టీడీపీకి మళ్లీ తప్పని చావుదెబ్బ
మెదక్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీ మరోసారి ఘోర పరాజయం చవిచూడక తప్పలేదు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో తెలంగాణ తెలుగుదేశం కనీసం డిపాజిట్ ను కూడా దక్కించుకోలేక చతికిలపడింది. రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్న తెలంగాణ తెలుగుదేశం ఈ ఉప ఎన్నికలో పూర్తిగా చేతులెత్తేసింది.
ఈ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ తన హవాను కొనసాగించింది. 53వేల 625 ఓట్ల మేజారిటీతో ఘన విజయం సాధించింది. మొత్తం 93 వేల 76 ఓట్లను గులాబీ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి దక్కించుకున్నారు. అయితే నారాయణఖేడ్ ఉప ఎన్నికలో మొత్తం లక్షా 54,866 ఓట్లు పోలవ్వగా టీడీపీ కేవలం 14 వేల 787 ఓట్లు మాత్రమే సాధించింది. డిపాజిట్ దక్కాలంటే పోలైన చెల్లుబాటు ఓట్లలో ఆరో వంతు ఓట్లను విధిగా సాధించాల్సి ఉంటుంది. అంటే 25 వేలకు పైగా ఓట్లను దక్కించుకోవాల్సి ఉంది. కానీ టీడీపీ ఆ టార్గెట్ను రీచ్ కావడం మాట దేవుడెరుగు ఆదిలోనే గుడ్లు తేలవేసింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చాలా రౌండ్లలో వెయ్యి ఓట్లను కూడా సాధించలేకపోయింది. నాలుగు రౌండ్లలో మాత్రమే వెయ్యికి మించి ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. అటు కాంగ్రెస్ 39 వేల 451 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.