Lokpal Bill passed by Parliament
-
లోక్‌పాల్ సాహకారం
ఉన్నతస్థాయిలో అవినీతిని అరికట్టేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఆమోదించటం ఈ ఏడాది సంభవించిన మరో కీలకమైన మార్పు. ప్రధానమంత్రిని సైతం లోక్‌పాల్ పరిధిలోకి తెస్తూ ఈ బిల్లును డిసెంబర్ 18న పార్లమెంటు ఆమోదించింది. ఇది ఇక రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టంగా మారటమే మిగిలివుంది. ఈ బిల్లు వెనుక సుదీర్ఘమైన చరిత్ర.. అంతకుమించి ఈ బిల్లు కోసం అన్నా హజారే చేపట్టిన బలమైన ఉద్యమం ఉన్నాయి. ఉన్నతస్థాయి అవినీతికి చెక్ పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని 1960 ల్లోనే కేంద్రంలో పెద్దలు భావించారు. తొలిసారి జన్‌లోక్‌పాల్ బిల్లును 1968లో శాంతిభూషణ్ ప్రతిపాదించారు. దీనిని 1969లో 4వ లోక్‌సభలో ఆమోదించారు. కానీ అప్పుడది రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఆ తర్వాత 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005, 2008 ల్లో లోక్‌పాల్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలంటూ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే 2011 ఏప్రిల్‌లో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో సూచనలు చేసేందుకు అన్నాహజారే సహా పలువురు ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేయటంతో హజారే 98 గంటల తర్వాత ఏప్రిల్ 11న దీక్ష విరమించారు. 2011 డిసెంబర్ 27న లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లును ఆమోదించారు. అయితే ఇది బలహీనంగా ఉందని, అందులో తాను కోరిన మార్పులు చేపట్టాలని హజారే అభ్యంతరం వ్యక్తం చేశారు. 2013 డిసెంబర్లో మళ్లీ దీక్షకు దిగారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 17న రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చ చేపట్టి.. అందులో పలు సవరణలు చేసి ఆమోదించారు. ఆ సవరణలకు హజారే సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 18న బిల్లును మళ్లీ లోక్‌సభకు పంపించి.. సవరణలతో సహా ఆమోదించారు. దీంతో లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పూర్తయింది. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు.. ఉన్నతస్థాయి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. వీరిపై వచ్చే ఫిర్యాదులను లోక్‌పాల్ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది. తాను పంపిన కేసుల్లో సీబీఐ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తుంది. లోక్‌పాల్ తరహాలోనే రాష్ట్రాల్లో కూడా లోకాయుక్తను ఏర్పాటు చేయాలని.. ఇందుకు ఏడాది గడువు ఉంటుందని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. ఎవరిపైన అయినా తప్పుడు ఆరోపణలు చేస్తే జరిమానా, జైలుశిక్షలు కూడా ఉంటాయి. -
అన్నా దీక్ష విరమణ
సాక్షి, ముంబై: లోక్‌సభలో కూడా లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందడంతో తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార దీక్షను విరమించారు. ముగ్గురు పాఠశాల విద్యార్థులు ఇచ్చిన కొబ్బరినీరు తాగి తొమ్మిది రోజుల దీక్షకు 76 ఏళ్ల కిసాన్ బాబూరావ్ హజారే బుధవారం స్వస్తి పలికారు. లోక్‌పాల్ కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆయన.. బిల్లును వ్యతిరేకించిన సమాజ్‌వాదీ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు, మూడు నెలల్లో ఈ బిల్లు చట్ట రూపం సంతరించుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేముందే లోక్‌పాల్‌కు కార్యరూపమివ్వాలని అన్నా కోరారు. ఈ చట్టంతో అవినీతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని భావించడంలేదని, కానీ, 40, 50 శాతం మేర తగ్గుతుందని అన్నారు. ప్రజలు లోక్‌పాల్ ఫలితాలను అనుభవిస్తారని భరోసా ఇచ్చారు. అయితే చట్టం వచ్చినంత మాత్రాన చేతులు దులిపేసుకోనని, ఆ చట్టం ఆచరణపై నిఘాకు రాష్ట్రాలు, జిల్లాల్లో పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. వీటిల్లో ఏ విధమైన అవినీతి మకిలి అంటని రిటైర్డ్ జడ్జిలు, రాష్ట్ర పోలీస్ అధికారులు ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీకి, బీజేపీ సభ్యులకు, ఇతర ఎంపీలకు, దీక్షాశిబిరం వద్ద తనకు భద్రత కల్పించిన పోలీసులకు, డాక్టర్లకు, పం దిర్లు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. బిల్లు మరింత పటిష్టంగా రూపొందించారంటూ రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. కేజ్రీవాల్ పేరెత్తకుండానే..: లోక్‌పాల్‌ను జోక్పాల్ అని విమర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పేరెత్తకుండానే ఆయనకు అన్నా చురకలంటించారు. టీవీ కెమెరాల ముందు మాట్లాడేవారి వల్ల సమాజానికి, దేశానికి ఏవిధమైన ప్రయోజనం ఉండదని పరోక్షంగా ఆప్ పార్టీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తాను కూడా అదే పనిచేస్తే ఈ విజయం సాధించి ఉండేవాడిని కాదన్నారు. తమకు అందిన చందాల వివరాలను ఇంటర్నెట్లో పొందపరచనున్నట్లు అన్నా వెల్లడించారు. అన్నా బృంద