పాలపొడిలో పురుగులు.. నెస్లెకు మరిన్ని కష్టాలు
ఇప్పటికే మ్యాగీ నూడుల్స్ వివాదంతో తలపట్టుకున్న నెస్లె ఇండియా కంపెనీకి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. తమిళనాడులో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన పిల్లల పాలపొడిలో పురుగులు కనిపించాయి. కోయంబత్తూరుకు చెందిన కె. ప్రేమ్ అనంత్ అనే టాక్సీ డ్రైవర్ తన కవల పిల్లల కోసం నెస్లె వారి నాన్ ప్రో3 అనే పాల పొడిని కొన్నారు. కానీ అందులో లార్వాతో పాటు.. సాధారణంగా బియ్యంలో కనిపించే పెంకిపురుగులు కూడా వచ్చాయి. 28 లార్వా, 22 పెంకి పురుగులు ఆ పాలపొడి డబ్బాలో ఉండటంతో.. ఆ పాలపొడి సురక్షితమైనది కాదని తమిళనాడు ఆహారభద్రతా విభాగం ప్రకటించింది.
18 నెలల వయసున్న తన కవల పిల్లల్లో ఒకరికి అనంత్ ఆ పాలపొడితో కలిపిన పాలు పట్టేశారు. మరొకరికి కూడా పట్టబోతుంటే.. అప్పుడు పురుగులను గమనించారు. పాలు పట్టిన రెండు రోజుల తర్వాత చర్మం మీద ఎలర్జీ రావడంతో.. ఆ పాపను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. దాంతో అనంత్ నెస్లె కస్టమర్ సపోర్ట్ నెంబరుకు ఫిర్యాదు చేయగా, వాళ్లు ఈ విషయం ఏంటో చూడాలని స్థానిక ఏరియా మేనేజర్ కృష్ణపెరుమాళ్ను పంపారు.
ఆయన ఆ డబ్బాకు బదులు మరో డబ్బా ఇస్తామని చెప్పగా, అనంత్ తిరస్కరించారు. దాంతో తమ కంపెనీ ల్యాబ్లో దాన్ని పరీక్షిస్తామని తెలిపినా ఒప్పుకోలేదు. తమిళనాడు ఆహారభద్రత, ఔషధ నియంత్రణ విభాగం వద్దకు వెళ్లి శాంపిళ్లను ఇచ్చారు. దాంతో విషయం తేలింది.