పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ఫలితాల విడుదల
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: ఈ ఏడాది ఫిబ్రవరి 23న జరిగిన పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్సైట్, జిల్లా పరిషత్‌లోని నోటీసు బోర్డులో ఉంచారు. మొత్తం 164 పోస్టులకు గాను దాదాపు 45 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ర్యాంకులను కేటాయించి 1:2 నిష్పత్తి ప్రకారం ధ్రువపత్రాల పరిశీలనకు 328 మంది అభ్యర్థులకు పోస్టు ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. ఓసీ కేటగిరీ జనరల్‌కు 48 పోస్టులు రిజర్వు కాగా, వీటిలో 26 మంది బీసీలు మంచి మార్కులు సాధించారు.
ఓసీ మహిళకు 26 పోస్టులు రిజర్వు కాగా, వీటిలో కూడా 16 మంది బీసీ మహిళలు మంచి మార్కులు సాధించారు. దీంతో ఆయా విభాగాల్లోని అభ్యర్థులు కొంతమేర ఉత్కంఠకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక ఎంపిక కోసం జూన్ 5వ తేదీన ఓసీ జనరల్, మహిళ, బీసీ (ఏ) జనరల్, మహిళా అభ్యర్థులకు, 6వ తేదీన మిగిలిన అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్ చేయించిన జీరాక్స్ కాపీలు, పాస్‌పోర్టు సైజు ఫోటోలను తీసుకొని రావాలని జెడ్పీ సీఈఓ ఏ సూర్యప్రకాష్ సూచించారు.
కేటాయించిన రిజర్వేషన్ : ఓసీ జనరల్‌కు 48, ఓసీ మహిళకు 26, బీసీ (ఏ) జనరల్‌కు 8, మహిళకు 4, బీసీ (బీ) జనరల్‌కు 9, మహిళకు 6, బీసీ (సీ) జనరల్‌కు 2, బీసీ (డీ) జనరల్‌కు 7, మహిళకు 4, బీసీ (ఈ) జనరల్‌కు 4, మహిళకు 2, ఎస్సీ జనరల్‌కు 16, మహిళకు 8, ఎస్టీ జనరల్‌కు 6, మహిళకు 4, వీహెచ్ జనరల్‌కు 1, మహిళకు 1, ఓహెచ్ జనరల్‌కు 2, హెచ్‌హెచ్ జనరల్‌కు 1, మహిళకు 1, మాజీ సైనికోద్యోగులకు జనరల్‌కు 2, మహిళలకు 2 పోస్టులు రిజర్వు అయ్యాయి. వెల్లడైన ఫలితాల్లో ఓసీ కేటగిరీలో మొదటి ర్యాంకుకు 269 మార్కులు వచ్చాయి.