గోరటి దీపం | special story to Folk artist Gorati Venkanna | Sakshi
Sakshi News home page

గోరటి దీపం

Published Tue, Jun 27 2017 10:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

గోరటి దీపం

గోరటి దీపం

దీపం పాడుతుంది ‘‘ తాండవిస్తుంది  ‘‘  బోధిస్తుంది  ‘‘ చూపిస్తుంది  నడిపిస్తుంది  ‘‘  గోరటి దీపం  ‘‘ కొండంత వెలుగు

‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అంటూ పల్లె జీవితాన్ని తన పదాల అల్లికతోనూ, పాటతోనూ తెలుగువారి హృదయాన్ని తాకిన కవి, జానపద కళాకారుడు గోరటివెంకన్న. జనాన్ని జాగృతం చేసే పాటలతో అందరికీ పరిచయం అయిన ఈ గళం దైవం గురించి ఏం చెబుతుంది? వనస్థలిపురంలోని ఆయన నివాసంలో ఓ సాయంసంధ్యవేళ కలుసుకున్నప్పుడు గోరటివెంకన్న పంచుకున్న దైవపదాలు ఇవి...

‘దీపం వెలిగిస్తున్నారు, కొంత సమయం పడుతుంది’ అని మీ ఇంట్లో వాళ్లు చెప్పారు. మీకు దైవ భక్తి చాలా ఉన్నట్టుంది... ?
దీపం మనలోని అంతర్‌జ్యోతిని వెలిగిస్తుంది. భక్తి అంతర్ముఖులను చేస్తుంది. రోజూ కాసేపు మనల్ని మనం తెలుసు కోవడానికి ఉపయోగపడే సాధనాలివి. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం మా నాయన నుంచి వచ్చిన అలవాటు. నా చిన్నప్పటి నుంచి మా నాయన ఇంట్లో దీపం వెలిగించడం చూసేవాడిని. ఆయన కూడా చెన్నదాసు అనే ఓ అవధూత చెప్పినప్పటి నుంచి దీపం వెలిగించడం మొదలుపెట్టాడు. ఆ అవధూత ఓ పాడుబడిన ఇంట్లో గోడ దాపున కూర్చుని ఎన్నో తత్త్వాలు చెప్పేవాడు. ఆ తత్త్వాలు నన్ను బాగా ఆలోచింపజేసేవి.    

పల్లె నుంచి వచ్చారు. ఆ పల్లె జీవితంలో భక్తిని ఎలా వంటపట్టించుకున్నారు?
‘వీసేగాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దూ నింగి, ఐదింటి రూపం ఈ గూటి దీపం’ అని పంచభూతాల గురించి వర్ణించి రాసే శక్తి పల్లెనే ఇచ్చింది. ఆ శక్తితోనే వందల పాటలు రాశాను. మాది మహబూబ్‌నగర్‌లోని గౌరారం అనే ఊరు. పల్లె జీవితంలో ప్రకృతే దైవం. అక్కడ అంతా గ్రామదేవతలను పూజించేవారు. నేనూ రాయీరప్ప, చెట్టూపుట్ట.. అన్నింటì కీ మొక్కేవాడిని. గ్రామదేవతల పూజల్లో పాల్గొనేవాణ్ణి. మా నాయిన యక్షగాన కళాకారుడు కూడా కావడంతో దైవానికి సంబంధించిన పాటలు అలవోకగా పాడేవాడు. నేనూ వాటిని వింటూ,  చూస్తూ, పాడుతూ ఎదిగా! నా చిన్నప్పుడు దెయ్యాల కథలు బాగా వినేవాడిని. చీకటిపడ్డాక భయమేసేది. భయపడ్డప్పుడల్లా దేవుని తలుచుకోమనేవారు అమ్మవాళ్లు. దీంతో దైవాన్ని ఆసరా చేసుకునేవాడిని. అలాంటి సంఘటనలు తలుచుకుంటే నవ్వొస్తుంటుంది కూడా! ఆ తర్వాత్తర్వాత తార్కికంగా ఆలోచించడం మొదలుపెట్టాను. యూనివర్శిటీ చదువులో సాహిత్యం బాగా వంటపట్టింది. అప్పుడే బుద్ధుని బోధనల పట్ల ఆకర్షితుడినయ్యాను. సృష్టిలో వేటికీ దైవం అవసరం లేదు. మనిషికి మాత్రమే ఎందుకు అవసరం? ఆని ఆలోచించాను. అప్పటినుంచే మానవుడికున్న బుద్ధి వికాసానికి భక్తి అవసరమే అనే నిర్ణయానికి వచ్చాను.  

