విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ హైమారావు, ఎస్సై
ఈ మధ్య ఊరెళ్లాలంటేనే హడలెత్తుతున్నారు ప్రజలు. దొంగల బెడద అలా ఉంది మరి.. కానీ నిశ్చింతగా ఊరెళ్లండంటూ పోలీసులు అభయమిస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసే ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో దొంగతనాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు.
సాక్షి, అద్దంకి రూరల్ : తాళం వేసి ఉన్న ఇంటిలో జరిగే దొంగతనాలు చేసే దొంగలకు ఎల్‌హెచ్‌ఎంఎస్( లాక్‌హౌస్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా చెక్ పెట్టవచ్చని సీఐ హైమారావు అన్నారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయని వాటిని నిరోధించటానికి ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. ఎవరైనా ఒకటి రెండు రోజుల ఊరువిడిచి వెళ్లాల్సి వచ్చినా పోలీస్ వారికి తెలియచేస్తే ఆ ఇంటిలో ఎల్‌హెచ్‌ఎంఎస్ ఎర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సిస్టమ్ ద్వారా ఇంటిలో ఒక మూలన రహస్య కెమెరాను అమర్చుతారన్నారు. ఆ కెమెరా ఇంటిలోకి దొంగ ప్రవేశించగానే ఆటోమాటిక్‌గా పనిచేయటం ప్రారంభించి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో అలారం మోగుతుందని వివరించారు. దీంతో ఇంటిలోకి దొంగ ప్రవేశించిన 5 నిమిషాల లోపే పట్టుకునే అవకాశం ఉటుందన్నారు. ఈ సిస్టమ్‌ను ప్రజలు వినియోగించుకుని దొంగతనాల బారి నుంచి తప్పించుకొవచ్చన్నారు. ప్రజలు సామాజిక బాధ్యతగా భావించి ఈ పద్ధతి అనుసరించాలని కోరారు.
పెరిగిన గస్తీ...
పట్టణంలో దొంగతనాలను అరికట్టటానికి గస్తీని పెంచుతున్నట్లు సీఐ తెలిపారు. పట్టణాన్ని 8 బీట్ ప్రాంతాలుగా విభజించి గస్తీలను ముమ్మరం చేస్తామన్నారు. ఇంటిలోపల లైట్లు వెలిగి ఉండి బయట తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, యజమానుల పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. పట్టణంలో పనిచేయని సీసీ కెమెరాలను గుర్తించి బాగు చేయిస్తామని చెప్పారు. ఇటీవలే చోటుచేసుకున్న దొంగతనాలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎస్సై సుబ్బరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment