
శ్రీనగర్: ప్రధాన రాజకీయ పార్టీల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో మొదటి విడత స్థానిక ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ నమోదయింది. కశ్మీర్ లోయలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం మొదటి విడత 83 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 84,692 మంది ఓటర్లకు గాను 7,057 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉగ్రవాద ప్రభావిత కశ్మీర్ లోయలో కేవలం 8.3 శాతం ఓటింగ్ నమోదయింది. జమ్మూలోని కార్గిల్‌లో అత్యధికంగా 78 శాతం, లేహ్‌లో 52 శాతం పోలింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు. కుప్వారా, హంద్వారా మునిసిపల్ కమిటీ ఎన్నికల్లో వరుసగా 36.6 శాతం, 27.8శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.