రైతులకే తొలి ప్రాధాన్యత
– మహాజన సభలో డీసీసీబీ చైర్మన్ లింగాల శివశంకరరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్ : సహకార బ్యాంకుల ద్వారా రుణ వితరణలో రైతులకే తొలిప్రాధాన్యత ఇస్తామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ లింగాల శివశంకరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక డీసీసీబీ కార్యాలయంలో సీఈవో కాపు విజయచంద్రారెడ్డి అధ్యక్షతన మొదట పాలకవర్గ సమావేశం, తర్వాత 113వ మహాజన సభ నిర్వహించారు. చైర్మన్ శివశంకరరెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా రైతులు, చేనేతల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే మహిళలు, పేద వర్గాలు, ఇతర ఖాతాదారులందరికీ అన్ని రకాల ఆధునిక సేవలు అందజేస్తున్నట్లు తెలిపారు.
2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.230 కోట్ల వరకు పంట రుణాలు, రూ.35 కోట్లు వాణిజ్య పంటలకు రుణాలు, మరో రూ.7 కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేశామన్నారు. జనతా ప్రమాదబీమా పథకం ద్వారా రూ.లక్ష చొప్పున పరిహారం అందించామన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న ‘అనంత’ను ప్రత్యేకంగా చూడాలని నాబార్డు, ఆప్కాబ్‌కు విన్నవించిన నేపథ్యంలో మొండిబకాయిల వసూళ్లకు వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) చాలాకాలం పాటు అమలు చేశామన్నారు. అసలు, వడ్డీలో కేవలం 35 శాతం చెల్లిస్తే మిగతా 65 శాతం మాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేసిన ఘనత డీసీసీబీదేనన్నారు.
1997కు ముందు తీసుకున్న మొండిబకాయిల వసూళ్ల కోసం మరోసారి ఓటీఎస్ పథకం అమలుకు అనుమతులు ఇవ్వాలని కోరగా అనుమతులు జారీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఈనెలాఖరులోపు 1.21 లక్షల మంది రైతులకు రూపేకార్డులు అందజేస్తామన్నారు. రానున్న 2017–18 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఆధునిక సేవలు, విరివిగా రుణాలు అందజేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి (డీసీవో) సూర్యనారాయణ, పాలక వర్గం సభ్యులు, పీఏసీఎస్, చేనేత సొసైటీ అధ్యక్షులు, బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.