కాంగ్రెస్ పెద్దోళ్ల డిపాజిట్లు గల్లంతు
రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీలో గొప్పగొప్ప నాయకులు, తురుంఖాన్లు అనుకున్నవాళ్ల డిపాజిట్లన్నీ గల్లంతయ్యాయి. ఇప్పటివరకు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక్కసారి కూడా ఓటమి అన్నదే ఎరుగని అత్యంత సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కు సైతం డిపాజిట్ దక్కలేదు. విశాఖ జిల్లా అరకు నుంచి పోటీ చేసిన ఆయనకు కేవలం 51,898 ఓట్లు మాత్రమే వచ్చాయి. కిశోర్ చంద్రదేవ్‌తో పాటు రాష్ట్ర విభజన విషయంలో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిన కేంద్ర మంత్రులకు కూడా ఇదే తరహా పరాభవం ఎదురైంది. శ్రీకాకుళంలో కిల్లి కృపారాణికి 24,163 ఓట్లు, అరకులో కిశోర్ చంద్రదేవ్‌కు 51,898 ఓట్లు, కాకినాడలో పళ్లంరాజు 18,875 ఓట్లు, బాపట్లలో పనబాక లక్ష్మికి 17563 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో వాళ్లంతా కూడా డిపాజిట్లు కోల్పోయారు.
అయితే, కాంగ్రెస్ పార్టీకి ఇంత ఎదురు గాలి ఉన్నా, రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, విజయనగరంలో బొత్స ఝాన్సీ మాత్రం లక్ష ఓట్లకు పైగా సాధించి.. కాస్త గౌరవప్రదంగా ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ తరఫున రాజంపేటలో పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో దాదాపు 1.75 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయినా, తనకంటూ దాదాపు మూడు లక్షలకు పైగా ఓట్లు సంపాదించుకోవడం కొద్దిలో కొద్ది ఊరట. కేంద్రంలో మంత్రులుగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీచేసిన కేంద్ర మంత్రుల్లో అత్యధిక సంఖ్యలో ఓట్లు వచ్చినది ఆమెకే.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక పదవులు పోషించిన చాలామంది కూడా డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్ర విభజన విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. చట్టంత తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లు వ్యవహరించినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పాటు.. రాష్ట్ర మంత్రులు నీలకంఠాపురం రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కోండ్రు మురళీ మోహన్, పసుపులేటి బాలరాజు.. అందరూ డిపాజిట్లు కోల్పోయారు. ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు.