LORD HANUMA
-
హనుమ హృదయంలో సీతారాములు
రామ రావణ యుద్ధంలో రావణుడు అంతమొందాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు. సీతా సమేతంగా వానర వీరులను, విభీషణుణ్ణి తోడ్కొని పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకోవడానికి బయలుదేరాడు. రాముడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న భరతుడు అయోధ్య పొలిమేరల్లోనే సపరివారంగా నిలబడి, నెత్తి మీద పాదుకలను ఉంచుకుని రాముడికి స్వాగతం పలికాడు. అయోధ్యవాసుల జయజయ ధ్వానాల నడుమ, పురోహితుల వేద మంత్రాలతో రాముడికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం తర్వాత రాముడు తనకు అడుగడుగునా సహకరించిన వారందరికీ విలువైన కానుకలను బహూకరించాడు. సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుషేణుడు, జాంబవంతుడు తదితర వానర యోధులకు, విభీషణుడికి కానుకలతో సత్కరించాడు. హనుమంతుడికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సీతమ్మవారికి ఒక విలువైన రత్నాల హారాన్ని ఇచ్చాడు. ‘నీకు ఇష్టమైన వారికి దీనిని బహూకరించు’ అని చెప్పాడు రాముడు. ‘మహారాజా! మానసపుత్రుల మధ్య భేదభావాన్ని కలిగించాలనుకుంటున్నారా? తల్లికి బిడ్డలందరూ సమానమే కదా!’ అంది సీత. ‘సమానులెలా అవుతారు? బిడ్డలు అందరూ సమానులే అయితే శాస్త్రాల్లో సుపుత్రులు, కుపుత్రులు అని ఎందుకు వర్ణించారు?’ ప్రశ్నించాడు రాముడు. ‘ఏ వేలికి గాయమైనా నొప్పి సమానంగానే కలుగుతుంది. తల్లికి పుత్రులందరూ సమానమే. తల్లి మమత పుత్రులందరి మీద సమానంగానే ఉంటుంది. అయితే, సద్గుణాల కారణంగా, భక్తి కారణంగా కొంత తారతమ్యం కలుగుతుంది. ఆ తారతమ్యం గుణాలకు సంబంధించినది మాత్రమే!’ అని పలికింది సీత. ‘నా అభిప్రాయం కూడా అదే! గుణాలలో ఎక్కువగా ఎవరిని భావిస్తావో వారికే ఈ కానుక ఇవ్వు’ అన్నాడు రాముడు. ‘అందరూ గుణవంతులే! అందరూ భక్తులే!’ అంది సీత. ‘అయినా కొద్ది తారతమ్యం ఉండనే ఉంటుంది. నువ్వు సంకోచిస్తున్నట్లున్నావు. నువ్వు ఇవ్వదలచుకున్న వాళ్లకు నిస్సంకోచంగా ఈ కానుక ఇవ్వు’ అన్నాడు రాముడు. సభలో ఉన్నవారంతా సీతారాముల మధ్య జరిగిన ఈ సంభాషణను అత్యంత ఉత్కంఠతో ఆలకిస్తూ, ఆ హారాన్ని సీతమ్మవారు ఎవరికి ఇస్తుందా అని ఆత్రంగా చూస్తున్నారు. హనుమంతుడు మాత్రం ఏమీ పట్టనట్లుగా నిశ్చలంగా రాముణ్ణే చూస్తూ ఉన్నాడు. సీతమ్మవారు హనుమంతుడిని పిలిచి, రాముడు తనకు ఇచ్చిన హారాన్ని అతడికిచ్చింది. హనుమంతుడు ఆ హారాన్ని మెడలో ధరించాడు. సభాసదులందరూ హర్షధ్వానాలు చేశారు. తర్వాత హనుమంతుడు తన ఆసనంపై యథాప్రకారం ఆసీనుడయ్యాడు. సీతమ్మవారు తనకు ఇచ్చిన హారంలోని రత్నాలను ఒక్కొక్క దాన్నే పరిశీలనగా చూస్తూ, ఒక్కొక్క రత్నాన్నే కొరికి నేల మీద పడేయసాగాడు. సభాసదులందరూ హనుమంతుని చేష్టను వింతగా చూడసాగారు. ఇంతలో విభీషణుడు ధైర్యం చేసి, ‘కోతికేం తెలుసు అల్లం రుచి’ అన్నాడు. హనుమంతుడు విభీషణుడివైపు చూసి, ‘లంకాధిపా! అయితే ఏమంటావు? మీ లంకలోని రాక్షసులు ఎక్కువగా అల్లం తింటారు. అందుకే మీకు తెలిసినంతగా అల్లం రుచి మా వానరులకు ఎలా తెలుస్తుంది?’ అన్నాడు. ‘తినకపోతే మాత్రం నీలా ఉన్నామా? సీతమ్మవారు విలువైన హారాన్ని కానుకగా ఇస్తే, నువ్వు చేస్తున్న పనేమిటి?’ అని కాస్త కోపంగానే అడిగాడు విభీషణుడు. ‘సీతమ్మ ఎంతో విలువైనదిగా భావించే ఈ హారాన్ని నాకు ఇచ్చింది కదా, ఇందులో నా దేవుడు ఉన్నాడో లేడోనని చూస్తున్నాను. ఏ ఒక్క రత్నంలోనూ నా దేవుడైన రాముడు కనిపించలేదు. నా దేవుడు లేని వస్తువు ఏదైనా అది నాకు విలువ లేనిదే’ అన్నాడు హనుమంతుడు. ‘సరేనయ్యా! ఈ మణులలో నీ దేవుడైన రాముడు లేడు. పర్వతంలాంటి శరీరంతో తిరుగుతున్నావు కదా, అందులో మాత్రం ఉన్నాడేమిటి?’ అన్నాడు విభీషణుడు. ఆ మాటకు ఆవేశభరితుడైన హనుమంతుడు, తన పదునైన గోళ్లతో రొమ్ము చీల్చి గుండె తెరిచాడు. నివ్వెరపోతూ చూస్తున్న సభాసదులకు హనుమ హృదయంలో సీతారాములు కనిపించారు. వారంతా దిగ్భ్రాంతులయ్యారు. రాముడు హుటాహుటిన సింహాసనం దిగివచ్చి, హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. -సాంఖ్యాయన -
హనుమంతుని జన్మస్థలం కిష్కింధే
