మార్పు
తమిళనాడులోని పురాతన నృత్య–నాటక రూపం
‘కట్టై కుట్టు’లో మహిళల ప్రాతినిధ్యం ఏ రకంగానూ ఉండేది కాదు.
‘కట్టై కుట్టు’ అంటే ‘పురుషులకు మాత్రమే పరిమితమైన కళారూపం’గా
ఉన్న పేరును భారతి తమిళవనన్ బృందం మార్చే ప్రయత్నం చేస్తోంది.
‘కట్టై కుట్టు’కు సంబంధించి నటన, సాంకేతికత, సంగీతం, దర్శకత్వం లాంటి వివిధ
విభాగాల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శిస్తోంది. ఎంతో మంది ఔత్సాహికులకు స్ఫూర్తి ఇస్తోంది....
కాంచీపురంలో 33 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ‘కట్టై కుట్టు సంఘం’ పురాతన కళాసంప్రదాయం అయిన కట్టై కుట్టును సజీవంగా ఉంచడానికి అంకితం అయింది. ఆ పురాతన కళారూపాన్ని ఈ తరానికి పరిచయం చేయడంతోపాటు ‘ఈ కళలో మహిళలు అద్భుతాలు సృష్టించగలరు’ అని నిరూపించింది.
‘కట్టై కుట్టు నేర్చుకోవడానికి ఆడా, మగా తేడా లేదు. కులం, మతం అడ్డు కాదు అని చెప్పాలనుకున్నాం’ అంటారు కట్టై కుట్టు నిర్వాహకులు.
‘కట్టై కుట్టు’ ప్రదర్శన ఆషామాషీ కాదు. ఖరీదైన అలంకరణతో కూడిన ఓపెన్–ఎయిర్ ప్రదర్శన.సంగీతం, పాటలు, మాటలను ఏకతాటిపైకి తెచ్చి ప్రేక్షకులను రంజింప చేయాలి.
‘ఇంత క్లిష్టమైన కళకు మహిళలు అర్హులు కాదు’ అనే భావనను ‘కట్టై కుట్టు సంఘం’ తొలగించింది. మహిళల అద్భుత కళాప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చింది. మొదట్లో మహిళలను రంగస్థలం మీదికి తీసుకురావడం అనేది అంత తేలిగ్గా జరగలేదు. పురుషులతో కలిసి నటించడానికి కొందరు మహిళలు నిరాకరించారు. కొందరు ఒప్పుకున్నా వారి తల్లిదండ్రులు అభ్యంతర పెట్టారు.
‘ఇదేమైనా ప్రభుత్వ ఉద్యోగమా! తినడానికి తిండి కూడా దొరకదు’ అని కొందరు నిట్టూర్చారు.
అయితే ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ కళాప్రియులైన మహిళలను రంగస్థలం మీదికి తీసుకురాగలిగారు. వారిలో నిండైన ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగారు.
‘మీరొక చారిత్రక ఘట్టంలో భాగం అవుతున్నారు’ అని చెప్పారు.
ఆ మహిళా కళాకారులు చారిత్రక ఘట్టంలో భాగం కావడమే కాదు చరిత్రను తిరగ రాశారు.‘కట్టై కుట్టు’కు కొత్త వెలుగు తీసుకుచ్చారు.
‘కట్టై కుట్టు’ సంఘంలోని వారందరూ వివాహిత మహిళలే. డిగ్రీ పూర్తి చేసిన వారే.
‘బాడీ మూమెంట్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్, ఒక పెద్ద డైలాగ్‌ను సంగీతంతో మిళితం చేసే విధానంతో కూడిన కట్టై కుట్టు కళారూపాన్ని మహిళా కళకారులు కూడా అద్భుతంగా చేయగలరని నిరూపించాం’ అంటుంది భారతి తమిళవనన్. ఆమె గత పన్నెండు సంవత్సరాలుగా ‘కట్టై కుట్టు’ ప్రదర్శనలు ఇస్తోంది. ఎంతోమంది మహిళలకు నేర్పిస్తోంది.
భారతీ కళాకారుల కుటుంబం నుంచి రాలేదు. తన స్వగ్రామం వేలూరులో కట్టై కుట్టు కళాకారులను చూస్తూ పెరిగింది,
‘ప్రదర్శన కోసం వేరే గ్రామాలకు వెళ్లినప్పుడు పురుషులు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు. అలాంటి వారికి మేము మా ప్రతిభతోనే తగిన సమాధానం చెబుతాం. మహిళలు చేయలేరు అన్నవారే ప్రదర్శన తరువాత మమ్మల్ని ప్రశంసించడం మరిచిపోలేని విషయం’ అంటుంది తమిళి జ్వాననన్. వివాహ సమయంలో తప్ప ప్రదర్శనకు ఎప్పుడూ సెలవు ఇవ్వలేదు తమిళి జ్వాననన్.
ప్రముఖ కళాకారిణి సంగీత ఈశ్వర్ దగ్గర కట్టై కుట్టు, భరతనాట్యం నేర్చుకున్న తిలగావతి పళని ‘శ్రీకృష్ణ కట్టై కుట్టు కుజు’ పేరుతో స్వంత కట్టై కుట్టు పాఠశాలను నడుపుతోంది.
‘కట్టై కుట్టు కళాకారులు నిరక్షరాస్యులు , మహిళలు ఈ కళారూపానికి తగరు...లాంటి ఎన్నో అపోహలను బద్దలు కొట్టాం’ అంటుంది పళని. ప్రస్తుతం ఆమె తన పాఠశాల ద్వారా 65 మంది విద్యార్థులకు ‘కట్టై కుట్టు’లో శిక్షణ ఇస్తోంది.
ప్రతిష్ఠాత్మకమైన ‘కట్టై కుట్టు గురుకులం’ ద్వారా గ్రామీణ ప్రాంతంలోని పిల్లలకు ‘కట్టై కుట్టు’లో శిక్షణ ఇస్తోంది కట్టై కుట్టు సంఘం. వీరిలో నుంచి భారతిలాంటి ఎంతో మంది అద్భుత కళాకారులు రంగస్థల ప్రపంచానికి పరిచయం కావచ్చు. ప్రతి సంవత్సరం ‘కట్టై కుట్టు సంఘం’ కాంచీపురంలో పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచం నలుమూలల ఉన్న కళాభిమానులను ఈ ఉత్సవం ఆకట్టుకుంటోంది.
ఎన్నో అవరోధాలు అధిగమించి...
మా ఊళ్లో కట్టై కుట్టు కళాకారులను చూస్తూ పెరిగాను. నేను కూడా వారిలాగా చేయాలి అని కలలు కనేదాన్ని. అయితే పెరిగి పెద్దయ్యే క్రమంలో కట్టై కుట్టు రంగస్థలంపై అడుగు పెట్టడానికి ఎన్ని అవరోధాలు ఉన్నాయో తెలిసింది. అయినా సరే, ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లాను. తల్లిదండ్రులు ప్రోత్సహించారే తప్ప అభ్యంతర పెట్టలేదు. ఈ పురాతన కళారూపంలోకి మరింత మంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను.
– భారతి తమిళవనన్
Comments
Please login to add a commentAdd a comment