సాక్షి, నాగర్‌కర్నూల్ : ఆయన వాయిద్యం విద్యార్థులకు ఓ పాఠ్యాంశం.. ఆయనకొచ్చిన అవార్డులు, సత్కారాలు లెక్కకు మించి.. వేదికలపై వేనోళ్ల ప్రశంసలు.. కానీ రోజూ ఐదు వేళ్లు నోట్లోకి పోని దుస్థితి! అంతరించిపోతున్న కిన్నెర వాయిద్యానికి ప్రాణం పోసి, పల్లె పాటకు పట్టం కట్టి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న మొగులయ్య దీనగాథ ఇదీ!!
70 ఏళ్ల మలిసంధ్యలో ఉపాధి లేక ఆయన యాచకుడిగా మారి బతుకు వెళ్లదీస్తున్నాడు. ఊరూరూ తిరుగుతూ పొట్టబోసుకుంటున్నాడు. ప్రాథమిక విద్యలో పాఠ్యాంశంగా ఆయన కిన్నెర వాయిద్యాన్ని చేర్చడంతో అడపాదడపా స్కూళ్లలో ప్రదర్శనలిస్తూ పిల్లలిచ్చే రూపాయి, రెండు రూపాయలను తీసుకొని కళ్లకద్దుకుంటున్నాడు.
కిన్నెరే బతుకుదెరువుగా..
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన ఎల్లయ్య, రాములమ్మలకు మొగులయ్య మొదటి సంతానం. తండ్రి ఏడు మెట్ల కిన్నెరతో ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టేలా జానపదాలను రూపొందించుకుని కిన్నెరపై పాడేవాడు. తండ్రి మరణానంతరం మొగులయ్య కిన్నెర వాయిద్యాన్ని వారసత్వంగా అందుకున్నాడు. తండ్రి వాయించిన ఏడు మెట్ల కిన్నెర స్థానంలో సొంత ఆలోచనతో మూడు ఆనపకాయ(సొరకా) బుర్రలను వెదురుబొంగుకు బిగించి 12 మెట్ల కిన్నెర తయారు చేసుకుని పాటలు పాడటం మొదలుపెట్టాడు. గ్రామాల్లో వీధివీధి తిరుగుతూ కళను బతికిస్తూ తన బతుకు వెళ్లదీసుకుంటున్నాడు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన పాన్‌గల్ మియాసాబ్, పోరాటయోధుడు పండుగ సాయన్న వీరగాథ, దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుల గాథలను కిన్నెరపై వాయిస్తూ అందరి ఆదరాభిమానాలు చూరగొన్నాడు. పురాణ గాథలను కళ్లకు కట్టినట్లు ఆలపిస్తూ ఈ తరం వారికి కూడా అర్థమయ్యేలా పాడడం కిన్నెర మొగులయ్య ప్రత్యేకత.
గుర్తించింది ఓయూ విద్యార్థులే..
పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన కిన్నెర మొగులయ్య వీధుల్లో తిరుగుతూ కిన్నెర వాయిస్తున్న సమయంలో ఆయనలోని ప్రతిభను కొందరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గుర్తించారు. ఆయన కళను వెలుగులోకి తెచ్చారు. హైదరాబాద్ శిల్పారామం, రవీంద్ర భారతిలో ఆయనతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించి ప్రముఖుల దృష్టిలో పడేలా చేశారు. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడమే కాకుండా తమిళనాడుకు చెందిన వెంకటేశ్వర యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ఢిల్లీ తెలుగు అకాడమీ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, కృష్ణా పుష్కరాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఇలా ఎన్నో రకాల ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలను అందుకున్నాడు.
ఊరూరూ తిరుగుతున్న: మొగులయ్య
నా భార్య శంకరమ్మ మరణించడంతో లోకమే కుటుంబంగా భావించి ఊరూరూ తిరుగుతున్న. ప్రస్తుతం అదే నా సంపాదన. ఇద్దరమ్మాయిలు, ముగ్గురు కుమారులున్నా వారి బతుకు వారు బతుకున్నారు. ఎవరికీ భారం కాకూడదని ప్రదర్శనలు ఇస్తూ పొట్టపోసుకుంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ నెలనెలా గౌరవ వేతనం అందిస్తానని హామీ ఇచ్చారు. అందుకే వృద్ధాప్యం మీద పడ్డా వృద్ధులకు వచ్చే నెలకు రూ.వెయ్యి పింఛన్‌కు దరఖాస్తు చేయలేదు. గౌరవ వేతనం అందిస్తే ఈ చరమాంకంలో జీవితం సజావుగా సాగుతుంది.
అందుకున్న పురస్కారాలివీ..
2014లో ప్రపంచ జానపద దినోత్సవంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం
2015లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం, రూ.10,116 నగదు
2015 ఏప్రిల్‌లో పాలమూరు కళారూపాల ప్రదర్శనలో కలెక్టర్ టీకే.శ్రీదేవి నుంచి కళాభినందన పత్రం
2015లో హైదరాబాద్‌లో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ నుంచి రూ.5 వేల నగదు పురస్కారం
2016 పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి రూ.20,116, ప్రశంసా పత్రం
Comments
Please login to add a commentAdd a comment