ఇళ్లు కూలగొట్టారు.. అద్దెలు ఎగ్గొట్టారు
అడవి తల్లి ఒడిలో వాళ్లు కట్టుకున్న ఇళ్లను ప్రభుత్వం పడగొట్టించింది. వారికి పునరావాసం కల్పించకుండా ఊరు విడిచి పోవాలంటూ తరిమేసింది. అదేమని అడిగితే.. త్వరలోనే సొంతిళ్లు కట్టిస్తామని.. అప్పటివరకూ అద్దె ఇళ్లల్లో ఉండాలని హుకుం జారీ చేసింది. తమకంత స్థోమత లేదని సొంతూరులోనే ఏదోమూల బతుకీడుస్తామంటే.. అద్దె తామే కడతామని నమ్మబలికింది. సర్కారు మాటల్ని నమ్మి పొరుగూళ్లకు వెళ్లి తలదాచుకుంటున్న ఆ కుటుంబాలకు మూడు నెలలుగా అద్దె సొమ్ము చెల్లించకుండా అగచాట్లకు గురి చేస్తోంది.
పోలవరం :‘వెంటనే ఊళ్లను ఖాళీ చేయండి. మీకు ఇళ్లు కట్టి ఇచ్చే వరకు అద్దె ఇళ్లల్లోకి ఉండండి. నెలకు రూ.మూడు వేల చొప్పున అద్దె చెల్లిస్తాం. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం’ అని ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు మాట ఇచ్చారు. వాళ్ల మాటల్ని నమ్మి పోలవరంలోని ఇటుకలకోట రోడ్డులో గల పునరావాస కేంద్రాల్లో అద్దె ఇళ్లల్లోకి వచ్చాం. ఇప్పటివరకు అద్దె డబ్బు ఇవ్వలేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇంటి యజమానులు వెంటనే అద్దె కట్టండి, లేదంటే ఖాళీ చేయండంటున్నారు. ఏం చేయాలో
పాలుపోవడం లేద’ని వాపోతున్నారు పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాలైన రామయ్యపేట, సింగన్నపల్లి నిర్వాసితులు.
రామయ్యపేటకు చెందిన 40 కుటుం బాలు, సింగన్నపల్లికి చెందిన 40 కుటుంబాలు ఇటుకులకోట రోడ్డులోని పునరావాస కేంద్రాల్లో అద్దెకు ఉంటున్నాయి. పునరావాస కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకుండా అధికారులు ఆయా కుటుంబాల వారిని అద్దె ఇళ్లల్లోకి పంపిం చివేయడంతో ఈ దుస్థితి తలెత్తిందని నిర్వాసితులు చెబుతున్నారు. సింగన్నపల్లి గ్రామస్తులకు ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తమదేనని, అప్పటివరకు ఆ కుటుంబాల వారికి నెలనెలా అద్దె చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తామంతా అద్దె ఇళ్లల్లోకి వచ్చి మూడు నెలలు దాటిందని, రెండు నెలల అద్దె చెల్లించలేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.
రామయ్యపేట నిర్వాసితులకు మూడు నెలల అద్దె చెల్లిస్తామని అధికారులు అభయమిచ్చారు. మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. వారికి కట్టిస్తామన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. కొన్ని ఇళ్లకు సంబంధించి అసలు పనులే మొదలు కాలేదు. ఈ పరిస్థితుల్లో అద్దె ఇళ్లల్లో ఎన్నాళ్లు ఉండాలో, ఎన్ని నెలలకు అద్దె చెల్లిస్తారో తెలి యక నిర్వాసితులు సతమమవుతున్నారు. అధికారులు తమను నమ్మించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువకులకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, వారి గురించి పట్టించుకోవడం లేదని నిర్వాసితులు పొన్నాడ దుర్గాప్రసాద్, దత్తి నాగలక్ష్మి తదితరులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు నెలవారీ అద్దె చెల్లించడంతోపాటు పునరావాస కేంద్రాల్లో ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు.
పూర్తికాకుండానే పొమ్మన్నారు
పునరావాస కేంద్రం లో ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు. గ్రామం విడిచి అద్దె ఇళ్లకు వెళ్లండి.. అద్దెలు ప్రభుత్వమే చెల్లిస్తుందని అధికారులు హామీ ఇచ్చారు. ఆ మాట నమ్మి ఇల్లు ఖాళీచేసి అద్దె ఇళ్లల్లోకి వెళ్లాం. మూడు నెలలు దాటిపోయింది. అద్దె ఇవ్వకపోతే యజమానులు తమ ఇళ్లల్లోంచి వెళ్లిపోమంటున్నారు. – కర్రి లక్ష్మణరావు, నిర్వాసితుడు, సింగన్నపల్లి
ఒక్కనెల కూడా ఇవ్వలేదు.. అద్దె ఇళ్లల్లోకి వెళ్లండి.. నెలకు రూ. 3వేలు చొప్పున మూడు నెలలపాటు చెల్లిస్తామని అధికారులు చెప్పారు. తీరా ఇళ్లల్లోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు ఒక్కనెల అద్దె కూడా ఇవ్వలేదు. ఇదేమని అడిగితే బిల్లు పెట్టాం, రాగానే ఇస్తామన్నారు. అద్దె చెల్లించకపోతే ఇంటి యజమానులు ఊరుకోవడం లేదు.– పోతుల సూర్యప్రకాశరావు, నిర్వాసితుడు, రామయ్యపేట