అటవీ సిబ్బందిపై డీఎఫ్‌వో ఆగ్రహం
బెల్లంకొండ: అటవీ హక్కుల చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అటవీశాఖ అధికారి లోహితాస్యుడు హెచ్చరించారు. మన్నెసుల్తాన్‌పాలెం పంచాయతీ శివారు రామాంజనేయపురంలో బోరు బావులు తవ్వించిన వారిపై మంగళవారం స్థానిక బీటు అధికారులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశారు. దీనిపై దీనిపై విచారణకు డీఎఫ్‌వో లోహితాస్యుడు బుధవారం రామాంజనేయపురానికి వచ్చారు.
ఈనెల 12, 13 తేదీల్లో రాత్రి సమయాల్లో తొమ్మిది బోరు బావులు తవ్వించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అటవీ భూములపై, బోర్ల తవ్వకాలపై దినపత్రికల్లో కథనాలు ప్రచురితమవడంతో ఆయన స్పందించారు. దీనిపై పూర్తి సమాచారం సేకరించాలని సిబ్బందిని ఆదేశించినట్లు డీఎఫ్‌వో చెప్పారు. రామాంజనేయపురంలోని బోరు బావులను డీఎఫ్‌వో పరిశీలించారు. వాటి నుంచి పొలాల్లోకి వేసిన పైపులైను నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
అటవీ భూముల్లో బోర్ల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటుపై ఆయన స్థానిక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ప్రమేయంతోనే జరిగిందని, వారిని ఆరా తీయగా బోర్లు వేయడంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని స్థానిక బీటు అధికారులు తెలిపారు. అటవీ చట్టం ప్రకారం అటవీ శాఖ ఆధీనంలో మొదట కేసులు నమోదు చేయాలని, పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంపై డీఆర్వో మహబూబ్‌పై మండిపడ్డారు. పైపులైన్‌ను తొలగించి పైపులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై రుజువులతో సహా ఆధారాలు సేకరించినట్లు డీఎఫ్‌వో వెల్లడించారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముందు డీఎఫ్‌వో పాపాయపాలెం గ్రామం వద్దకు రాగానే గ్రామస్తులు తాము అటవీ భూముల్లో పండించుకుంటున్న పంటలను నాశనంచేసి ప్లాంటేషన్‌కు ఏర్పాట్లు చేశారని మొక్కదశలో పంటలను నాశనం చేయడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు.
ప్లాంటేషన్ విషయంలో స్థానిక సిబ్బంది రాజకీయనాయకుల అండదండలతో కొంతమంది రైతుల పొలాలనే ధ్వంసం చేశారని, మిగిలిన వారి పొలాల జోలికి వెళ్లలేదని డీఎఫ్‌వో దృష్టికి తెచ్చారు. సిబ్బంది తమ వద్ద రూ. 30 వేల వరకు డబ్బులు తీసుకున్నట్లు లిఖితపూర్వకంగా అర్జీని సమర్పించి, తమను తీవ్రంగా నష్టపరిచారని తగు న్యాయం చేయాలని డీఎఫ్‌వోను వేడుకున్నారు.
డీఎఫ్‌వో మాట్లాడుతూ అటవీ భూముల్లో ప్రతి భూమిలో వన సంరక్షణ సమితికి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. దీనిపై పూర్తి సమాచారాన్ని సేకరించి చర్యలు తీసుకుంటామన్నారు. డీఎఫ్‌వో వెంట రేంజ్ అధికారి జ్ఞానప్రకాశరావు, సిబ్బంది ఉన్నారు.