తస్మాత్...‘లాకీ’ ముప్పు
న్యూఢిల్లీ: కొత్త మాల్వేర్ ‘లాకీ రాన్సమ్వేర్’ వ్యాప్తిపై కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. ఇది కంప్యూటర్లలోకి చొరబడి, డబ్బు ఇస్తేనే సమాచారాన్ని విడుదల చేస్తామని డిమాండ్ చేస్తోందని పేర్కొంది. లాకీ రాన్సమ్వేర్ రూ.1.5 లక్షలకు సమానమైన హాఫ్ బిట్‌కాయిన్‌ను కోరుతున్నట్లు తెలిసింది. ‘సైబర్ స్వచ్ఛ కేంద్ర’లో జారీచేసిన ఈ అలర్ట్‌లో...లాకీ రాన్సమ్వేర్ను విస్తరించడానికి ఉమ్మడి సబ్జెక్టుతో పలు స్పామ్ మెయిల్స్ వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈమేరకు ఇదివరకే సుమారు 2 కోట్ల సందేశాలను పంపినట్లు వార్తలొచ్చాయని, ‘ప్లీజ్ ప్రింట్’, ‘డాక్యుమెంట్స్’, ‘ఫొటో’, ‘ఇమేజెస్’, ‘స్కాన్స్’, ‘పిక్చర్స్’ లాంటి సబ్జెక్టులతో అవి ఉన్నాయని అలర్ట్ తెలిపింది. ఈ రాన్సమ్వేర్ తీవ్రత అధికంగానే ఉండొచ్చని హెచ్చరించింది. లాకీ వేరియంట్లను విస్తరించడానికి నకిలీ డ్రాప్‌బాక్స్ లింకులతో కూడిన స్పామ్ సందేశాలను వినియోగిస్తున్నారని పేర్కొంది. ఈ–మెయిల్స్ తెరిచేటపుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, సంస్థలు యాంటీ స్పామ్ పరిష్కారాలను సమకూర్చుకోవాలని సూచించింది.