కరెన్సీని శానిటైజ్ చేసేలా..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): వాల్తేరు డీజిల్ లోకో షెడ్ అల్ట్రా వైలట్ రేడియేషన్‌తో కూడిన డిసిన్ఫెక్షన్ కరెన్సీ శానిటైజర్లను రూపొందించింది. రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్ కార్యాలయాల వద్ద రైల్వే నిత్యం నగదు కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడం, రసీదులు, టికెట్లు, ఫైళ్లను నిత్యం అనేకమంది తాకుతూ ఉన్న సమయంలో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నందున డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ నాయకత్వంలో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ (డీజిల్) సంతోష్ కుమార్ పాత్రో సహకారంతో డీజిల్ లోకో షెడ్ సిబ్బంది ఈ కరెన్సీ శానిటైజర్లను తయారు చేశారు. ఈ పరికరంలో జర్మి సైడల్ యూవీసీ బల్బస్ 99.9శాతం క్రిములను, వైరస్‌లను, బాక్టీరియాలను హరింపచేస్తాయని సిబ్బంది తెలిపారు.
మిషన్ వినియోగమిలా..
ప్రయాణికులు కౌంటర్లో రిక్వెస్ట్ స్లిప్‌లు, నగదు వంటివి ఈ శానిటైజర్ ట్రేలో వేస్తారు. అది స్కాన్ చేసిన తరువాత కౌంటర్లో సిబ్బంది దీనిని తీసుకుంటారు. అలాగే ప్రయాణికులకు అందజేయవలసిన టికెట్లు, రసీదులు కూడా ఈ ట్రేల ద్వారా ప్రయాణికులకు అందజేస్తారు. వీటి పనితీరు పరిశీలించిన ఈస్ట్‌కోస్ట్ రైల్వే సంతృప్తి వ్యక్తం చేసి, సిబ్బందిని అభినందించింది. తమ పరిధిలోని అన్ని కౌంటర్లకు అవసరమైన 150 కరెన్సీ శానిటైజర్లను తయారుచేయవలసిందిగా సూచించింది. ప్రస్తుతం 24 యూనిట్లను అందించగా, మిగిలిన వాటిని జూలై 10వ తేదీకి అందజేయనున్నట్లు డీఎల్ఎస్ సిబ్బంది తెలిపారు.