
అన్నా దీక్ష విరమణ
సాక్షి, ముంబై: లోక్‌సభలో కూడా లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందడంతో తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార దీక్షను విరమించారు. ముగ్గురు పాఠశాల విద్యార్థులు ఇచ్చిన కొబ్బరినీరు తాగి తొమ్మిది రోజుల దీక్షకు 76 ఏళ్ల కిసాన్ బాబూరావ్ హజారే బుధవారం స్వస్తి పలికారు. లోక్‌పాల్ కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆయన.. బిల్లును వ్యతిరేకించిన సమాజ్‌వాదీ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు, మూడు నెలల్లో ఈ బిల్లు చట్ట రూపం సంతరించుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేముందే లోక్‌పాల్‌కు కార్యరూపమివ్వాలని అన్నా కోరారు. ఈ చట్టంతో అవినీతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని భావించడంలేదని, కానీ, 40, 50 శాతం మేర తగ్గుతుందని అన్నారు.
ప్రజలు లోక్‌పాల్ ఫలితాలను అనుభవిస్తారని భరోసా ఇచ్చారు. అయితే చట్టం వచ్చినంత మాత్రాన చేతులు దులిపేసుకోనని, ఆ చట్టం ఆచరణపై నిఘాకు రాష్ట్రాలు, జిల్లాల్లో పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. వీటిల్లో ఏ విధమైన అవినీతి మకిలి అంటని రిటైర్డ్ జడ్జిలు, రాష్ట్ర పోలీస్ అధికారులు ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీకి, బీజేపీ సభ్యులకు, ఇతర ఎంపీలకు, దీక్షాశిబిరం వద్ద తనకు భద్రత కల్పించిన పోలీసులకు, డాక్టర్లకు, పం దిర్లు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. బిల్లు మరింత పటిష్టంగా రూపొందించారంటూ రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.
కేజ్రీవాల్ పేరెత్తకుండానే..: లోక్‌పాల్‌ను జోక్‌పాల్ అని విమర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పేరెత్తకుండానే ఆయనకు అన్నా చురకలంటించారు. టీవీ కెమెరాల ముందు మాట్లాడేవారి వల్ల సమాజానికి, దేశానికి ఏవిధమైన ప్రయోజనం ఉండదని పరోక్షంగా ఆప్ పార్టీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తాను కూడా అదే పనిచేస్తే ఈ విజయం సాధించి ఉండేవాడిని కాదన్నారు. తమకు అందిన చందాల వివరాలను ఇంటర్‌నెట్‌లో పొందపరచనున్నట్లు అన్నా వెల్లడించారు. అన్నా బృంద సభ్యురాలు కిరణ్ బేడీ మాట్లాడుతూ.. అవినీతి పరుల పాలిట లోక్‌పాల్ సుప్రీం కోర్టు లాంటిదన్నారు. సీబీఐ ఇకపై పంజరంలో చిలక కాదన్నారు. బిల్లు ఆమోదంతో శిబిరం వద్ద సంబరాలు చేసుకున్నారు.
లోక్‌పాల్ కోసం అన్నా నిరాహార దీక్షలిలా..
తొలిసారి ఢిల్లీలో 2011 ఏప్రిల్ 5న ప్రారంభించి ఐదు రోజుల దీక్ష
2011 ఆగస్టులో చేసిన దీక్ష 13 రోజుల పాటు కొనసాగింది.
అదే ఏడాది డిసెంబర్‌లో ముంబైలో రెండు రోజుల దీక్ష చేశారు.
చివరిసారిగా ఈనెల 10న తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో దీక్ష చేపట్టి విజయం సాధించారు.
‘ప్రొరోగ్’ కాదు.. వాయిదానే!
న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగకపోవచ్చు. అందుకు బదులుగా కొన్ని రోజుల తరువాత ప్రస్తుత సమావేశాలనే పునఃప్రారంభించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించే అవకాశాలున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ మంగళవారం సంకేతాలిచ్చా రు. ‘శీతాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయలేదు. కేవలం నిరవధిక వాయిదా వేశాం. ఈ సమావేశాలను ఎప్పుడైనా మళ్లీ ప్రారంభించవచ్చు’ అని విలేకరులతో అన్నారు. ఈ విషయంపై అన్ని పార్టీలతో చర్చలు జరిపి, అవినీతి వ్యతిరేక బిల్లులతో సహా అన్ని పెండింగ్ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించేలా యత్నిస్తామన్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశాలున్నాయి.
రెండ్రోజుల ముందే: షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈనెల5న మొదలైన సమావేశాలు ఈనెల 20న ముగియాల్సి ఉండగా.. వివిధ అంశాలపై పలు పార్టీల ఆందోళనలతో ఎలాం టి నిర్మాణాత్మక చర్చలు జరపకుండానే రెండ్రోజుల ముందే ముగిశాయి. తెలంగాణ అనుకూల, వ్యతిరేక ఎంపీలు దాదాపు ప్రతీరోజు సభను అడ్డుకున్నారు. చివరి రెండ్రోజులైన మంగళ, బుధవారాల్లోనే సభ కాస్త ప్రశాంతంగా జరిగి, లోక్‌పాల్ సహా పలు బిల్లులు ఆమోదం పొందాయి. ప్రభుత్వంపై పెట్టిన 3 అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. వాటిలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 13 మంది సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన నోటీసు కూడా ఉంది.