లండన్: లండన్ టీజేఏసీ తలపెట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారైలు లేఖలు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీజేఏసీ చైర్మన్ కోదండరాం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నారై లను ఉద్దేశించి మాట్లాడారు. పోస్టు కార్డు ఉద్యమానికి ఎన్నారైల మద్దతు హర్షణీయమని కోదండరాం తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామకాల కాలెండర్ విడుదల చేయాలనీ.. నిరుద్యోగ భృతి కల్పించి యువతకు న్యాయం చేయాలనే ప్రధాన ఎజండాగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
లండన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వ్యవహరించిన రంగు వెంకట్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు నియమాకాలు ప్రధాన అంశం , తెలంగాణ ఏర్పాటు అయితే లక్షల ఉద్యోగాలు వస్తామని యువత ఎంతో ఆశతో ఉందన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించలేదన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ, ఉద్యోగ భృతిని కల్పించాలని లండన్ నుండి లేఖలు పంపి ఈ పోస్టుకార్డు ఉద్యమానికి మద్దతు తెలిపామన్నారు.
రవి కూర మాట్లాడుతూ ఉద్యోగాలు నియామకాలు జరిపే టీఎస్‌పీఎస్సీ లోనే ఖాళీలు భర్తీచేయకపోవడం హాస్యాస్పదమన్నారు. మరో ఎన్నారై మహేష్ చాట్ల మాట్లాడుతూ..ఉద్యోగ కల్పన ను ప్రభుత్వం విస్మరించడం సరైనదికాదని.. నాలుగేళ్లలో 7 ఉద్యోగాలు మాత్రమే నియామకం జరగడం.. నోటిఫికేషన్ ప్రక్రియల్లో లోపాల వల్ల కూడా యువత ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు.
రాజు కొయ్యడ మాట్లాడుతూ ప్రగతి భవన్ కు చేరుతున్న గుట్టల కొద్దీ ఉత్తరాలతో అయిన ముఖ్యమంత్రికి కనువిప్పు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపరి నర్సింహా రెడ్డి, కొలను విద్యాభూషణ్, గుర్రం మల్లారెడ్డి, పుప్పాల రాజు, మధు, గుమ్మడవెల్లి రమేష్, నాయిని శైలజ, నాయిని సురేందర్ రెడ్డి, ఆకుల వెంకట స్వామిలు పాల్గొని లండన్ నుంచి 12 లేఖలు ముఖ్యమంత్రికి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment