'వాళ్ల లివర్ ఉప్పులో నంజుకుని తినేస్తా'
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి మరోసారి సంచలన ప్రకటన చేశారు. ముస్లిం ఉగ్రవాదుల కంటే తాను 50 రెట్లు ఎక్కువ క్రూరుడినని, వాళ్లు తలలు మాత్రమే నరికితే తాను ఉగ్రవాదులు సజీవంగా దొరికితే వాళ్లను తినేస్తానని చెప్పారు. డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్లకు ఫిలిప్పీన్స్‌లో చోటు లేదని, అలాంటివాళ్లను చంపేసినా ప్రజలకు శిక్ష ఉండదని గతంలో ప్రకటించిన డుటెర్టి.. ఇప్పుడు మరింత దారుణంగా చెప్పారు. జాతీయ క్రీడా టోర్నమెంటు ప్రారంభోత్సవంలో ఆయనీ మాటలు చెప్పారు. ఉగ్రవాదులు ప్రజలను భయకంపితులు చేయడానికి తలలు నరికేస్తున్నారని, వాళ్లు జంతువుల లాంటివాళ్లు కాబట్టి సజీవంగా పట్టుకోవాల్సిన అవసరం లేదని, కాల్చిపారేయాలని తన సైనికులను ఆయన ఆదేశించారు. తాను కూడా జంతువులాగే మారాలనుకుంటే మారతానని, తనకు మూడ్ బాగోనప్పుడు ఎవరైనా ఉగ్రవాదులను సజీవంగా తనకు అప్పగిస్తే.. కాస్త ఉప్పు, వెనిగర్ ఇస్తే.. అందులో నంజుకుని వాళ్ల లివర్‌ను తినేస్తానని చెప్పారు. అధ్యక్షుడి మాటలు విని అక్కడున్నవాళ్లంతా పెద్దపెట్టున నవ్వారు. అయితే.. అది నిజమేనని, తనకు కోపం వస్తే అలాగే చేస్తానని డుటెర్టి అన్నారు.
నేరాలు అరికట్టడంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని పేరున్న డుటెర్టి చాలాకాలం మనిలా నగర మేయర్‌గా ఉన్నారు. గత సంవత్సరం మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడిగా గెలిచారు. అక్రమ డ్రగ్స్ వ్యాపారం, అవినీతి, ఉగ్రవాదాలపై తాను పోరాడతానని, వాటిని ఉక్కు పాదాలతో అణిచేస్తానని చెప్పడంతో ప్రజలు ఆయనను గెలిపించారు. ఉగ్రవాదం చేతులు దాటితే ముస్లిం వేర్పాటువాద ఉద్యమం తీవ్రంగా ఉన్న దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సైనిక పాపలన విధిస్తానని కూడా డుటెర్టి హెచ్చరించారు. బొహోల్ రాష్ట్రంపై దాడికి విఫలయత్నం చేసిన అబు సయ్యఫ్, ఇతర ఉగ్రవాదుల గురించి సమాచారం అందించిన వారికి పెద్ద ఎత్తున బహుమతి ఇస్తానని ఇటీవలే ప్రకటించారు.