‘సజీవ సమాధి’పై అధ్యయన కమిటీ
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనుల్లో భాగంగా మట్టి పెళ్లలు మీద పడడంతో ఏడుగురు సజీవ సమాధైన సంఘటనపై కార్పొరేషన్ అధికారులు నలుగురు సభ్యుల అధ్యయన కమిటీని నియమించారు. విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ పాండురంగారావు, స్ట్రక్చర్ ఇంజినీర్లు ఆంజనేయప్రసాద్, వేణుప్రసన్న, జి.శ్రీనివాసరావుతో కమిటీ వేశారు.
ఈ కమిటీతో పాటు డీఆర్వో నాగబాబు, నగరపాలక సంస్థ సీపీ ధనుంజయరెడ్డి తదితరులు మంగళవారం ప్రమాదం జరిగిన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. అనంతరం ప్రమాద స్థలానికి పశ్చిమ వైపు ఉన్న పంచ్ హోటల్‌తో పాటు ఐదు భవనాలకు ప్రమాదం జరుగుతుందేమోననే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటిల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. లేడీస్ హాస్టళ్లలోని విద్యార్థినులను సైతం పంపించేశారు. ల్యాబ్ నుంచి నివేదిక రాగానే భవనాల్లోకి మళ్లీ అనుమతించాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని అధికారులు చెబుతున్నారు.
బుధవారం పంచ్ హోటల్ స్థలంలోని కొంత భాగాన్ని కూల్చివేయాలని నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులకు కమిటీ సూచించినట్లు తెలిసింది. గోడ కూలిన వైపు నిర్మాణ స్థలంలో రిటైనింగ్ వాల్ నిర్మించాలని కూడా సూచించింది. అయితే బిల్డర్‌తో పాటు, టెక్నికల్ పర్సన్, స్ట్రక్చరల్ ఇంజినీర్ల లెసైన్సు రద్దు చేస్తూ నగర కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో దీన్ని ఎవరు నిర్మించాలనే దానిపై చర్చించి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అనంతరం కమిటీ నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశమై పలు విషయాలపై చర్చించింది. నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి గుంటూరు నగరంలోని బిల్డర్లు, కాంట్రాక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు జీవో నంబరు 16 ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె వివరించారు. కార్మికులకు హెల్మెట్లు వంటి సేఫ్టీ వస్తువులను తప్పనిసరిగా అందించాలని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.