రూ.100 కోట్లు నష్టపోతారు
► మహారాష్ట్ర ప్రభుత్వానికి బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సూచన
నవీ ముంబై: నీటి కరవు కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లను అనుమతించకుంటే మహారాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల వరకు నష్టపోతుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ముంబై, నాగ్‌పూర్, పుణేలలో జరగాల్సిన మ్యాచ్‌లను ఇతర వేదికలకు మార్చితే తమకేమీ అభ్యంతరం లేదని, ఐపీఎల్ కోసం తాగునీటిని అందించే అవకాశం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘మ్యాచ్‌లు ఇక్కడే జరిగితే రాష్ట్రానికి రూ.100 కోట్ల వరకు ఆదాయం దక్కుతుంది. తరలిపోతే ఈమేరకు నష్టపోయినట్టే. వాస్తవానికి ఈ నిధులతో నీటి కరవు పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవచ్చు.
బీసీసీఐ కూడా నీటి సమస్యపై ఆందోళనగానే ఉంది. పిచ్‌ల కోసం తాగునీటిని ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదు. ఆయా ఫ్రాంచైజీలతో పాటు కరవు బాధిత గ్రామాలను దత్తత తీసుకోవాలనే ఆలోచనలో బోర్డు ఉంది. ఇంకా ఈ విషయంలో ఏం చేయాలనే దానిపై ఓ నివేదికను తయారుచేయనున్నాం. ఈనెల 12న కోర్టులో జరిగే విచారణలో ఈ విషయాలను తెలుపుతాం’ అని ఠాకూర్ వివరించారు. ఐపీఎల్ మ్యాచ్‌లను మహారాష్ట్రలో జరగకుండా చూడాలని ఓ ఎన్జీవో సంస్థ బాంబే హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.