జీవితాన్ని రసమయం చేసుకోండి
సినీనటుడు తనికె ళ్ళ భరణి
తిరుపతి: ప్రతి ఒక్కరు వారి జీవితాన్ని రసమయం చేసుకోవాలని సినీనటులు, రచయిత తనికెళ్ళ భరణి అన్నారు. ఎస్వీయూ తెలుగు అధ్యయనశాఖలో సోమవారం ‘తనికెళ్ళ భరణి సాహిత్యం- అనుభూతులు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తాను రాసిన ‘ప్యాసా’ పుస్తకాన్ని తనికెళ్ళ భరణి ఆవిష్కరించి ప్రసంగించారు. జీవితం అంటే ప్రతి క్షణాన్ని రసరమ్యం చేసుకోవడం అన్నారు.
ప్రతి ఒక్కరు నిర్భయంగా ప్రేమించాలని, ప్రేమించపోతే జీవితం లేదన్నారు. ఫలించిన ప్రేమ శోభనం గదిలో ఆవిరైతే, ఫలించని ప్రేమ చనిపోయాక చితిపై కూడా పరిమళిస్తుందని ఓ కవి చెప్పిన అంశాన్ని గుర్తు చేశా రు. విద్యార్థులు తల్లిదండ్రులకు సహాయం చేయాలని సూచించారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా విద్యార్థులు ఆంగ్ల భాష నేర్చుకోవాలని, అలానే తెలుగుభాషను కూడా బాగా నేర్చుకోవాలన్నారు. అన్ని రంగాల్లో ధర్మబద్ధంగా ఉండాలన్నదే భగవద్గీత సారాంశమన్నారు.
తనికెళ్ళ భరణి రాసిన ‘ప్యాసా’ పుస్తకాన్ని పరిచయం చేసిన రెంటాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గొప్ప స్పందన శీలత కలిగేలా రాసేవారే రచయిత అన్నారు. ప్యాసాలో తనికెళ్ళ భరణి ప్రేమతత్వాన్ని చక్కగా వర్ణించారన్నారు. తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షులు పేట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఉమామహేశ్వరరావు, తెలుగు భాషాద్యోమ సమితి కన్వీనర్ శ్రీదేవి, రచయిత మధురాంతకం నరేంద్ర, పి.నరసింహారెడ్డి, పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.