తిరుపతి అన్నమయ్య సర్కిల్: హనుమంతుని జన్మస్థలం ముమ్మాటికీ కర్ణాటక పంపాక్షేత్రంలోని కిష్కింధేనని హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామి పునరుధ్ఘాటించారు. టీటీడీ కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రతి అంశాన్నీ ఆయన ప్రస్తావిస్తూ అందులో లోపాలున్నాయని ఆరోపించారు. దేశంలో ఎంతో మంది పండితులు, పీఠాధిపతులు, స్వామీజీలు, దిగ్గజ సిద్ధాంతులు ఉన్నారని వారిని సంప్రదించకుండా సబ్జెక్ట్‌పై పట్టులేని నలుగురితో కమిటీ వేసి అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని ఎవరికి వారు తేల్చడం తగదని తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ హనుమ జన్మస్థలంపై టీటీడీ నియమించిన కమిటీ వ్యర్థమని, 4 నెలల్లో ప్రాజెక్ట్ వర్క్‌లా ఇతర పుస్తకాల్లోని పేపర్లను జిరాక్స్ చేసి నివేదిక సమరి్పంచిందని విమర్శించారు. అందులో పొందుపరచిన శ్లోకాలు పూర్తిగా కల్పితాలేనని, నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు. -
ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే
సాక్షి, తిరుపతి, తిరుమల: కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన ఏడుకొండలే రామభక్తుడైన ఆంజనేయుడి జన్మస్థలం అని టీటీడీ ఆధారాలతో సహా నిరూపించింది. తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోని జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని.. అదే అంజనాద్రి అని తెలిపింది. ఈ మహత్తర, పురాణ, చారిత్రక ఆవిష్కరణను బుధవారం శ్రీరామనవమి రోజు టీటీడీ ప్రకటించటం విశేషం. 15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు జాపాలిలో నిర్మించిన శ్రీఆంజనేయుని ఆలయమే హనుమ జన్మస్థలం అని ఆధారాలతో టీటీడీ వెలుగులోకి తెచ్చింది. జాపాలి మహర్షి జపం ఆచరించి శ్రీనివాసుడిని ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. శాస్త్రబద్ధంగా నిరూపణ: తమిళనాడు గవర్నర్ పురోహిత్ భక్త హనుమ జన్మస్థలాన్ని నిర్ధారిస్తూ పండితుల కమిటీ రూపొందించిన నివేదికను నవమి రోజు తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ హాజరయ్యారు. హనుమ జన్మస్థలాన్ని టీటీడీ శాస్త్రబద్ధంగా నిరూపించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. క్షుణ్నంగా పరిశీలించి ఆధారాలు సేకరించడం ఎంత కష్టమో తమిళనాడులోని 20 విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా తనకు బాగా తెలుసన్నారు. నాలుగు నెలలపాటు అవిశ్రాంతంగా శ్రమించిన పండితుల కమిటీని ఆయన అభినందించారు. త్వరలో పుస్తక రూపంలో నివేదిక: ఈవో జవహర్‌రెడ్డి భగవత్ సంకల్పంతోనే శ్రీరామనవమి నాడు హనుమంతుడి జన్మస్థానాన్ని తిరుమలగా నిరూపించామని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. పండితులతో కూడిన కమిటీ పౌరాణిక, వాజ్ఞయ, శాసన, భౌగోళిక ఆధారాలను సేకరించి ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు. ఆధారాలతో కూడిన నివేదికను టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, త్వరలో పుస్తక రూపంలోకి తెస్తామని ప్రకటించారు. కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని కూడా హనుమంతుడి జన్మస్థలంగా చెబుతున్నారని, దీన్ని శాస్త్రీయంగా పరిశీలించామని, అక్కడ కిష్కింద అనే రాజ్యం ఉండవచ్చని, హనుమంతుడు అంజనాద్రి నుంచి అక్కడికి వెళ్లి సుగ్రీవుడికి సాయం చేసినట్లుగా భావించవచ్చన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, హరియాణాలో హనుమంతుడు జన్మించినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. కమిటీ సభ్యులకు అభినందనలు.. కమిటీ సభ్యులైన ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధరశర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తుశాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ విజయ్‌కుమార్, టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మలను ఈవో అభినందించారు. పండితుల కమిటీ నాలుగు నెలల పాటు విస్తృతంగా పరిశోధించి బలమైన ఆధారాలు సేకరించిందని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇవీ ఆధారాలు.. శ్రీమద్రామాయణంలోని సుందరకాండ, అనేక పురాణాలు, వేంకటాచల మహాత్యం, ఎన్నో కావ్యాల్లో హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వర్ణించి ఉందని ఆచార్య మురళీధరశర్మ చెప్పారు. కంబ రామాయణం, వేదాంత దేశికులు, తాళ్లపాక అన్నమాచార్యులు తమ రచనల్లో వేంకటాద్రిగా, అంజనాద్రిగా అభివర్ణించారని తెలిపారు. బ్రిటీష్ అధికారి స్టాటన్ క్రీ.