కాంగ్రెస్ పాలనలో ధనదోపిడీ
–ఉత్తమకుమారుడికి గాలి మాటలు
–మాది చేతల ప్రభుత్వం
–మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్లగొండ రూరల్ :
కాంగ్రెస్ పాలనలో ధనదోపిడీ జరిగిందని.. ఆ పార్టీ నాయకులు అందినకాడికి జేబలు నింపుకున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ మండలం నర్సింగ్‌భట్లలో సోమవారం గంగదేవమ్మ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్‌ను జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యే వేముల వీరేశం, దుబ్బాక నర్సింహారెడ్డి, ఎంపీపీ దైద రజితావెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఎంపీటీసీ బొడుపుల శంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో 98 లక్షల ఎకరాలకు నీరందించామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడం గాలిమాటలేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇస్తే పంట భూములు, పంటలు కనిపించవేమిటని ప్రశ్నించారు. నీళ్లు చాటుగా పోయేవి కాదుగదా ఎక్కడిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు పిట్టల దొర తీరును తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బ్రాహ్మణ వెల్లెంల ద్వారా సాగు నీరందిస్తామన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నేటికీ ఆ పనులు పూర్తి చేయలేదన్నారు. ఏన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు కోమటిరెడ్డిని ఎన్నుకుంటే సాగునీరు ఇవ్వలేదన్నారు. గంగదేవమ్మ చెరువు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పది గ్రామాలకు, 5వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఈ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. తాము మాటలు చెప్పమని చేతల ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ఒక విజన్ వుందని దాని ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దరికి చేరుస్తున్నామన్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ మంత్రి సహకారంతో లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేశామని, త్వరలో దోమలపల్లి చెరువును నింపుతామన్నారు. అనంతరం ఎస్ఐ ధనుంజయను గ్రామస్తులు సన్మానించారు. నిరుద్యోగ యువత కోసం కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించాడు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బకరం వెంకన్న, సర్పంచ్‌లు పనస శంకర్‌గౌడ్, ప్రకాశ్‌రెడ్డి, అంజిరెడ్డి, అమృతా సురేందర్, మహేశ్‌గౌడ్, పంకజ్‌యాదవ్, భిక్షం, ఏసు, వెంకన్న, వెంకట్‌రెడ్డి, విజయ తదితరులు పాల్గొన్నారు.