తెలంగాణ అనివార్యం..!: జయప్రకాశ్ నారాయణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అవసరం...అనివార్యం...అందుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. అయితే, మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం జరిగేలా కేంద్రం చూడాలని, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక హోదాను కల్పించి, ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. రాష్ర్ట పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై శనివారం శాసనసభలో ఆయున మాట్లాడారు. రాష్ర్టంలో ఆయా ప్రాంతాల ప్రజల మధ్య విభజన వచ్చిందని, ఈ పరిస్థితుల్లో కలసి ఉండడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. విభజన సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలను కేంద్రం తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఏ విధంగా విభజన చేయకూడదో ఆ విధంగా కేంద్రం చేస్తున్నదని, ఈ విషయంలో అందరినీ ఒప్పించాలని, బలవంతంగా రుద్దకూడదన్నారు.
రాయలసీమ తీవ్రంగా వెనుకబడి ఉందని, ఇక్కడ ఆదాయం 18 వేల కోట్లు ఉంటే..వ్యయం 25 వేల కోట్లు ఉందని, దాంతో 7 వేల కోట్ల రూపాయల లోటు ఉందని చెప్పారు. ఇప్పటి వరకు ఆ ప్రాంతం వారే ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నా వెనుకబడే ఉందని గుర్తు చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి అన్ని రంగాల్లో సీమ వెనుకబడే ఉన్నందున.. అక్కడివారు అంగీకరిస్తే ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పాటు చేయాలని కోరారు. కాని పక్షంలో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి ఏటా 10 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలన్నారు. తెలంగాణ బిల్లు లోపభూయిష్టంగా ఉందని, ఒక రాష్ర్ట పరిపాలనను గవర్నర్ చేతుల్లో పెడతారా ? ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ లోపాలను సవరించాలని జేపీ సూచించారు.