిని చూస్తున్నప్పుడు మనిషి చెక్కిన విగ్రహం కూడా ఈ సృష్టిలోనిదే కదా! మొక్కితే తప్పేం ఉంది? అయితే, ఆ విగ్రహాన్ని చూపి కమీషన్ ఇవ్వమంటేనే తప్పు. దేవుడికి కమీషన్ ఇస్తే ఆయన తిరిగి లాభం ఇస్తడు అనుకోవడమే పెద్ద తప్పు. ఆయనేమన్నా తన దగ్గర తక్కెడ పెట్టుకున్నడా? ‘నువ్వింత ఇస్తే.. నేను ఇంత ఇస్త’ అని. అలాగని గుళ్లకు వెళ్లకుండా ఉండను. కానీ, కమీషన్ ఎక్కడా ఇవ్వను. ఈ స్పెషల్ దర్శనాలేంటో.. విఐపీ దర్శనా లేంటో... ఆ పవర్ వీళ్లకు మాత్రమే దేవుడు ఎట్లిచ్చిండో... అని ఆలోచిస్తాను. తార్కికంగా ఆలోచించడానికి మీకు ఉపయోగపడిన భక్తి గ్రంథాలు... చాలా ఉన్నాయి. ఒక సమయంలో భగవద్గీత గురించీ ఒక ఆలోచన కలిగింది. కమ్యూనిస్టు ఉద్యమకారులతో తిరుగుతున్న రోజులవి. కరీంనగర్ జిల్లాలో ఒక అన్నను ఆస్తి తగాదాల్లో సొంత చెల్లెనే చంపింది. భగవద్గీతలో ఒక చోట ఉంటది ‘అన్న ఏంది? తమ్ముడేంది? యుద్ధంలో శత్రువే! చంపు’ అంటడు దేవుడు. మళ్లీ ‘వాళ్లంతా నా లీలలో మాయ’ అంటడు. యుద్ధం ధర్మం ఏంది, యుద్ధం వినాశనం కదా! అని నా ఆలోచన. ఆనాటికాలంలో దాయాదుల పంచాయితీ లో అలా చెప్పి ఉండవచ్చు. ఇప్పుడు దాన్ని మన మానవసంబంధాలను బలపరిచేందుకు ఎలా ఉపయోగించాలి? అని ఆలోలచిస్త. గ్రంథాల నుంచి కూడా మంచినే తీసుకుందాం అనుకుంటాను. ఈ ఆలోచన నా పాటలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ తార్కిక ఆలోచనలను మీ పిల్లలకూ పరిచయం చేస్తుంటారా? నాకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు. నా అలవాటునే నా పిల్లలూ అనుసరిస్తారు. చదువు తార్కికంగా ఆలోచించే శక్తిని ఇస్తుంది. అందుకే వారికి మంచి చదువు ఇవ్వడానికి ఎంత ఖర్చయినా వెనకాడను. ‘భక్తిగా ఉండు. అయితే, దేనినీ గుడ్డిగా నమ్మవద్దు’ అంటాను. పూజలు, యజ్ఞయాగాదుల పేరిట ఆడంబరపు ఖర్చులు అవసరం లేదంటాను. నాలాగే వారూ ఆలోచిస్తారు అయితే, మీ జీవితంలో దేవుడున్నాడు అనుకున్న సందర్భం ఎప్పుడూ రాలేదా? ఒకసారి ఊరెళుతుంటే కారు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద పడ్డాను. దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో మరో వాహనం ఎదురురాలేదు కానీ లేకపోతే పోయేవాడినే! భయం వేసింది. ఆ సమయంలో ‘హమ్మయ్య, దేవుడు కాపాడాడు’ అనుకున్నాను. అది ఒక్క క్షణమే! ఆ వెంటనే ‘మొన్న ఓ చిన్నపిల్ల రోడ్డు దాటుతూ ప్రమాదంలో చనిపోయిందే! పాపం ఆ చిన్న పిల్ల ఏం తప్పు చేసిందని దేవుడు కాపాడలేదు’ అనుకున్నాను. ఇలా ప్రతీది తార్కికంగా ఆలోచించుకుంటూ ఉంటాను. దేవుడి మీద కోపం వచ్చిన ఘటన... నాకు తెలిసి ఎప్పుడూ అలా జరగలేదు. నా బంధుమిత్రుల్లో దుఃఖం కలిగినప్పుడు కోపం తెచ్చుకున్న సందర్భాలు చూశాను. అలాగే, దుఃఖం ఉన్నచోటనే దేవుడుంటాడని గ్రహించాను. దుఃఖం ఉన్నప్పుడే కదా మనిషికి కోపం కలిగేది. అందుకే మహాత్ములు ఎక్కడ దుఃఖితులు ఉన్నారో అక్కడకే వచ్చి సేవలు చేశారు. బుద్ధుడు, క్రీస్తు, రాముడు.. వంటి వారంతా దుఃఖితులయ్యే దేవుళ్లు అయ్యారు. మదర్ థెరిస్సా దుఃఖితులైన రోగులను చేరదీసింది. సాయిబాబా కూడా దుఃఖితులకే మేలు చేశాడు. మనుషుల్లో మీరు చూసిన దివ్యత్వం... షామీర్పేట్ పోతుంటే ఒక దగ్గర మర్రిచెట్లు ఉంటయ్.. అక్కడ చింకి గుడ్డలు, చింపిరిజుట్టుతో ఓ ౖబైరాగి కనిపిస్తడు. భయపడో మరోటో గానీ ఎవ్వరూ దగ్గరకు వెళ్లరు. కానీ, నేనాదారిలో వెళితే తప్పక అతన్ని కలిసి, పలకరిస్తుంటాను. మొదట్లో తిట్టేవాడు. పట్టుకుంటే విదిలించి కొట్టేవాడు. ఇప్పుడైతే నవ్వుతూ చూస్తుంటాడు. అతని కళ్లు కాంతిగోళాల్లా ఉంటాయి. ఎవ్వరితో మాట్లాడడు. ఆయన సమక్షంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. భక్తి అంటే అచలం, బైరాగితత్త్వం అనిపిస్తుంది. సిద్ధులు, యోగులు, అవధూతలే నిజమైన ఆధ్యాత్మికత గలవారు. అంతటి శక్తి రావాలంటే మనం చాలా ఎదగాలి. – చిల్కమర్రి నిర్మలారెడ్డి -
పాఠ్యపుస్తకాల్లో ‘పల్లె కన్నీరు పెడుతుందో..’
హైదరాబాద్: తెలంగాణ జానపద కళాకారుడు గోరటి వెంకన్న సాహిత్యానికి పాఠ్య పుస్తకాల్లో చోటుదక్కింది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ముద్రించిన ‘మన చదువు-మన కోసం’ 5వ తరగతి లెవెల్-బీ పాఠ్యపుస్తకంలో ఆయన రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపిం చని కుట్రల.. నా తల్లీ బందీ అయిపోయిందో కనిపించని కుట్రల’ అనే పాటను చేర్చారు. పూర్తి పాటను ఇందులో పాఠ్యాంశంగా ముద్రించారు.