పద్దు..పల్టీ !
నగర పాలకసంస్థ బడ్జెట్ లెక్కల్లో భారీ వ్యత్యాసాలు
ప్రింటింగ్ పొరపాట్లు అంటూ దిద్దు‘బాట’ చర్యలు
6న మరోసారి స్టాండింగ్ కమిటీ ముందుకు...
మందీమార్బలం, హంగు ఆర్భాటం అన్నీ ఉన్నా నగర పాలక సంస్థ బడ్జెట్‌ను రూపొందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. 2017–18 బడ్జెట్‌కు గత నెలలో స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ఊపింది. కౌన్సిల్ ముందుకు వస్తుందనుకున్న తరుణంలో లెక్క తప్పింది, సరిదిద్దేందుకు మరోసారి స్టాండింగ్ కమిటీ భేటీ అవుతోందని మేయర్ కోనేరు శ్రీధర్ పేర్కొన్నారు.
విజయవాడ సెంట్రల్ : నగర పాలకసంస్థ బడ్జెట్ పద్దు పల్టీ కొట్టింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.1,306 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు బడ్జెట్ పుస్తకాలు అచ్చు వేసి ముందుగా టీడీపీ కార్పొరేటర్లకు అందించారు. ప్రతిపద్దులో లొసుగులు తొంగిచూశాయి. ‘ఇన్ని తప్పులతో కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశ పెడితే ప్రతిపక్షాలు విరుచుకుపడతాయి. ముందు సరిదిద్దండి’ అంటూ సొంతపార్టీ కార్పొరేటర్లే హితబోధ చేయడంతో మేయర్ పునరాలోచనలో పడ్డారు. ప్రైవేటు ఆడిటర్‌ను పిలిపించి సరిచేయించినట్లు భోగట్టా. అక్టోబర్ మొదటి వారం నుంచి కసరత్తు చేస్తున్న పాలకులు బడ్జెట్ లెక్కతేల్చడంలో విఫలమై విమర్శలపాలయ్యారు.
లెక్కతప్పింది...: నగరపాలక సంస్థ ఆదాయం, ఖర్చుల్లో స్టాంపుడ్యూటీ, లైటింగ్ పన్నులు, సర్వీస్ చార్జీలు, నీటిపన్ను, లైబ్రరీ సెస్, షాపుల గుడ్‌విల్, పబ్లిక్ టాయ్‌లెట్స్, డీఅండ్‌ఓ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, సీఎంఈవై, డ్వాక్వా పవర్చార్జెస్, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్‌స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల తరలింపు చార్జీలు, రోడ్ల వెడల్పు, స్ట్రక్చరల్ కాంపెన్సేషన్, లబ్ధిదారుల వాటా, కంప్యూటర్ సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్, హార్డ్‌వేర్ పరికరాల కొనుగోలు, టౌన్‌ప్లానింగ్ మెషినరీ, లేబర్, ఎస్సీ, ఎస్టీ పేదల బస్తీల్లో రోడ్ల నిర్మాణం, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్మాణం, నీటి సరఫరా మెరుగుపర్చుట, భవనాల నిర్మాణం, వీఎంసీ స్కూళ్ళలో ఫర్నీచర్ కొనుగోలు, రాజీవ్‌గాంధీ పార్కులో పక్షులు, జంతువుల పెంపకం, మూడు సర్కిళ్ల పరిధిలో సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి సంబంధించిన పద్దుల్లో తేడాలు వచ్చాయి. ప్రారంభ, అంత్య నిల్వలు మారిపోయాయి. వీటిని పరిశీలించకుండానే స్టాండింగ్ కమిటీ ఓకే చేసేసింది. లొసుగులు బయటపడటంతో ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. తిరిగి ఈనెల 6వ తేదీన స్టాండింగ్ కమిటీ ప్రత్యేక (బడ్జెట్) సమావేశాన్ని మేయర్ ఏర్పాటు చేశారు.
అంతా ఆయన వల్లే...: అకౌంట్స్ విభాగంలో ముఖ్య అధికారి వైఖరి వల్లే బడ్జెట్లో గందరగోళం నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిందిస్థాయి అధికారులు బడ్జెట్ రూపొందించే సమయం లోనే పొరపాట్లను ఎత్తిచూపగా, ‘ నాకు తెలుసులే అమ్మా, నేను చెప్పినట్లు చేయండి’ అంటూ ఆ అధికారి గద్దించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్‌లో లెక్క తప్పడంతో పాలకుల పరువుపోయింది. ప్రింటింగ్‌లో పొరపాట్లు అంటూ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఆ అధికారిని సాధ్యమైనంత త్వరలోనే ఇక్కడ నుంచి సాగనంపండి అంటూ మేయర్ సూచించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఆడిటర్ వచ్చి చేస్తే కానీ బడ్జెట్ ఓ కొలిక్కిరాలేదంటే అధికారులు ఎంతబాగా పనిచేస్తున్నారో అర్థమవుతోంది. స్టాండింగ్ కమిటీ వర్సెస్ మేయర్ మధ్య కోల్డ్‌వార్ నడు స్తోంది. ఈ క్రమంలో ఏర్పాటవుతున్న ప్రత్యేక సమావేశం ఆసక్తికరంగా మారనుంది.