ఎస్కే యూనివర్శిటీలో ఉద్రిక్తత
అనంతపురం: విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం మధ్యాహ్నం దాదాపు 200 మంది విద్యార్థులు శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు యత్నిస్తోందని, పేదలకు చదువులు భారంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం ర్యాలీగా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రాజగోపాల్ చాంబర్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీ చార్జిలో ఐదుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తుతోంది.