ఇక యప్ టీవీ సీరియల్స్...
సొంతంగా షూటింగ్; ఇప్పటికే 10 ఎపిసోడ్లు పూర్తి
♦ త్వరలో ఓ స్పోర్ట్స్, తెలుగు చానల్‌తో ఒప్పందాలు
♦ దీంతో ఆ చానల్స్ కార్యక్రమాలు యప్ టీవీకే పరిమితం!
♦ నెలకు రూ.99కే 250 చానల్స్ ప్రసారం; వీక్షకులు 50 లక్షలకు పైనే
♦ ఇప్పటికే రూ.680 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
♦ ‘సాక్షి’తో యప్ టీవీ ఫౌండర్, సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యప్ టీవీ అంటే!! ప్రాంతీయ టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకొని.. ఆయా కార్యక్రమాలను విదేశాల్లో ప్రసారం చేసే ఆన్లైన్ వేదికగా అభివర్ణిస్తారు. కానీ ఇపుడా యప్ టీవీ సొంతంగా సీరియల్స్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే 10 ఎపిసోడ్స్ నిర్మాణమూ పూర్తయింది. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కూడా! ‘‘అంతేకాదు!! తొలిసారిగా ఓ స్పోర్ట్స్ చానెల్, ఓ తెలుగు చానెల్‌తో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం చేసుకుంటున్నాం. దీంతో వాటి కార్యక్రమాలు యప్ టీవీలో మాత్రమే ప్రసారమవుతాయి’’ అంటూ తమ విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణ గురించి యప్ టీవీ ఫౌండర్ సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే...
యప్కు బీజం ఇలా..: నోర్టెల్ నెట్వర్క్స్, సిమెన్స్ వంటి టెలికం కంపెనీల్లో దశాబ్ద కాలంపైనే పనిచేశా. టెలికం బూమ్‌తో విధుల నిమిత్తం చాలా దేశాలు తిరిగా. ఎక్కడికెళ్లినా నాకెదురైన ప్రధాన సమస్య.. అక్కడి టీవీల్లో మన భాషలోని చానెల్స్ రాకపోవటమే! టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందాక కూడా ఇదేంటని అనిపించేది. అదే యప్ టీవీ పునాదికి బీజం వేసింది. సాంకేతికత అభివృద్ధి, దక్షిణాది చానెల్స్‌తో ఒప్పందాలు, మార్కెటింగ్ కోసం మూడేళ్లు శ్రమించి రూ.2 కోట్ల పెట్టుబడితో జార్జియా ప్రధాన కేంద్రంగా 2006లో యప్ టీవీని ఆరంభించాం. ఒక్క మాటలో... స్థానిక భాషల్లోని టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకొని వాటి కంటెంట్‌ను ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా, ఎక్కడైనా, ఏ డివైజ్‌లోనైనా చూసుకునేదే యప్ టీవీ.
250 చానెల్స్; 25 వేల గంటల కంటెంట్..: ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాల్లోని 250 టీవీ చానల్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. వీటిలో 102 వినోద చానెల్స్, 16 సినిమా, 30 మ్యూజిక్, 85 న్యూస్, 40 ఆధ్యాత్మిక చానెళ్లున్నాయి. వాటి కార్యక్రమాలు లైవ్ లేక రికార్డింగ్వి యప్ టీవీలో చూసుకోవచ్చు. ప్రస్తుతం మా టీవీలో 25 వేల గంటల నిడివి గల వీడియో కంటెంట్ ఉంది. సినిమాల కోసం యప్ ఫ్లిక్స్, షార్ట్ ఫిల్మ్సŠ, వెబ్ సీరియల్స్ కోసం యప్ బజార్ ఉన్నాయి.
నెలకు రూ.99; వీక్షకులు 50 లక్షలకు పైనే
ప్రస్తుతం ట్యాబ్లెట్స్, పీసీ, స్మార్ట్‌ఫోన్స్ ఇలా 27 రకాల డివైజ్‌ల ద్వారా... అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, మలేషియా, న్యూజిలాండ్, కరేబియన్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన 50 లక్షల మంది యప్ టీవీని చూస్తున్నారు. నెలకు చందా ధర రూ.99. అమెరికాలో అయితే నెలకు 20 డాలర్లు. ఇందులో 65–70 శాతాన్ని చానల్స్‌కు చెల్లిస్తాం. మిగిలింది మా ఆదాయం. ప్రస్తుతం 80 లక్షల యప్ టీవీ యాప్స్ డౌన్లోడ్ అయ్యాయి.
రూ.680 కోట్ల నిధుల సమీకరణ పూర్తి...
2017 ముగింపు నాటికి రూ.350 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యస్తున్నాం. ఇప్పటికే సగానికి పైగా చేరుకున్నాం. ఇప్పటివరకు 2 రౌండ్లలో రూ.680 కోట్లు సమీకరించాం. గత అక్టోబర్‌లో అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ ఎమరాల్డ్ 50 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇటీవల అమెరికన్ రిలైబుల్ ఐపీటీవీని సబ్స్క్రిప్షన్ విధానంలో కొన్నాం. అవకాశముంటే విదేశాల్లోని చానల్స్‌నూ కొనుగోలు చేస్తాం.
ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు..
హైదరాబాద్‌లో స్థానిక నటులతో ఒక సీరియల్ తీస్తున్నాం. ఇప్పటికే 10 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో... తర్వాత మరాఠీ, బెంగాలీలో ప్రసారం చేస్తాం. 2017 ముగింపు నాటికి 20–25 ప్రోగ్రామ్స్‌ను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలో ఒక స్పోర్ట్స్ చానల్, తెలుగు చానల్‌తో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు చేసుకుంటాం. దీంతో వాటి కార్యక్రమాలు యప్ టీవీలో మాత్రమే ప్రసారమవుతాయి. ఈ అవకాశం ముందుగా అమెరికా సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే ఇస్తాం.