సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువు తీరాడు పార్వతీ తనయుడు.రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్కు ఏం చెయ్యాలో పాలు΄ోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు.ఒక రోజు రాత్రి అతను నిద్ర΄ోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరి΄ోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసి΄ోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు.ఇదీ విశిష్టత..ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ్రపార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి?రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్ లో ఉంది.ఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్!