local cricket match
-
క్రికెట్ మ్యాచ్ మధ్యలో అంపైర్‌కు గుండెపోటు
కరాచీ : ఓ క్రికెట్ మ్యాచ్ మధ్యలో అంపైర్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ ఘటన పాకిస్తాన్లో జరుగుతున్న లోకల్ క్రికెట్ టోర్నమెంట్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 56 ఏళ్ల నసీమ్ షేక్ కరాచీలోని టీఎంసీ గ్రౌండ్లో జరుగుతున్న లాయర్స్ టోర్నమెంట్‌కు అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే మ్యాచ్ మధ్యలో అతనికి గుండెపోటు రావడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారు నసీమ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, వృత్తి రీత్యా నసీమ్ మాంసం వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ.. క్రికెట్‌పై ఉన్న అమితమైన ప్రేమ అతన్ని అర్హత కలిగిన అంపైర్‌గా మారేలా చేసింది. -
క్రికెట్ ఆడుతూ.. బ్యాట్ తగిలి యువకుడి మృతి
బహదూర్‌పురా: క్రికెట్ బ్యాట్ తలకు బలంగా తగిలిన సంఘటనలో ఓ యువకుడు మరణించాడు. హైదరాబాద్ బహదూర్‌పురాలోని రమ్నాస్‌పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ వాజిద్ (21) ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. సెలవులు కావడంతో తాడ్‌బన్‌లోని మీరాలం ఈద్గాలో స్నేహితులతో కలిసి ఈ నెల 14న క్రికెట్ ఆడుతున్నాడు. మీరాలం ఈద్గా గ్రౌండ్లో దాదాపు 300-400 మంది యువకులు పలు చోట్ల క్రికెట్ ఆడుతున్నారు. బాల్‌ను పట్టుకునే క్రమంలో వాజిద్ వేగంగా వేరే జట్టు బ్యాట్స్‌మెన్ వైపు పరుగెత్తాడు. అదే సమయంలో తమ బౌలర్ వేసిన బాల్‌ను కొట్టేందుకు బ్యాట్స్‌మెన్ బ్యాట్‌ను ఒక్కసారిగా తిప్పాడు. ఆ బ్యాట్ వాజీద్ తలకు బలంగా తగిలింది. దీంతో వాజిద్ అక్కడే కుప్పకూలాడు. క్రికెట్ ఆడుతున్న యువకులు వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన బాధితుడిని చికిత్స నిమిత్తం కాచిగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయం అవడంతో మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాజిద్ మంగళవారం ఉదయం మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న బహదూర్‌పురా పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. వాజిద్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.