శ.1800లో తిరుమల ఆలయం గురించి సంకలనం చేసిన అంశాలతో సవాల్–ఏ–జవాబ్ పుస్తకాన్ని రాశారని, అందులో అంజనాద్రి అనే పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టినచోటు కావడం వల్లే అంజనాద్రి అనే పేరు వచ్చిందని ప్రస్తావించారని తెలిపారు. బాలాంజనేయుడు సూర్యదేవుడిని పట్టుకోవడానికి వేంకటాద్రి నుంచి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మళ్లీ చూడడం, వానరవీరులు వైకుంఠగుహలో ప్రవేశించడం.. లాంటి అనేక విషయాలు వేంకటాచల మహాత్యం ద్వారా తెలుస్తున్నాయన్నారు. ఈ గ్రంథం ప్రమాణమే అని చెప్పడానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో ఉన్నాయన్నారు. మొదటి శాసనం 1491 జూన్ 27వ తేదీ నాటిది కాగా రెండో శాసనం 1545 మార్చి 6వ తేదీకి చెందినదని వివరించారు. శ్రీరంగంలో ఉన్న ఒక శిలాశాసనం కూడా దీన్ని తెలియజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు. -
హనుమాన్ విగ్రహంపైనా దుండగుల ఆగ్రహం
లక్నో : లెనిన్, పెరియార్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలపై దాడుల ఘటనలు మరువక ముందే యూపీలో కొందరు దుండగలు హనుమాన్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన వెలుగుచూసింది. బలియా సమీపంలోని ఖరూవ్ గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నెలకొల్పిన హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహంపై దుండగులు ఓ పోస్టర్‌ను అతికించారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్ధం కిందట సురేష్ సింగ్ తన పొలంలో చనిపోయిన వానరాన్ని గుర్తించిన క్రమంలో అక్కడ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి స్ధానికులు అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై తీవ్ర చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి పరాజయం నేపథ్యంలో త్రిపురలో తొలుత లెనిన్ విగ్రహాన్ని బుల్డోజర్ సాయంతో కూల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఇక తమిళనాడులోని తిరుపత్తూర్‌లో ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ, సీపీఐకి చెందిన ఇద్దరు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇదే ఒరవడిలో పశ్చిమ బెంగాల్లో భారతీయ జన్‌సంఘ్ వ్యవస్ధాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని, యూపీలోని మీరట్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. చివరికి మహాత్మా గాంధీ విగ్రహాన్నీ దుండగులు విడిచిపెట్టలేదు. కేరళలోని కన్నూర్ జిల్లా తలిపరంబ వద్ద గాంధీ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. విగ్రహాల కూల్చివేతపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరికలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. -
శ్రీవారి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల/జంగారెడ్డి గూడెం / జంగారెడ్డిగూడెం రూరల్ : ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం రాత్రి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎ.రామ లింగేశ్వరరావు, రమ్య దంపతులు, వారి కుమార్తె రచన సందర్శించారు. వీరికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. న్యాయమూర్తి శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామి వారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆలయ సూపరింటెండెంట్ రమణరాజు ఆయనకు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. ‘మద్ది’లో పూజలు గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారినీ రామలింగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మ¯ŒS జడ్జిని సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఏలూరు ఎక్సైజ్ మేజిసే్ట్రట్ తిరుమలరావు, జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి డి.అజయ్‌కుమార్ ఆయన వెంట ఉన్నారు. తిరుమల పారిజాతగిరిలో.. : కాగా జంగారెడ్డి గూడెంలోని గోకుల పారి జాతగిరి వేంకటేశ్వరస్వామి వారినీ రామ లింగేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా కార్తీక మాసం సందర్భంగా తొలుత అర్చకులు వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి ప్రారంభించి అనేక కార్యక్రమాలు జరిపారు.