బుద్ధుడి బోధనలు మిమ్మల్ని అంతగా ఆకట్టుకోవడానికి కారణాలు...
బౌద్ధానికి ముందు ప్రపంచం ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఎందుకు బుద్ధుణ్ణి దశావతారంగా హిందువులు సొంతం చేసుకున్నారు.. అనే దానిమీద ప్రముఖులు రాసిన రచనలు చదివాను. అంతేకాదు వైశాలి, గయ, సారనాథ్, నేపాల్, నాగార్జునసాగర్‌.. ఇలా బుద్ధుడు తిరుగాడిన ప్రాంతాలన్నీ వెళ్లి చూసొచ్చాను. బౌద్ధానికి ముందు యజ్ఞయాగాది క్రతువులలో మనుషులను కూడా బలి ఇచ్చేవారట. తర్వాత జంతువుల వరుస వచ్చింది. దానిని రూపుమాపడానికే అహింసామార్గాన్ని చూపుతూ బౌద్ధం వచ్చింది. దుఃఖం నుంచి ఎలా వేరుపడాలో తెలియజేసింది. మూఢభక్తి నుంచి ఎదగమని చెప్పింది బౌద్ధం. అందుకే బుద్ధుడు అంటే నాకు చాలా ఇష్టం. నిర్గుణ నిర్వికార నిరంజన అనే భావన సమాజంలో తీసుకురావడం అన్నది చిన్న విషయం కాదు. ఇదే ఆదిశంకరుని అద్వైతవేదాంతం కూడా చెప్పింది. అయితే, నిర్వికార ఉపాసన గురించి తెలిసినప్పటికీ అద్వైతం ప్రజలలో అంతగా చొచ్చుకుపోలేదు. బౌద్ధంలోని విషయాలు అందరూ పాటించదగినవిగా ఉంటాయి.

మన తార్కిక ఆలోచనకు అందుతాయి. నిజాన్ని కళ్లకు కడతాయి. ఆ తర్వాత.. రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, వేమన, కబీరుదాసు, బ్రహ్మంగారు లాంటి ఆధ్యాత్మికులు ఎంతో మంది దైవం గురించి కొత్తగా పరిచయం చేస్తూనే వచ్చారు. ‘నీవు – భగవంతుడు వేరు కాదు’ అన్నారు వారంతా! ‘చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చిత్తం చెడు ఒరే ఒరే!’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మనిషి నిర్వికార స్థితికి చేరుకోవడానికి ఈ ప్రపంచంలో ఎంతో ఉద్ధరణ జరిగింది. అందుకే ‘దేవుడు’ అని ఆ పేరుతో కొంతవరకే పరిమితం చేయకూడదు. దైవం అనంతం. ఆధ్యాత్మిక గురువులు చెప్పిన దాని మీద దృష్టిపెడుతూ, దైవం గురించి తెలుసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఇందుకు బౌద్ధం బాగా ఉపయోపడుతుంది.

బౌద్ధం చెప్పినట్టు ఒక రూపాన్ని ఆధారం చేసుకోకుండా ఆరాధించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కదా!
సాధన చేస్తే అవుతుంది. బుద్ధుని గురించే చెప్పుకుందాం. విగ్రహారాధన కూడదు అంటుంది బౌద్ధం. కానీ, (నవ్వుతూ) విగ్రహాలు అనేవి బుద్ధుని ఆరామాల నుంచే ఎక్కువ వచ్చాయి కదా! అయినా.. రాయి, రప్ప, చెట్టు, పుట్ట, కీటకంలో... అన్నింటా భగవంతుడిని చూస్తున్నప్పుడు మనిషి చెక్కిన విగ్రహం కూడా ఈ సృష్టిలోనిదే కదా! మొక్కితే తప్పేం ఉంది? అయితే, ఆ విగ్రహాన్ని చూపి కమీషన్‌ ఇవ్వమంటేనే తప్పు. దేవుడికి కమీషన్‌ ఇస్తే ఆయన తిరిగి లాభం ఇస్తడు అనుకోవడమే పెద్ద తప్పు. ఆయనేమన్నా తన దగ్గర తక్కెడ పెట్టుకున్నడా? ‘నువ్వింత ఇస్తే.. నేను ఇంత ఇస్త’ అని. అలాగని గుళ్లకు వెళ్లకుండా ఉండను. కానీ, కమీషన్‌ ఎక్కడా ఇవ్వను. ఈ స్పెషల్‌ దర్శనాలేంటో.. విఐపీ దర్శనా లేంటో... ఆ పవర్‌ వీళ్లకు మాత్రమే దేవుడు ఎట్లిచ్చిండో... అని ఆలోచిస్తాను.  