సభ్యురాలు కిరణ్ బేడీ మాట్లాడుతూ.. అవినీతి పరుల పాలిట లోక్‌పాల్ సుప్రీం కోర్టు లాంటిదన్నారు. సీబీఐ ఇకపై పంజరంలో చిలక కాదన్నారు. బిల్లు ఆమోదంతో శిబిరం వద్ద సంబరాలు చేసుకున్నారు. లోక్‌పాల్ కోసం అన్నా నిరాహార దీక్షలిలా.. తొలిసారి ఢిల్లీలో 2011 ఏప్రిల్ 5న ప్రారంభించి ఐదు రోజుల దీక్ష 2011 ఆగస్టులో చేసిన దీక్ష 13 రోజుల పాటు కొనసాగింది. అదే ఏడాది డిసెంబర్లో ముంబైలో రెండు రోజుల దీక్ష చేశారు. చివరిసారిగా ఈనెల 10న తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో దీక్ష చేపట్టి విజయం సాధించారు. ‘ప్రొరోగ్’ కాదు.. వాయిదానే! న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగకపోవచ్చు. అందుకు బదులుగా కొన్ని రోజుల తరువాత ప్రస్తుత సమావేశాలనే పునఃప్రారంభించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించే అవకాశాలున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ మంగళవారం సంకేతాలిచ్చా రు. ‘శీతాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయలేదు. కేవలం నిరవధిక వాయిదా వేశాం. ఈ సమావేశాలను ఎప్పుడైనా మళ్లీ ప్రారంభించవచ్చు’ అని విలేకరులతో అన్నారు. ఈ విషయంపై అన్ని పార్టీలతో చర్చలు జరిపి, అవినీతి వ్యతిరేక బిల్లులతో సహా అన్ని పెండింగ్ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించేలా యత్నిస్తామన్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశాలున్నాయి. రెండ్రోజుల ముందే: షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈనెల5న మొదలైన సమావేశాలు ఈనెల 20న ముగియాల్సి ఉండగా.. వివిధ అంశాలపై పలు పార్టీల ఆందోళనలతో ఎలాం టి నిర్మాణాత్మక చర్చలు జరపకుండానే రెండ్రోజుల ముందే ముగిశాయి. తెలంగాణ అనుకూల, వ్యతిరేక ఎంపీలు దాదాపు ప్రతీరోజు సభను అడ్డుకున్నారు. చివరి రెండ్రోజులైన మంగళ, బుధవారాల్లోనే సభ కాస్త ప్రశాంతంగా జరిగి, లోక్‌పాల్ సహా పలు బిల్లులు ఆమోదం పొందాయి. ప్రభుత్వంపై పెట్టిన 3 అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. వాటిలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 13 మంది సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన నోటీసు కూడా ఉంది. -
లోక్‌పాల్ బిల్లు ఆమోదంపై హజారే హర్షం
రాలేగావ్ : జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హర్షం వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదం పొందటం సంతోషకరమని ఆయన బుధవారమిక్కడ అన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లు హజారే అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్‌సిద్ధి గ్రామంలో గత మంగళవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాజ్యసభలో పాటు లోక్‌సభలోనూ బిల్లు ఆమోదం పొందటంతో హజారే తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా హజారే మాట్లాడుతూ గత రెండేళ్ల నుంచి బిల్లు ఆమోదానికి పోరాడుతున్నామన్నారు. ప్రజలు బలమైన లోక్‌పాల్ బిల్లును కోరుకుంటున్నారన్నారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి హజారే కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించటంతో హజారే మద్దతుదారులు దీక్షా శిబిరం వద్ద సంబరాలు జరుపుకున్నారు. గత 40 ఏళ్లగా పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించటంతో కేంద్రం... లోక్‌పాల్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. ఆయన ఆమోద ముద్ర అనంతరం బిల్లు చట్టం కానుంది. -
లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
-
లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన చరిత్రాత్మకమైన లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గందరగోళ పరిస్థితుల మధ్య లోక్‌పాల్ బిల్లును నేడు మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. లోక్‌పాల్ బిల్లుకు రాజ్యసభ నిన్న ఆమోదముద్ర వేసింది. సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలతో చేయడంతో లోక్‌సభ దద్దరిల్లింది. గందరగోళం కొనసాగుతుండగానే లోక్‌పాల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బీజేపీ బిల్లును సమర్థించింది. సమాజ్‌వాది పార్టీ బిల్లును వ్యతిరేకించింది. లోక్‌పాల్ బిల్లు ఆమోదించేందుకు కేంద్రం యేడాది సమయం తీసుకుందని బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ విమర్శించారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదంతో చరిత్ర నెలకొల్పబోతున్నామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఒక్క లోక్‌పాల్‌తో అవినీతి నిర్మూలన సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. లోక్‌పాల్‌పై కాంగ్రెస్, బీజేపీ తొందరపడుతున్నాయని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలవుతుందన్నారు. లోక్‌పాల్ బిల్లుకు నిరసనగా సభ నుంచి ఎస్పీ వాకౌట్ చేసింది. లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో అన్నా హజారే దీక్ష చేస్తున్న రాలెగావ్ సిద్ధిలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.