దిక్కుమాలిన రాజకీయాలొద్దు: జేపీ
విజయవాడ బ్యూరో: ‘‘ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి ఎలా కొనొచ్చు.. అధికార పార్టీలోకి ఫిరాయింపులు ఎలా జరిపించవచ్చు.. అనే దిక్కుమాలిన రాజకీయాల్లో మన నేతలు పీహెచ్డీలు చేసినంత ప్రతిభను ప్రదర్శిస్తున్నారు’’ అంటూ పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబును లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు.
ఇలాంటి రాజకీయాలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ఒబామాకు పాఠాలు నేర్పింది కూడా మేమే అని చెప్పుకోవడానికి వీరు సిగ్గుపడటం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నమోదైన ‘ఓటుకు కోట్లు’ కేసుపై, ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్లకు రాసిన లేఖ ప్రతులను ఆయన శనివారం విజయవాడలో మీడియాకు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీక్షణం చైనా, సింగపూర్ల గురించి మాట్లాడే చంద్రబాబు విద్యలో ఆ దేశాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ పరస్పర నిందారోపణలతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో ఎన్టీవీపై ఎంఎస్వోలతో అనధికార ఆంక్షలు అమలు చేస్తోందన్నారు. టేపుల ప్రసారంపై టీవీలకు నోటీసులు ఇవ్వడం మీడియా స్వేచ్ఛను హరించడమే అన్నారు.