పుణ్యక్షేత్రాలు.. పర్యాటక కేంద్రాలు
- విహారయాత్రలో స్థానిక ప్రతినిధులు
- అన్ని పార్టీలదీ క్యాంప్‌ల బాటే
కరీంనగర్ సిటీ : పరోక్ష ఎన్నికలకు మరో మూడురోజులు గడువుండటంతో స్థానిక ప్రతినిధులంతా క్యాంప్‌ల బాటపట్టారు. చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి, తమ మద్దతుదారులను కాపాడుకోవడానికి శిబిరాలకు తరలివెళ్లారు. మెజారిటీ మండలాల నుంచి ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆది, సోమవారాల్లో క్యాంప్‌లకు పయనమయ్యారు. సిరిసిల్ల మినహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మెజారిటీ మండలాల, కార్పొరేషన్ల నుంచి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు క్యాంప్‌లకు వెళ్లారు.
చైర్మన్ అభ్యర్థులు, ఆశావాహులు స్వకార్యం, స్వామి కార్యం సిద్ధిస్తుందని పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్లు తమ క్యాంప్‌లను కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ ఉత్తర భారతంలో ఉండగా, టీఆర్ఎస్ తమ కార్పొరేటర్లను షిర్డీ దర్శనానికి తీసుకెళ్లింది. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లను హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్ హైదరాబాద్‌లో వేర్వేరుగా క్యాంప్ వేశాయి.
మెట్పల్లి చైర్మన్ పీఠాన్ని దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ తమ కౌన్సిలర్లను షిర్డీకి తీసుకెళ్లగా, కాంగ్రెస్ హైదరాబాద్‌లో మకాం వేసింది. వేములవాడ నగరపంచాయతీపై కన్నేసిన బీజేపీ తన సభ్యులతో పాటు మద్దతిస్తున్న కౌన్సిలర్లతో హైదరాబాద్‌లో క్యాంప్ నిర్వహిస్తోంది. పెద్దపల్లి నగరపంచాయతీకి సంబంధించి టీఆర్ఎస్, కాంగ్రెస్ హైదరాబాద్‌లో వేర్వేరు క్యాంపులు కొనసాగిస్తున్నాయి. జమ్మికుంట నగరపంచాయతీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకొనేందుకు టీఆర్ఎస్ తన కౌన్సిలర్లతో హైదరాబాద్‌లో మకాం వేసింది.
హుజూరాబాద్ నగరపంచాయతీ కౌన్సిలర్లతో టీఆర్ఎస్ యనాం చేరుకుంది. జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ సీట్లు రావడం, స్థానిక ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి సమీప బంధువు చైర్పర్సన్ కానుండటంతో అక్కడ క్యాంప్ జాడ లేదు. అయితే జగిత్యాల ఎంపీపీ కోసం కాంగ్రెస్ ఎంపీటీసీలంతా సోమవారం క్యాంప్‌నకు ప్రయాణమయ్యారు.
ఈ క్యాంపులో మహిళా ఎంపీటీసీల స్థానంలో వారి భర్తలు షిర్డీకి తరలివెళ్లడం విశేషం. హుజూరాబాద్, రాయికల్ , కాల్వశ్రీరాంపూర్ ఎంపీటీసీలు వైజాగ్‌లో ఉండగా, జూలపల్లి, ధర్మపురి ఎంపీటీసీలు తిరుపతిలో మకాం వేశారు. కమాన్‌పూర్ ఎంపీటీసీలు ఊటీ, బెంగుళూరులో పర్యటిస్తున్నారు. మిగిలిన మండలాలకు చెందిన ఎంపీటీసీలు ఎక్కువగా హైదరాబాద్‌లో క్యాంప్‌లు వేయగా, మరికొంతమంది కరీంనగర్‌లోని వివిధ లాడ్జీల్లో మకాం వేశారు.
క్యాంప్‌నకు దూరంగా సిరిసిల్ల
సిరిసిల్ల నియోజకవర్గం క్యాంప్‌లకు దూరంగా ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్థానికంగా ప్రాతినిథ్యం వహిస్తుండడమే కారణ ం. నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించిన ఆయన పరోక్ష ఎన్నికను తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు. ఆయన మాటే వేదం కావడంతో ఇక్కడి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు క్యాంప్ ఊసెత్తడం లేదు. ఎన్నికకు ముందు కేటీఆర్ ఎవరి పేరు చెబితే వారు మున్సిపల్ చైర్మన్, ఎంపీపీలు కానున్నారు.
జెడ్పీటీసీలతో టీఆర్ఎస్ క్యాంప్?
జిల్లా పరిషత్‌లో సంపూర్ణ మెజారిటీ సాధించినప్పటికీ జెడ్పీటీసీలతో క్యాంప్ వేయాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. 57 జెడ్పీటీసీలకు 41 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ చైర్‌పర్సన్‌తో పాటు అన్ని పదవులు సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. 5న ఎన్నిక జరగనుండగా, కనీసం రెండు, మూడు రోజులైనా క్యాంప్ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
సోమవారం తిమ్మాపూర్‌లోని ఎల్ఎండీ అతిథిగృహంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పార్టీ నేతలు తుల ఉమ తదితరులతో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. చర్చల్లో క్యాంప్‌నకు తీసుకెళ్లేందుకే మొగ్గుచూపినట్లు తెలిసింది. ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులపై కూడా చర్చించారు. ఇద్దరిలో ఒకరిని జగిత్యాల నుంచి ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు వచ్చినట్లు సమాచారం. జగిత్యాలలో పార్టీ ప్రాతినిథ్యం లేనందున కో-ఆప్షన్ అయినా ఇవ్వాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.