IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్
ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొత్తగా మరో ఫాస్ట్ బౌలర్ చేరాడు. వ్యక్తిగత కారణాల చేత ప్రస్తుత సీజన్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లిజాడ్ విలియమ్స్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. విలియమ్స్‌ను డీసీ 50 లక్షల బేస్ ప్రైజ్‌కు సొంతం చేసుకుంది.
కాగా, ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచింది. తాజాగా (ఏప్రిల్ 7) ముంబై చేతిలో ఓటమిపాలైంది. ఢిల్లీ దారుణ ప్రదర్శనకు ఆ జట్టు బౌలింగే ప్రధాన కారణం. ఈ జట్టులోని బౌలర్లు ప్రతి మ్యాచ్‌లో పోటాపోటీపడి పరుగులు సమర్పించుకుంటూ వరుస ఓటములకు కారకులవుతున్నారు.
ముఖ్యంగా పేసర్ అన్రిచ్ నోర్జే చాలా దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. డీసీ యాజమాన్యం ఈ సఫారీ పేసర్‌పై భారీ అంచనాలు పెట్టుకుంటే, అతను మాత్రం సాధారణ బౌలర్ కంటే హీనంగా బౌలింగ్ చేస్తూ తుస్సుమనిపిస్తున్నాడు. నోర్జే ప్రతి మ్యాచ్‌లో 12కు పైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకుంటున్నాడు. డీసీ మేనేజ్మెంట్ లిజాడ్ విలియమ్స్‌ను ఎంపిక చేసుకోవడానికి నోర్జే వరుస వైఫల్యాలే కారణమని తెలుస్తుంది. నోర్జే స్థానాన్ని లిజాడ్ విలియమ్స్‌తో భర్తీ చేయాలని డీసీ భావిస్తుంది.
ఈ సీజన్లో నోర్జే ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..
రాజస్థాన్‌పై 4-0-48-1
సీఎస్కేపై 4-0-43-0
కేకేఆర్‌పై 4-0-59-3
ముంబై ఇండియన్స్‌పై 4-0-65-2
ఇదిలా ఉంటే, నిన్న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది.
235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందు విఫలయత్నం చేశారు. స్టబ్స్ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది.