ఈరోజు ఎన్ని లీటర్లు వాన పడింది??
ఏంటీ ఏదో తేడాగా ఉంది అని అనిపిస్తోందా.. అవును మరి.. ఎప్పుడూ ఇన్ని మిల్లీ మీటర్లు లేదా ఇన్ని సెంటీమీటర్లలో వర్షం పడింది అని మాత్రమే మనం వింటుంటాం కదా.. అయితే.. కచి్చతంగా ఎంత పడిందన్న విషయం ఎలా తెలుస్తుంది? సింపుల్గా చెప్పాలంటే.. వర్షం పడినప్పుడు ఒక చదరపు మీటర్ స్థలంలో ఒక లీటర్ నీళ్లు నిలిస్తే.. ఒక మిల్లీమీటర్ వాన పడినట్లు.. అదే పది లీటర్ల నీళ్లు నిలిస్తే.. ఒక సెంటీమీటర్ అన్నమాట. అసలు వానను శాస్త్రవేత్తలు ఎలా లెక్కేస్తారో తెలుసా?ప్రత్యేక పరికరాలతో.. సాధారణంగా వాన నీటి లెక్కలను తేల్చేందుకు ప్రత్యేకంగా పరికరాలు ఉంటాయి. వాటిని ఆరుబయట ప్రదేశాల్లో నిటారుగా ఉండేలా అమర్చుతారు. వాటిపై మిల్లీమీటర్లు, సెంటీమీటర్ల లెక్కలు ఉంటాయి. వర్షం పడినప్పుడు అందులో చేరే నీటి స్థాయిని చూసి.. ఎంత వాన పడిందో చెప్తారు. కానీ వానకు మామూలు లెక్క ఏమిటంటే.. సమతలంగా ఉన్న ఒక చదరపు మీటర్ స్థలంలో ఒక లీటర్ నీళ్లు నిలిస్తే.. ఒక మిల్లీమీటర్ వాన అన్నమాట. ఈ లెక్కకు కొన్ని రూల్స్ ఉన్నాయి. కాంక్రీట్, ప్లాస్టిక్, ఏదైనా లోహంతో చేసినది అయినా సరే.. కచి్చతంగా చదరపు మీటర్ విస్తీర్ణం ఉండాలి. ఎక్కువ తక్కువలు, వంపు లేకుండా కచ్చితంగా సమతలంగా ఉండాలి. చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండాలి. వాన నీరు పడేందుకు ఎలాంటి అడ్డంకీ ఉండకూడదు.కురిసిన సమయాన్ని బట్టి తీవ్రత..ఎన్ని సెంటీమీటర్లు వాన అన్నది మాత్రమేకాకుండా ఎంత సమయంలో కురిసింది అన్నదాన్ని బట్టి.. వర్షం తీవ్రతను అంచనా వేస్తారు. ఉదాహరణకు ఒక రోజంతా అంటే 24 గంటల్లో ఆరు సెంటీమీటర్ల వానపడితే.. అది మోస్తరు వర్షం కిందే లెక్క. అదే ఒకట్రెండు గంటల్లోనే ఆరు సెంటీమీటర్లు పడితే కుంభవృష్టి కురిసినట్టే. ఇలా జరిగితే నీరంతా ఒక్కసారిగా చేరి వరదలు వస్తాయి. ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.