Local election manifesto
-
ఉచిత వైఫై, పింక్ టాయిలెట్లు!
లక్నో: ప్రముఖ ప్రదేశాల్లో ఉచిత వైఫై, మహిళల కోసం ప్రత్యేకంగా ‘పింక్ టాయిలెట్లు’, ఉచిత మంచినీటి కనెక్షన్లు.. ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇస్తున్న హామీలివి. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఆదివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ తదితరులతో కలసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం యోగి మాట్లాడుతూ, ఎలాంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు. నవంబర్–డిసెంబర్లో 16 మున్సిపల్ కార్పొరే షన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 652 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉచిత కమ్యూనిటీ టాయిలెట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ.20 వేల గ్రాంటు, జంతువులకు షెల్టర్లు, ఈ–టెండరింగ్.. తదితర 28 హామీలను మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చింది. మరోవైపు బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ విడుదల చేసినది సంకల్ప్ పత్ర కాదని, ఛల్ పత్ర (ప్రజలను మోసగించే పత్రం) అని సమాజ్వాదీ పార్టీ విమర్శించింది. గతంలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని కాంగ్రెస్ ఆరోపించింది. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరగనున్న తొలి ముఖ్య ఎన్నికలు కావడంతో.. ఆయనకు పాలనకు ఇవి పరీక్షగా మారనున్నాయి. -
బీజేపీ వైపు లోక్సత్తా చూపు!
మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి జేపీ పోటీ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని లోక్సత్తా భావిస్తోంది. ఎన్నికల్లో కలసి పనిచేయాలన్న ఆసక్తిని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ బీజేపీ అగ్రనేతల వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్న జేపీ అందులో భాగంగానే బీజేపీతో పొత్తుకు ఉత్సాహం చూపుతున్నట్టు తెలిసింది. వెంకయ్యనాయుడు తదితర నేతల ద్వారా జేపీ.. బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. వారం రోజుల్లోపు బీజేపీతో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ పొత్తుకు అంగీకరించని పక్షంలో ఒంటరిగానైనా మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని జేపీ భావిస్తున్నారు. కాగా, లోక్సభకు పోటీ చేయాలని జేపీ నిర్ణయించుకోవడంతో కూకట్పల్లి అసెంబ్లీ స్థానానికి మరొక అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ‘స్థానిక’ మేనిఫెస్టో విడుదల: స్థానిక సమస్యల పరిష్కారంలో ఎవరిని ప్రశ్నించాలో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం నుంచి భారీస్థాయిలో నిధులు అందుతున్న వాటిని ఖర్చుచేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు, ఇతర నేతలు పాల్గొన్నారు.