ఎన్‌బీఎఫ్‌సీలకు... నిధుల కటకట
ముంబై: నిధుల సమస్యలతో సతమతమవుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తాజాగా కరోనా వైరస్ పరమైన లాక్డౌన్, రుణాల చెల్లింపులపై మారటోరియం తదితర పరిణామాలతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నాయి. కొన్ని సంస్థలు ఈ పరిస్థితిని తట్టుకోలేక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను వాపసు చేస్తుండగా.. సంక్షోభంలో ఉన్న మరికొన్నింటి రిజిస్ట్రేషన్‌ను రిజర్వ్ బ్యాంకే రద్దు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీల అసెట్ క్వాలిటీ క్షీణించి, నిధుల కొరత మరింత తీవ్రం కానున్నదంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు బలహీనపడటం వల్ల వాటికి రుణాలిచ్చిన బ్యాంకులకు కూడా గణనీయంగా రిస్కులు పొంచి ఉన్నాయని హెచ్చరించింది. 2018లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ డిఫాల్ట్ అయినప్పట్నుంచీ ఇన్వెస్టర్లు రిస్కీ సాధనాలకు దూరంగా ఉంటుండటంతో ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల లభ్యత తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ’గడిచిన కొన్నాళ్లుగా ఆర్థిక మందగమనం నెమ్మదిగా కమ్ముకొస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆర్థిక పరిస్థితులు మరింతగా దెబ్బతింటాయి. ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీల అసెట్ నాణ్యత కూడా ఇంకా దిగజారుతుంది’ అని మూడీస్ పేర్కొంది. బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు అత్యధిక రిస్కులు ఉన్న వర్గాలకు రుణాలిస్తాయి కాబట్టి సగటున వాటి అసెట్ క్వాలిటీ క్షీణత మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది.
మారటోరియం దెబ్బ...: ఇక రుణాల చెల్లింపునకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) 3 నెలల పాటు మారటోరియం ప్రకటించడం కూడా ఎన్‌బీఎఫ్‌సీలకు స్వల్పకాలిక నిధుల లభ్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని మూడీస్ తెలిపింది. చాలా మటుకు ఎన్బీఎఫ్సీలు తమకు వసూలయ్యే బాకీల నుంచే తాము కట్టాల్సిన రుణాలను చెల్లిస్తుంటాయి. వాటి దగ్గర భారీ స్థాయిలో నిధులు ఉండవు. ప్రస్తుతం మారటోరియం కారణంగా తమకు బాకీలు వసూలు కాకపోవడం వల్ల ఎన్బీఎఫ్సీలు తాము బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కూడా సకాలంలో తిరిగి చెల్లించలేని పరిస్థితి తలెత్తుతుందని మూడీస్ తెలిపింది. మారటోరియం వల్ల రాబోయే మరికొన్ని నెలల పాటు ఎన్‌బీఎఫ్‌సీలకు రావాల్సిన నిధుల ప్రవాహం గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొంది. రుణ చెల్లింపులపై మారటోరియం ఎత్తివేసినా, ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు ఎంత ఎక్కువ కాలం కొనసాగితే .. రుణాల రీపేమెంట్ తిరిగి సాధారణ స్థాయికి రావడానికి అంత ఎక్కువ సమయం పట్టేసే అవకాశం ఉందని తెలిపింది. మారటోరియం వ్యవధిలో రుణాల రీపేమెంట్లు కనీసం 50 శాతం పడిపోవచ్చని అంచనా వేసింది.
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వాపసు చేసిన 9 ఎన్బీఎఫ్సీలు..
తాజా పరిస్థితుల నేపథ్యంలో తొమ్మిది ఎన్బీఎఫ్సీలు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను వాపసు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. రిలయన్స్ నెట్, నిశ్చయ ఫిన్వెస్ట్, పెన్రోజ్ మెర్కంటైల్స్, మనోహర్ ఫైనాన్స్ ఇండియా, షాండిలియర్ ట్రాకోన్, సంఘి హైర్ పర్చేజ్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఆర్బీఐకి తిరిగి ఇచ్చేయడం వల్ల ఈ కంపెనీలు బ్యాంకింగ్యేతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఉండదు. 14 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు ఆర్బీఐ మరో ప్రకటనలో తెలిపింది. ప్రైమస్ క్యాపిటల్ (గతంలో ర్యాపిడ్ గ్రోత్ క్యాపిటల్), భారత్ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రీస్, సిగ్నేచర్ ఫైనాన్స్, డీ బీ లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్, జిందాల్ ఫిన్‌లీజ్, బీఎల్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మొదలైనవి వీటిలో ఉన్నాయి.
నిధుల సమీకరణ కష్టమే..
గడిచిన కొన్నాళ్లుగా తమకు రావాల్సిన బాకీలను తనఖా పెట్టి ఎన్బీఎఫ్సీలు కాస్త అదనంగా నిధులను సమీకరించుకోగలుగుతున్నాయి. అయితే, మారటోరియం కారణంగా వసూళ్లు పడిపోవడం వల్ల ఈ మార్గంలో నిధుల సమీకరణ కూడా కష్టంగా మారగలదని మూడీస్ పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీల రుణపత్రాల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం ఇటీవల ప్రకటించిన చర్యలు సమీప భవిష్యత్‌తో వాటికి ఊరట కలిగించేవే అయినప్పటికీ.. వ్యవస్థాగతమైన నిధుల కొరత కష్టాలు తీర్చేందుకు సరిపోవని అభిప్రాయపడింది.