తార్కికంగా ఆలోచించడానికి మీకు ఉపయోగపడిన భక్తి గ్రంథాలు...
చాలా ఉన్నాయి. ఒక సమయంలో భగవద్గీత గురించీ ఒక ఆలోచన కలిగింది. కమ్యూనిస్టు ఉద్యమకారులతో తిరుగుతున్న రోజులవి. కరీంనగర్‌ జిల్లాలో ఒక అన్నను ఆస్తి తగాదాల్లో సొంత చెల్లెనే చంపింది. భగవద్గీతలో ఒక చోట ఉంటది ‘అన్న ఏంది? తమ్ముడేంది? యుద్ధంలో శత్రువే! చంపు’ అంటడు దేవుడు. మళ్లీ ‘వాళ్లంతా నా లీలలో మాయ’ అంటడు. యుద్ధం ధర్మం ఏంది, యుద్ధం వినాశనం కదా! అని నా ఆలోచన. ఆనాటికాలంలో దాయాదుల పంచాయితీ లో అలా చెప్పి ఉండవచ్చు. ఇప్పుడు దాన్ని మన మానవసంబంధాలను బలపరిచేందుకు ఎలా ఉపయోగించాలి? అని ఆలోలచిస్త. గ్రంథాల నుంచి కూడా మంచినే తీసుకుందాం అనుకుంటాను. ఈ ఆలోచన నా పాటలకు బాగా ఉపయోగపడుతుంది.

ఈ తార్కిక ఆలోచనలను మీ పిల్లలకూ పరిచయం చేస్తుంటారా?
నాకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు. నా అలవాటునే నా పిల్లలూ అనుసరిస్తారు. చదువు తార్కికంగా ఆలోచించే శక్తిని ఇస్తుంది. అందుకే వారికి మంచి చదువు ఇవ్వడానికి ఎంత ఖర్చయినా వెనకాడను. ‘భక్తిగా ఉండు. అయితే, దేనినీ గుడ్డిగా నమ్మవద్దు’ అంటాను. పూజలు, యజ్ఞయాగాదుల పేరిట ఆడంబరపు ఖర్చులు అవసరం లేదంటాను. నాలాగే వారూ ఆలోచిస్తారు

అయితే, మీ జీవితంలో దేవుడున్నాడు అనుకున్న సందర్భం ఎప్పుడూ రాలేదా?
ఒకసారి ఊరెళుతుంటే కారు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద పడ్డాను. దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో మరో వాహనం ఎదురురాలేదు కానీ లేకపోతే పోయేవాడినే! భయం వేసింది. ఆ సమయంలో ‘హమ్మయ్య, దేవుడు కాపాడాడు’ అనుకున్నాను. అది ఒక్క క్షణమే! ఆ వెంటనే ‘మొన్న ఓ చిన్నపిల్ల రోడ్డు దాటుతూ ప్రమాదంలో చనిపోయిందే! పాపం ఆ చిన్న పిల్ల ఏం తప్పు చేసిందని దేవుడు కాపాడలేదు’ అనుకున్నాను. ఇలా ప్రతీది తార్కికంగా ఆలోచించుకుంటూ ఉంటాను.

దేవుడి మీద కోపం వచ్చిన ఘటన...
నాకు తెలిసి ఎప్పుడూ అలా జరగలేదు. నా బంధుమిత్రుల్లో దుఃఖం కలిగినప్పుడు కోపం తెచ్చుకున్న సందర్భాలు చూశాను. అలాగే, దుఃఖం ఉన్నచోటనే దేవుడుంటాడని గ్రహించాను. దుఃఖం ఉన్నప్పుడే కదా మనిషికి కోపం కలిగేది. అందుకే మహాత్ములు ఎక్కడ దుఃఖితులు ఉన్నారో అక్కడకే వచ్చి సేవలు చేశారు. బుద్ధుడు, క్రీస్తు, రాముడు.. వంటి వారంతా దుఃఖితులయ్యే దేవుళ్లు అయ్యారు. మదర్‌ థెరిస్సా దుఃఖితులైన రోగులను చేరదీసింది. సాయిబాబా కూడా దుఃఖితులకే మేలు చేశాడు.

మనుషుల్లో మీరు చూసిన దివ్యత్వం...
షామీర్‌పేట్‌ పోతుంటే ఒక దగ్గర మర్రిచెట్లు ఉంటయ్‌.. అక్కడ చింకి గుడ్డలు, చింపిరిజుట్టుతో ఓ ౖబైరాగి కనిపిస్తడు. భయపడో మరోటో గానీ ఎవ్వరూ దగ్గరకు వెళ్లరు. కానీ, నేనాదారిలో వెళితే తప్పక అతన్ని కలిసి, పలకరిస్తుంటాను. మొదట్లో తిట్టేవాడు. పట్టుకుంటే విదిలించి కొట్టేవాడు. ఇప్పుడైతే నవ్వుతూ చూస్తుంటాడు. అతని కళ్లు కాంతిగోళాల్లా ఉంటాయి. ఎవ్వరితో మాట్లాడడు. ఆయన సమక్షంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. భక్తి అంటే అచలం, బైరాగితత్త్వం అనిపిస్తుంది. సిద్ధులు, యోగులు, అవధూతలే నిజమైన ఆధ్యాత్మికత గలవారు. అంతటి శక్తి రావాలంటే మనం చాలా ఎదగాలి.
– చిల్కమర్రి నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement