ముగిసిన ‘స్థానిక’ సమరం
* ప్రశాంతంగా సాగిన తుదివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
* తుది దశలో 82 శాతం పోలింగ్
* మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలకు మరో నెల నిరీక్షించాల్సిందే
* తుది విడతకు సంబంధించి కొన్నిచోట్ల ఈనెల 13న రీపోలింగ్
* మే 10న మున్సిపల్, 12న ప్రాదేశిక ఫలితాల
* వెల్లడికి ఎన్నికల సంఘం కసరత్తు
* సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం జరిగిన తుది విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ దశలో 82 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ప్రాదేశిక ఎన్నికల సమరం ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ఫలితాలు తెలియాంలంటే మరో నెలకు పైగా అభ్యర్థులు, ప్రజలు నిరీక్షించాల్సిందే..! సాధారణ ఎన్నికల తరువాత ఓట్ల లెక్కింపు జరిగే ఈ ఎన్నికల ఫలితాలను ఒకరకంగా రిజర్వ్ చేసినట్లు లెక్క! మే 10న మున్సిపల్, 12వ తేదీన ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సీమాంధ్రలో మే ఏడో తేదీన సాధారణ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. అప్పటి వరకు వరుస ఎన్నికలతో అలసిపోయిన పోలీసు బలగాలకు రెండురోజుల విరామం కల్పించిన అనంతరం మే 10న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, మరో రోజు విరామం తర్వాత 12వ తేదీన ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెల్లడించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే ఈ తేదీలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడి రాష్ట్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రాదేశిక ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో నిర్వహించినందున వాటి లెక్కింపు, ఫలితాలు వెలువడడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
తర్వాత సాధారణ ఎన్నికల ఫలితాల వెల్లడికి మూడు రోజుల గడువు ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేశారు. స్థానిక సంస్థల ఫలితాల వెల్లడితో సాధారణ ఎన్నికల్లో తవు గెలుపు అవకాశాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని భయపడిన రాజకీయ పార్టీలు.. ఆ ఎన్నికల తరువాతే స్థానిక ఫలితాలు ప్రకటించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్నాయి. కాగా శుక్రవారం 536 జెడ్పీటీసీ, 7,975 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన తుది విడత ప్రాదేశిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 82 శాతం పోలింగ్ నమోదైంది.
2006లో నిర్వహించిన ఎన్నికల్లో పోలైన శాతం కంటే ఈసారి దాదాపు తొమ్మిది నుంచి పదిశాతం అధికంగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. శుక్రవారం ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తుదివిడత ఎన్నికలకు సంబంధించి ఏడు ఎంపీటీసీ స్థానాల్లో ఈనెల 13న రీపోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఇందులో విశాఖపట్టణం జిల్లా బూసిపట్టు పంచాయతీలోని 27వ పోలింగ్ కేంద్రంలో మావోయిస్టులు బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లడంతో అక్కడ మాత్రం 16వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని రమాకాంత్‌రెడ్డి తెలిపారు.
అనంతపురం జిల్లా మడకశిరలోని పోలింగ్ కేంద్రం 35లో కేవలం జెడ్పీటీసీ స్థానం కోసం రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ 86 బ్యాలెట్ పత్రాలు మరో జెడ్పీటీసీ స్థానానికి సంబంధించినవి వచ్చాయని వివరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి-2లోని ఆరో పోలింగ్ కేంద్రం, నెల్లూరులోని కాలువోయ-2 ఎంపీటీసీ 18, 21 కేంద్రాలు, డక్కిలి మండలంలోని శ్రీపురం ఎంపీటీసీ పోలింగ్ కేంద్రం 43లో, విజయనగరం జిల్లా రావివలస ఎంపీటీసీలోని పోలింగ్ కేంద్రాలు 41,42లలో ఆదివారంనాడు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సంతృప్తిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు.
ఖమ్మంలో అత్యధికం 90 %
తుది దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యల్పంగా కర్నూలులో 74 శాతం పోలింగ్ నమోదుకాగా... అత్యధికంగా ఖమ్మంలో 90 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి దశలో 81 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.