కృష్ణా జలాలకు ‘ఇదేం ఖర్మ బాబూ...’
జగన్ మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మరో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ పేరు పెట్టారు. నిజానికి తెలుగు నిఘంటువులో ‘ఖర్మ’ అనే పదమే లేదు. తెలుగు భాష పట్ల అపారమైన గౌరవం ఉన్న ఎన్టీ రామారావు తన పార్టీకి తెలుగుదేశం అనే పేరు పెట్టారు. అటువంటి పార్టీకి నేడు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు అర్థం పర్థంలేని ఒక పదాన్ని సృష్టించి ఆ పేరుతో ప్రజలను పెడతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తరుణంలో రాష్ట్రాభివృద్ధికి అడు గడుగునా అడ్డు పడుతున్నారంటూ ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ బాబూ’ అంటూ ప్రత్యర్థులు ఆయన్ని విమర్శి స్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు విమర్శలను పట్టించుకోవడం కానీ, తన తప్పుల వల్ల ప్రజలకు, పర్యావరణానికి హాని జరుగుతున్నా పశ్చాత్తాప పడటం కానీ చేయరు.
ఆయన చట్ట విరుద్ధ పనుల్లో... కృష్ణానదీ తీరాన నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనంలో ఇప్పటికీ నివసిస్తుండటం ఒకటి. ఈ ప్రాంతంలోని నివాస ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విడుదల అవుతున్న కాలుష్యం కారణంగా కృష్ణానది చివరి రిజర్వాయర్ అయిన ప్రకాశం బ్యారేజ్ వద్ద నిల్వ చేస్తున్న జలాలు పెద్ద ఎత్తున కలుషిత మవుతున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర పొల్యూషన్ బోర్డు ‘వాటర్ క్వాలిటీ ఆఫ్ రివర్స్ 2021’ పేరిట విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 2022, అక్టోబర్ 13న బోర్డు అప్డేట్ చేసిన వివరాల ప్రకారం... విజయవాడ కృష్ణా బరాజ్ వద్ద గల ఈ నీరు పానయోగ్యంగా ఏ మాత్రం లేదని స్పష్టమయింది.
కృష్ణా కరకట్ట ప్రాంతంలో గుంటూరు జిల్లా పరిధిలో 48 భవనాలు, కృష్ణా జిల్లా పరిధిలో 18 భవనాలు ఉన్నాయి. వీటిలో చంద్రబాబు నివాసంతో పాటు వందలాది మంది రోగులకు నిలయమైన ప్రకృతి వైద్యశాల కూడా అక్కడే ఉంది. ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలకు డ్రైనేజ్ సదుపాయం లేదు. వీరు వాడే నీరంతా కృష్ణా బరాజ్ వద్ద గల నీటిలోనే కలిసి పోతోంది. ఫలితంగా ఈ జలాలు కలుషితమవుతున్నాయి. కేంద్ర పొల్యూషన్ బోర్డు నివేదిక ప్రకారం నదీజలాల్లో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బి.ఒ.డి.) ఐదు రోజుల సగటు విశ్లేషణల్లో లీటర్‌కు రెండు మిల్లీ గ్రాముల కన్నా తక్కువ ఉండాలి. గుంటూరు జిల్లా అమరావతి వద్ద కృష్ణా జలాల్లో బి.ఒ.డి. 1.4 మిల్లీగ్రాములుండగా అదేనీటిలో కృష్ణా బరాజ్ వద్ద బి.ఒ.డి. 2.6 మిల్లీ గ్రాములకు పెరిగి పోయింది. అయితే ఈ నీటినే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లక్షలాది మంది ప్రజలు మంచి నీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు.
కృష్ణా బరాజ్‌కు కుడివైపున నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనంలో మాజీ ముఖ్యమంత్రి నివసించడం ‘రివర్ కన్సర్వెన్సీ యాక్ట్’ను ఉల్లంఘించడమే. ఈ యాక్ట్ ప్రకారం నదిని ఆనుకుని 500 మీటర్ల వరకూ ఎటువంటి నిర్మాణాలను చేయకూడదు. కానీ మాజీ ముఖ్యమంత్రి నివసిస్తున్న భవనం నదికి వందమీటర్ల దూరంలోనే ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ 1996 మార్చి ఎనిమిదో తేదీన విడుదల చేసిన జీఓ నం. 111 ప్రకారం... నదికి సమీపాన ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. ఎటువంటి వ్యర్థ పదార్థాలు నదిలో వదలకూడదు. భారత శిక్షాస్మృతి సెక్షన్ 277 ప్రకారం నీటి వనరులను కలుషితం చేసే వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించవచ్చు.
ప్రస్తుతం చంద్రబాబు నివాస ప్రాంతంలో ఉన్న కట్టడాలన్నీ నదీ ‘పరిరక్షణ చట్టం–1884’ నిబంధనలకు విరుద్దంగా నిర్మించినవేనని స్వయానా అప్పటి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 2015 జనవరిలో చెప్పడమే కాక... వివిధ శాఖల నుంచి నోటీసులు కూడా ఇప్పించి వీటన్నిటినీకూల్చి వేస్తామని హడావిడి చేశారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసిస్తున్న లింగమనేని ఎస్టేట్ భవనం కూడా ఈ కూల్చివేత భవనాల జాబితాలో ఉంది. నదీ తీర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడం నిషిద్ధం. ఇదే విషయాన్ని అప్పటి ఆయన మంత్రి వర్గ సహచరుడే ప్రకటించినప్పటికీ చంద్రబాబు పెడచెవిన పెట్టారు.
వందలాది కోట్ల రూపాయల వ్యయంతో కృష్ణా పుష్కరాలను నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నదికి పవిత్ర హారతులు కూడా ఇచ్చారు. ఒకవైపు పుణ్య స్నానాలు చేస్తూ, హారతులు ఇస్తూ... మరోవైపు ఆ నదినే వ్యర్థాలతో అపవిత్రం చేయడం అత్యంత శోచనీయం. చంద్రబాబు నాయుడు పంతాలకు, పట్టింపులకు పోకుండా ఆ ప్రాంతంలోని తన నివాసాన్ని వేరే చోటికి తరలించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అలాగే ఈ ప్రాంతంలోని మిగిలిన అక్రమ కట్టడాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం తొలగించాలి. కృష్ణా నది శుద్ధికి శ్రీకారం చుట్టాలి. (క్లిక్ చేయండి: విజ్ఞానమే పరిష్కారం! చిట్కాలు కావు!)
- వి.వి.ఆర్. కృష్ణంరాజు
ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు