LOCKED HOUSES TARGET
-
తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్
సాక్షి, కాజీపేట : వరంగల్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళల ముఠా, జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సీపీ డాక్టర్ రవీందర్ వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌కు చెందిన గాజుల యోగేందర్ అలియాస్ యుగెందర్ అలియాస్ యోగి, కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని బుడిగజంగాల కాలనీకి చెందిన నూనె కిష్టమ్మ, శ్రీపాతి లింగమ్మలను అదుపులోకి తీసుకుని, రూ.18లక్షల విలువైన 361 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి, నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, నాలుగు వీడియో కెమెరాలు, ఒక ఐప్యాడ్, రెండు ఐఫోన్లు, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలపారు. జల్సాలకు అలవాటు పడి చోరీలు.... రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన యోగెందర్ కలర్ పేయింట్ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. చెడు వ్యసనాలకు బానిసై, సంపాదిస్తున్న డబ్బు జల్సాలకు సరిపోకపోవడంతో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడని కమిషనర్ తెలిపారు. 2012 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా తిరుమలగిరి, అళ్వాల్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. బయటికి వచ్చాక తన పద్ధతి మార్చుకోకుండా నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు. అనంతరం వరంగల్‌కు మార్చిన యోగేందర్ చోరీలు చేస్తుండేవాడు. కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు, సుబేదారి, మిల్స్‌కాలనీ, ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కోక్క చోరీలకు పాల్పడ్డాడు. ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ డీ.శ్రీధర్ ఆదేశాల మేరకు గురువారం ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో వరంగల్ రై ల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా తారసపడిన యోగేందర్‌ను విచారించగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి రూ.13.79లక్షల విలువైన 241 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి, 4 ల్యా ప్‌ట్యాప్‌లు, 4 వీడియో కెమెరాలు, ఒక ఐప్యాడ్, రెండు ఐఫోన్లు, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకుని, నిందితుడి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రెండు సంఘటనల్లో నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డీసీపీ కేఆర్.నాగరాజు, వరంగల్, కాజీపేట, ఏసీపీలు నర్సయ్య, నర్సింగరావు,పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు. -
ఇది ఉందంటే దొంగతనాలు జరగవు!
ఈ మధ్య ఊరెళ్లాలంటేనే హడలెత్తుతున్నారు ప్రజలు. దొంగల బెడద అలా ఉంది మరి.. కానీ నిశ్చింతగా ఊరెళ్లండంటూ పోలీసులు అభయమిస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసే ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో దొంగతనాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు. సాక్షి, అద్దంకి రూరల్ : తాళం వేసి ఉన్న ఇంటిలో జరిగే దొంగతనాలు చేసే దొంగలకు ఎల్‌హెచ్‌ఎంఎస్( లాక్హౌస్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా చెక్ పెట్టవచ్చని సీఐ హైమారావు అన్నారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయని వాటిని నిరోధించటానికి ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. ఎవరైనా ఒకటి రెండు రోజుల ఊరువిడిచి వెళ్లాల్సి వచ్చినా పోలీస్ వారికి తెలియచేస్తే ఆ ఇంటిలో ఎల్‌హెచ్‌ఎంఎస్ ఎర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సిస్టమ్ ద్వారా ఇంటిలో ఒక మూలన రహస్య కెమెరాను అమర్చుతారన్నారు. ఆ కెమెరా ఇంటిలోకి దొంగ ప్రవేశించగానే ఆటోమాటిక్‌గా పనిచేయటం ప్రారంభించి సంబంధిత పోలీస్ స్టేషన్లో అలారం మోగుతుందని వివరించారు. దీంతో ఇంటిలోకి దొంగ ప్రవేశించిన 5 నిమిషాల లోపే పట్టుకునే అవకాశం ఉటుందన్నారు. ఈ సిస్టమ్‌ను ప్రజలు వినియోగించుకుని దొంగతనాల బారి నుంచి తప్పించుకొవచ్చన్నారు. ప్రజలు సామాజిక బాధ్యతగా భావించి ఈ పద్ధతి అనుసరించాలని కోరారు. పెరిగిన గస్తీ... పట్టణంలో దొంగతనాలను అరికట్టటానికి గస్తీని పెంచుతున్నట్లు సీఐ తెలిపారు. పట్టణాన్ని 8 బీట్ ప్రాంతాలుగా విభజించి గస్తీలను ముమ్మరం చేస్తామన్నారు. ఇంటిలోపల లైట్లు వెలిగి ఉండి బయట తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, యజమానుల పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. పట్టణంలో పనిచేయని సీసీ కెమెరాలను గుర్తించి బాగు చేయిస్తామని చెప్పారు. ఇటీవలే చోటుచేసుకున్న దొంగతనాలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎస్సై సుబ్బరాజు పాల్గొన్నారు. -
అదును చూసి దోచేస్తున్నారు
భీమడోలు/ ఏలూరు అర్బన్/పెంటపాడు : దొంగలు చెలరేగిపోతున్నారు. అదును చూసి ఉన్నదంతా దోచుకుపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా తెగబడుతున్నారు. గురువారం రాత్రి జిల్లాలో భీమడోలు మండలం పూళ్ల గ్రామం, ఏలూరు బీడీ కాలనీలో చోరీలు జరగ్గా, శుక్రవారం పట్టపగలే పెంటపాడులో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. పూళ్లలో తాళాలు పగులకొట్టి.. భీమడోలు: భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని ఆరు కాసుల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, రూ.50 వేల నగదును ఆపహరించుకుపోయారు. భీమడోలు హెడ్‌కానిస్టేబుల్ షేక్ అమీర్ కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పూళ్ల గ్రామానికి చెందిన యిర్రింకి సీతారామ్ కుటుంబసభ్యులు వారి బంధువుల ఇంట్లో వివాహానికి గురువారం రాత్రి తాడేపల్లిగూడెం వెళ్లారు. శుక్రవారం ఉదయం 5 గంట లకు తిరిగి ఇంటికి రాగా తలుపు తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులకొట్టి వస్తువులు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. రెండు ఉంగరాలు, చెవి దిద్దులు, జత మ్యాటీలు జత తదితర బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, రూ.50 వేల నగదు చోరీ జరిగినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెంటపాడులో పట్టపగలే.. పెంటపాడు : పెంటపాడులో పట్టపగలే చోరీ జరిగింది. రూ.35 వేల నగదు, బంగారు, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. పెంటపాడు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం.. పెంటపాడు వెలంపేటలోని కర్రివారివీధిలో ఆకుల రమాదేవి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త తాతారావు సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే వీరు ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తలుపు పగులకొట్టి ఉంది. బీరువాలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సుమారు రెండు కాసుల విలువైన బంగారు ఆభరణాలు, వెండి పట్టాలు, కొంత నగదు చోరీ జరిగినట్టు పోలీసులకు సమాచారం అందించారు. హెచ్‌సీ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరులో ఏడు కాసులు, నగదు ఏలూరు అర్బన్: తాళాలు పగులగొట్టి ఇంట్లో ప్రవేశించిన దొంగలు బంగారు ఆభరణాలు అపహరించుకుపోవడంతో బాధితుని ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం కె.కన్నాపురంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బత్తుల రాజు తల్లి వెంకటరమణతో కలిసి ఏలూరుS బీడీ కాలనీలో నివాసముంటున్నారు. రాజు తన తల్లితో కలిసి ఈ నెల 13న హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో వారి ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి ఉండటం గమనించిన పొరుగింటి వారు రాజుకు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఇక్కడకు చేరుకున్న రాజు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్టు గుర్తించారు. బీరువాలోని ఏడు కాసుల బంగారు నగలు, నగదు మాయమయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.