London nris
-
ఆయ్.. మేం గోదారోళ్ల మండి.. యూకేలో గోదారోళ్ల సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి అంటేనే గోదారి జిల్లాలు… గోదారోళ్లు అంటేనే సంక్రాంతికి ప్రతీకలు... అందునా కోనసీమ వాళ్లయితే మరీనూ.. సంక్రాతిని తమ జీవితం నుంచి వడదీసి చూడటానికి ఏమాంత్రం ఇష్టపడరు. అందుకే ఉద్యోగం, వ్యాపారం అంటూ ఖండాంతరాలు దాటినా సంక్రాంతి పండగుపై మమకారం ఎక్కవైతుందే తప్పా.. ఎక్కడ తగ్గట్లేదు. అలాంటి సంక్రాంతి సంబరాలు యూకేలో ఘనంగా జరిగాయి. మాది యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గోదావరి అని ముద్దుగా చెప్పుకునే యుకే గోదారోళ్ళు సంక్రాంతి సంబరాలు లండన్‌లో జనవరి 21న అంబరాన్ని అంటేలా నిర్వహించారు. చిన్న పిల్లలకు భోగి పళ్ళతో మొదలుకొని, గొబ్బిళ్ళు పాటలతో, స్వయంగా తామే వండి వడ్డించిన అరిటాకులో విందు భోజనం, తెలుగు సంస్కృతిని, గోదావరి వెటకారాన్ని, యాసని గుర్తు చేస్తూ ఆట పాటలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించడం స్థానికుల్ని సైతం అబ్బుర పరిచింది. గోదావరి ప్రాంత సాంప్రదాయ వంటకాలతో పసందైన విందుతో రుచులను ఆస్వాదించారు. వచ్చిన ఆడపడుచులు అందరినీ పసుపు కుంకాలతో ఆహ్వానించి, జీడ్లు, రేగి వడియాలు, ఒక సర్ప్రైజ్ స్వీట్ సారెగా ఇచ్చి సాగనంపారు. యూకేలోని సుమారు 1500 పైగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలే కాక, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నిర్వాహకులు తెలిపారు. -
ముఖ్యమంత్రికి ఎన్నారైల పోస్టుకార్డులు
లండన్: లండన్ టీజేఏసీ తలపెట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారైలు లేఖలు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీజేఏసీ చైర్మన్ కోదండరాం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నారై లను ఉద్దేశించి మాట్లాడారు. పోస్టు కార్డు ఉద్యమానికి ఎన్నారైల మద్దతు హర్షణీయమని కోదండరాం తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామకాల కాలెండర్ విడుదల చేయాలనీ.. నిరుద్యోగ భృతి కల్పించి యువతకు న్యాయం చేయాలనే ప్రధాన ఎజండాగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. లండన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వ్యవహరించిన రంగు వెంకట్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు నియమాకాలు ప్రధాన అంశం , తెలంగాణ ఏర్పాటు అయితే లక్షల ఉద్యోగాలు వస్తామని యువత ఎంతో ఆశతో ఉందన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించలేదన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ, ఉద్యోగ భృతిని కల్పించాలని లండన్ నుండి లేఖలు పంపి ఈ పోస్టుకార్డు ఉద్యమానికి మద్దతు తెలిపామన్నారు. రవి కూర మాట్లాడుతూ ఉద్యోగాలు నియామకాలు జరిపే టీఎస్పీఎస్సీ లోనే ఖాళీలు భర్తీచేయకపోవడం హాస్యాస్పదమన్నారు. మరో ఎన్నారై మహేష్ చాట్ల మాట్లాడుతూ..ఉద్యోగ కల్పన ను ప్రభుత్వం విస్మరించడం సరైనదికాదని.. నాలుగేళ్లలో 7 ఉద్యోగాలు మాత్రమే నియామకం జరగడం.. నోటిఫికేషన్ ప్రక్రియల్లో లోపాల వల్ల కూడా యువత ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు. రాజు కొయ్యడ మాట్లాడుతూ ప్రగతి భవన్ కు చేరుతున్న గుట్టల కొద్దీ ఉత్తరాలతో అయిన ముఖ్యమంత్రికి కనువిప్పు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపరి నర్సింహా రెడ్డి, కొలను విద్యాభూషణ్, గుర్రం మల్లారెడ్డి, పుప్పాల రాజు, మధు, గుమ్మడవెల్లి రమేష్, నాయిని శైలజ, నాయిని సురేందర్ రెడ్డి, ఆకుల వెంకట స్వామిలు పాల్గొని లండన్ నుంచి 12 లేఖలు ముఖ్యమంత్రికి పంపారు. -
'సమైక్య శంఖారావం'కు యూకే ఎన్నారైల మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్ది శనివారం నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతం కావాలని లండన్‌లోని ఆ పార్టీ యుకే- యూరోప్ విభాగం ఎన్నారైలు ఆకాంక్షించారు. సమైక్య శంఖారావం సభకు ఎన్నారైలు సంపూర్ణ మద్దతు తెలిపారు. శుక్రవారం లండన్‌లోని ఎన్నారైలు ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్‌లతో శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యుకే- యూరోప్ విభాగం అధ్యక్షుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ... సమైక్య శంఖారావం సభ ఏ ఒక్కరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభ కాదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి అవలంభించిందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు ఈ సభను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే రాజన్న రాజ్యం అవశ్యకతను ప్రజల్లోకి ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, పరిపాలన అనిశ్చితికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఆ రెండు పార్టీ లు ఎన్ని కుటిల రాజకీయాలకు పాల్పడిన ప్రజలు వైఎస్ జగన్ పక్షం ఉన్నారని సందీప్ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ డీఎన్ఏ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ యుకే- యూరోప్ విభాగం ఉపాధ్యక్షుడు యోగేంద్ర పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి ఒకే తాటిపై నడిపిన మహానేత వైఎస్ఆర్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరిపై ఎన్నారైలు నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెబుతారని యోగేంద్ర పేర్కొన్నారు.