పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ పర్యావరణ, అటవీశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో దొంగతనం జరిగింది. జానపద కళాకారులు తన నివాసంలో ఖరీదైన వస్తువులను దొంగిలించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తేజ్ ప్రతాప్ యాదవ్ సన్నిహితుడు మిసాల్ సిన్హా మార్చి 10న సచివాలయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన కళాకారులు దీపక్ కుమార్, మరో ఐదుగురు కలిసి ఈ దొంగతనం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పాట్నాలోని తన ప్రభుత్వ బంగ్లాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన జానపద కళాకారులు ప్రదర్శన ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ నెల 9న వారు తిరిగి వెళ్లిన తర్వాత ఇంట్లో రూ. 5 లక్షల విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. అయితే ఈ వస్తువుల గురించి సదరు కళాకారులను అడిగినప్పటికీ ఏమీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే తేజ్ ప్రతాప్ నివాసంలో బృందావనం జానపద కళాకారులు ఏయే వస్తువులు అపహరించారనేది ఇంకా తెలియాలేదని స్టేషన్ ఇంచార్జ్ భగీరథ్ ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment