బీజేపీ వైపు లోక్‌సత్తా చూపు!
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి జేపీ పోటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని లోక్‌సత్తా భావిస్తోంది. ఎన్నికల్లో కలసి పనిచేయాలన్న ఆసక్తిని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ బీజేపీ అగ్రనేతల వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్న జేపీ అందులో భాగంగానే బీజేపీతో పొత్తుకు ఉత్సాహం చూపుతున్నట్టు తెలిసింది. వెంకయ్యనాయుడు తదితర నేతల ద్వారా జేపీ.. బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. వారం రోజుల్లోపు బీజేపీతో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ పొత్తుకు అంగీకరించని పక్షంలో ఒంటరిగానైనా మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని జేపీ భావిస్తున్నారు. కాగా, లోక్‌సభకు పోటీ చేయాలని జేపీ నిర్ణయించుకోవడంతో కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానానికి మరొక అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
‘స్థానిక’ మేనిఫెస్టో విడుదల: స్థానిక సమస్యల పరిష్కారంలో ఎవరిని ప్రశ్నించాలో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం నుంచి భారీస్థాయిలో నిధులు అందుతున్న వాటిని ఖర్చుచేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు, ఇతర నేతలు పాల్గొన్నారు.