సాక్షి, జనగామ
ఒగ్గు కథా పితామహుడు, పల్లె సుద్దులకు జీవం పోసిన మహనీయుడు చుక్క సత్తయ్య (82) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం జనగామ జిల్లాలోని తన స్వగ్రామం మాణిక్యాపురంలో తుదిశ్వాస విడిచారు. ఒగ్గు కథకు తనదైన బాణీని రూపొందించి వేలాది ప్రదర్శనలతో జానపద కళారూపానికి వన్నెలద్దిన ఆయన మృతితో అభిమానులు, కళాకారులు శోకసంద్రంలో మునిగిపోయారు. జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురంలో ఆగయ్య–సాయమ్మ దంపతులకు 1935 మార్చి 29న సత్తయ్య జన్మించారు. మాణిక్యాపురంలోనే మూడో తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత కులవృత్తి అయిన ఒగ్గు కళను నేర్చుకుని 14 ఏళ్ల నుంచే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గుకళను సరికొత్త తీరాలకు చేర్చారు.
పల్లె నుంచి ప్రస్థానం..
కురుమ కులానికి చెందిన సత్తయ్య కళకు పల్లెలోనూ బీజం పడింది. వ్యవసాయ పనులు చేసుకుంటూ సాధన చేసిన కథలు ఆయనకు జాతీయస్థాయి గుర్తింపు తెచ్చాయి. కులవృత్తిలో భాగంగా గ్రామాల్లో తిరుగుతూ యాదవులకు కథలు చెబుతూ కానుకలు స్వీకరించేవారు. ఏడాదిలో ఆరు నెలల పాటు గ్రామాలు తిరిగేవారు. ఇలా కథలు చెబుతున్న తరుణంలోనే ఆయనకు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే అవకాశం దక్కింది. ఒగ్గు కథల రూపంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కుటుంబ నియంత్రణ, వరకట్న నిషేధం, వయోజన విద్య, మద్యపాన నిషేధం, కేంద్ర ప్రభుత్వం 20 సూత్రాల పథకాలపై ప్రదర్శనలు ఇచ్చారు. రేడియో, టీవీల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి గ్రామంతోపాటు కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, ఏపీలోని శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లోనూ తన ప్రతిభతో మెప్పించారు. మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, సిక్కిం, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌తోపాటు దేశ రాజధాని ఢిల్లీలో 26 సార్లు ఒగ్గుకథ ప్రదర్శనలు ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంతో అనారోగ్యం
2010లో మాణిక్యాపురంలోనే బైక్‌పై నుంచి పడిపోవడంతోనే సత్తయ్య కాలు విరిగింది. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్నారు. కొన్నాళ్ల అనంతరం వెన్నెముక సమస్య తలెత్తడంతో వరంగల్‌లో వైద్యం చేయించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నిమ్స్‌కు తీసుకెళ్లారు. వెన్నెముక ఆపరేషన్‌కు అంతా సిద్ధం చేసినా.. కాలిలో ఉన్న ఇనుప రాడ్ కారణంగా సాధ్యం కాదని తేల్చారు. దీంతో నాలుగు నెలల నుంచి మాణిక్యాపురంలోని ఇంటి వద్దే ఉంటున్నారు. నడుం నుంచి కింది వైపు స్పర్శ లేకుండా పోవడంతో మంచానికే పరిమితమయ్యారు. ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య చంద్రమ్మ 1999లో మరణించారు. శుక్రవారం స్వగ్రామంలో సత్తయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మంత్రముగ్ధుడైన ఎన్టీఆర్
ఎన్టీఆర్ హయాంలో జరిగిన మహానాడులో సత్తయ్య అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఆయన కథ చెబుతుంటే ఎన్టీఆర్ స్టేజీపైకి వచ్చి ఆయనతో కలిసి నృత్యం చేశారని ఆ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు చెబుతారు. తర్వాత కాలంలో చుక్క సత్తయ్యకు ఎన్టీఆర్ గండ పెండేరం తొడిగారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ జానపద కళల శాఖలో ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేసిన సత్తయ్య.. ఒగ్గు కథను పాఠ్యాంశంగా మార్చి బోధించారు. ఒగ్గుకథతో పాటు ఒగ్గుడప్పు విన్యాసాలను కూడా ప్రారంభించింది ఆయనే. 13 విధాల ఒగ్గు విన్యాసాలను నేర్పించారు. 1988లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ‘ఎపిక్ ఆఫ్ మల్లన్న’పేరిట చుక్క సత్తయ్య ప్రదర్శనలను రికార్డు చేసింది.
సత్తయ్య ప్రొఫైల్
పేరు: చౌదరపల్లి సత్తయ్య(చుక్క సత్తయ్య)
జననం: మార్చి 29, 1935
వివాహం: 1947లో చంద్రమ్మతో
పిల్లలు: ఇద్దరు కొడుకులు అంజయ్య, శ్రీశైలం. కూతురు పుష్పమ్మ(పదేళ్ల కిందట మరణించింది)
అవార్డులు..
– 2004లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
– 2005లో అప్పటి గవర్నర్ సుశీల్‌సుమార్ షిండే చేతుల మీదుగా కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
– తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్
– ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వెంగళరావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహరావు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా చేతుల మీదుగా సన్మానాలు
– తమిళనాడు ప్రభుత్వం నుంచి కళాసాగర్ అవార్డు
– 2014లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం
– 2014లో తానా అవార్డు
– ఏపీ ప్రభుత్వం నుంచి రాజీవ్ సాగర్ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం నుంచి కీర్తి పురస్కార్
– తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015లో ఉత్తమ కళాకారుడి అవార్డు
దేశ గర్వించదగ్గ కళాకారుడు: సీఎం
చుక్క సత్తయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు యావత్ దేశం గర్వించదగిన కళాకారుడిగా ఆయన ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారని కొనియాడారు. సత్తయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒగ్గు కళకు చుక్క సత్తయ్య చిరునామాగా మారారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన సంతాప లేఖలో పేర్కొన్నారు. సమాజం గొప్ప సంప్రదాయ వృత్తి కళాకారుడిని కోల్పోయిందంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment