సీఎం నగర పర్యటన గంటన్నరే...
కార్యక్రమాలన్నీ స్టేడియంలోనే
జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ వ్యక్తిగత ఈవెంట్లు ప్రారంభం
ఐరిస్ పెలైట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం
మృతిచెందిన కూలీల కుటుంబాలకు ఆర్థిక సాయం
విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగర పర్యటన దాదాపు గంటన్నరపాటు సాగింది. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాలను పర్యటన ప్రధాన వేదిక అయిన ఇండోర్ స్టేడియంలోనే పూర్తిచేశారు. తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన సోమవారం సాయంత్రం 4.30కి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కె.అచ్చెన్నాయుడు, రావెల కిషోర్‌బాబు వచ్చారు. శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్ తదితరులు ముఖ్యమంత్రికి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం సీఎం రోడ్డుమార్గాన బయలుదేరి సాయంత్రం 5.05 గంటలకు బందరురోడ్డులోని దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు.
ఎయిర్కోస్టా 79వ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత ఈవెంట్లను ప్రారంభించారు. స్టేడియంలో జరిగిన సభలో 30నిమిషాలు మాట్లాడారు. ఆ తర్వాత వృద్ధాప్య పింఛన్ల పంపిణీకి వీలుగా అర్హులకు ఐరీస్ తీసేందుకు ఏర్పాటుచేసిన పెలైట్ ప్రాజెక్టును స్టేడియంలోనే ప్రారంభించారు. విద్యాధరపురం కొండప్రాంతంలో ఆదివారం భవనం శ్లాబ్ కూలి మృతిచెందిన ఇద్దరు కూలీల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సీఎం చంద్రబాబు దండమూడి స్టేడియంలో అందజేశారు. సాయంత్రం 6.10కి గుంటూరు జిల్లా మంగళగిరి బయలుదేరి వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రి 9.25కి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు.