మహిళలకు రుణ మంజూరులో వివక్ష వద్దు
బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి
ముంబై: చిన్న చిన్న పట్టణాలలో మహిళలకు రుణాల్ని ఇచ్చే ప్రక్రియలో బ్యాంకులు ఎలాంటి వివక్షను ప్రదర్శించవద్దని కేంద్ర వాణి జ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం మనీలైఫ్ ఫౌండేషన్ ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వ్యాపార రంగంలో మహిళల పాత్రను పెంచటానికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. మెట్రోపాలిటన్ నగరాలలోని బ్యాంకులు రుణాలను ఇచ్చే క్రమంలో రుణగ్రహీతల మెరిట్‌ను మాత్రమే చూస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ పరిస్థితి చిన్న చిన్న పట్టణాలలో భిన్నంగా ఉందన్నారు. చిన్న పట్టణాలలో మహిళలు రుణాల్ని తీసుకోవడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితులలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన చుట్టూ ఎంతో మంది వినూత్న మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళా రుణ మంజూరులో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) ఇతర బ్యాంకులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రిఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) బ్యాంక్ వంటి కార్యక్రమాల వల్ల మహిళా పారిశ్రామికవేత్తలకు రిఫైనాన్స్, క్రెడిట్ గ్యారెంటీ సౌకర్యాలు లభిస్తాయని పేర్కొన్నారు.