లిక్కర్ స్కాంలో నేతల పాత్రపై ఏసీబీ ఆరా
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మద్యం సిండికేట్ కుంభకోణంలో రాజకీయ నాయకుల పాత్రపైనా అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) కూపీ లాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ఏసీబీ అధికారులు అంతర్గతంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలి సింది. ఇప్పటివరకు ఈ కుంభకోణంలో 134 మంది అధికారులు, సిండికేట్లు, పోలీసు, ఎక్సైజ్ అధికారులను నిందితులుగా ఏసీబీ దర్యాప్తులో తేల్చింది. ఇందులో వంద మందిపై ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. మరో 34 మంది ఎక్సైజ్, పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ నరసింహన్ నాలుగు రోజుల క్రితం అనుమతి ఇచ్చారు.
దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న అందరు అధికారుల ప్రాసిక్యూషన్కు అనుమతి లభించిందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. అయితే గవర్నర్ నుంచి అధికారిక ఉత్తర్వులు ఏసీబీకి ఇంకా అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు, సిండికేట్లపై దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ అధికారులు ఈ కుంభకోణంలో పాత్ర ఉందని అనుమానిస్తున్న రాజకీయ నాయకులపైనా దృష్టి పెట్టారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పాత్రపై విచారణ జరపాలని గతంలో హైకోర్టు ఆదేశించిందని ఏసీబీకి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఇప్పటికే తమ వద్ద కొంత సమాచారం ఉందని దీనిపై పూర్తిగా పరిశీలన జరిపి అదనపు వివరాలను పకడ్బందీగా సేకరిస్తామని తెలిపారు.