lover kills girl
-
ప్రియుడి పక్కా స్కెచ్.. ఎక్కడికైన తీసుకెళ్లాలని కోరిన ప్రియురాలిని..
సాక్షి, పెనుమూరు(చిత్తూరు): నమ్మి వచ్చిన ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. గురువారం చిత్తూరు డీఎస్పీ సుధాకరరెడ్డి తెలిపిన వివరాలు.. బిహార్ రాష్ట్రం, గోపాల్ గంజి జిల్లా, మధు సారియా గ్రామానికి చెందిన రాజ్‌దూత్, అతని పక్కింటికి చెందిన కవితకుమారి(20) ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒక్కటి కావడంతో కవితకుమారి గర్భం దాల్చింది. ఫలితంగా తనను ఎక్కడికైనా తీసుకెళ్లాలని ప్రియుడిని ఆమె బలవంతం చేయడంతో చెన్నైలో ఉద్యోగం చేస్తున్న రాజ్‌దూత్ ఆమెను చిత్తూరుకు తీసుకొచ్చాడు. ఈ ఏడాది అక్టోబర్ 11న చిత్తూరులోని ఓ సెల్‌ఫోన్ షాపులో ఫోన్ రిపేరు చేసుకున్నారు. అనంతరం పెనుమూరు క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న శ్రీవెంకటేశ్వరా ఇంజినీరింగ్ కళాశాలలో కవిత కుమారిని బీ–ఫార్మసీ కోర్సులో చేర్చేందుకు ప్రయత్నించాడు. అయితే సీటు లభించకపోవడంతో మండలంలోని కలవగుంట పంచాయతీ విజయనగరం యానాదికాలనీలో ఓ ఇంట అద్దెకు దిగారు. అబార్షన్ చేసుకోవాలని ప్రియురాలిపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో అంతం చేయాలని స్కెచ్ వేశాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండుతో గట్టిగా అదిమి, ఊపిరి ఆడకుండా చేసి, హతమార్చాడు. అనంతరం ఆమె దుస్తులతో సహా ఎలాంటి ఆధారాలు లేకుండా అతడు పారిపోయాడు. రెండు రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానించారు. అక్టోబర్ 19న పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాకాల సీఐ ఆశీర్వాదం, ఎస్ఐ నరేంద్ర అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహం వెలుగులోకి వచ్చిన రూములో లభించిన మొబైల్ షాపు విజిటింగ్ కార్డు, ఓ షర్టుపై ఉన్న స్టిక్కర్ కేసు దర్యాప్తుకు ‘క్లూ’లయ్యాయి. అలాగే, మొబైల్ షాపులోని సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. -
సూట్‌కేసులో కుక్కి.. కాలువలో పడేసి
హైదరాబాద్/రామచంద్రాపురం(పటాన్చెరు): అది సుభాష్‌నగర్ డివిజన్లోని సుందర్‌నగర్ కాలనీ. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. మఫ్టీలో ఉన్న పోలీసులు ఓ వ్యక్తి చేతులకు సంకెళ్లు వేసి తీసుకువచ్చారు. అసలేమి జరుగుతుందో స్థానికులకు అర్థం కాని పరిస్థితి. సరిగ్గా అర్ధగంట వ్యవధిలో మురికి కాలువ నుంచి ఓ పెద్ద సూట్‌కేసును వెలికి తీయించారు. సంకెళ్లున్న వ్యక్తితో సూట్ కేసు తెరిపించగా అందులో ఓ యువతి శవం కనిపించింది. దీంతో అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తనను పెళ్లి చేసుకోమని సదరు యువతి ఒత్తిడి చేయడంతో ప్రియుడే హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పెళ్లి ప్రస్తావనతోనే హత్య..: రామచంద్రాపురం పట్టణం ఎల్ఐజీ కాలనీలో నివాసం ఉండే లావణ్య (25) ఇంజనీరింగ్ పూర్తి చేసి.. హైదరాబాద్‌లోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. సుభాష్‌నగర్ డివిజన్ సుందర్‌నగర్ కాలనీకి చెందిన మనోజ్ కుమారుడైన సునీల్‌కుమార్ (26) జూబ్లీహిల్స్‌లోని మోల్డ్‌టెక్‌లో పనిచేస్తున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 2017లో సునీల్‌కుమార్ తాను ప్రేమిస్తున్నానని లావణ్యకు తెలిపాడు. దాన్ని లావణ్య అంగీకరించింది. అనంతరం వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. లావణ్య తనను పెళ్లి చేసుకోవాలని సునీల్‌పై ఒత్తిడి పెంచింది. ఆ సందర్భంలో సునీల్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎంగేజ్మెంట్ కూడా జరుపుకునేందుకు నిర్ణయించాడు. అనంతరం తన తల్లిదండ్రులకు ప్రమాదం జరిగిందని సాకులు చెప్పి ఎంగేజ్మెంట్ రద్దు చేశాడు. ఈ నెల 4న లావణ్య ఇంటికి వచ్చిన సునీల్ తనకు మస్కట్‌లో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. నీకు కూడా అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో లావణ్యను తీసుకొని శంషాబాద్‌లోని ఓ లాడ్జిలో దిగాడు. ఈ నెల 5న లావణ్యను హత్యచేసి ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టుకొని కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం కాలనీలోని డ్రైనేజీలో పడేశాడు. లావణ్య తల్లిదండ్రులకు అనుమానం రాకుండా మృతురాలు లావణ్యకు చెందిన సెల్‌ఫోన్ నుంచి 5వ తేదీన మస్కట్ చేరుకున్నట్టు మెసేజ్ పెట్టాడు. తిరిగి 7వ తేదీన మస్కట్ నుంచి వస్తున్నట్లు మెసేజ్ చేశాడు. మియాపూర్ బస్సులో ఉన్నట్లు లొకేషన్ షేర్ చేసి మృతురాలి ఫోన్ నంబర్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఎంతకీ లావణ్య ఇంటికి రాకపోయేసరికి ఆమె కుటుంబ సభ్యులు తిరిగి సునీల్‌కు ఫోన్ చేశారు. తను మస్కట్ నుంచి బయల్దేరి వస్తున్నానని మృతురాలి తల్లిదండ్రులకు తెలిపాడు. వారు ఎయిర్ పోర్టుకు వస్తానని చెప్పడంతో రావద్దని వారించాడు. దాంతో అనుమానం వచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు వెళ్లి సునీల్ కోసం వేచి చూశారు. అయితే లావణ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సునీల్ తనను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని చెప్పాడు. దానిపై అనుమానం వచ్చిన లావణ్య తల్లిదండ్రులు రామచంద్రాపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. లావణ్య ఇచ్చిన తినుబండారాలు సునీల్ ఇంట్లో దొరకడంతో పోలీసులు విచారణ జరిపారు. పోలీసులు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. సూట్ కేసులో మృతదేహం ఉన్న ప్రాంతానికి శనివారం రాత్రి నిందితుడిని తీసుకొచ్చి వెలికి తీయించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించలేదని ధన్యను కిరాతకంగా..
కోయంబత్తూరు: తనను ప్రేమించడం లేదన్ని 23 ఏళ్ల యువతిని తన ఇంట్లోనే కిరాతకంగా హతమార్చాడు ఓ దుర్మార్గుడు. ఆ తర్వాత విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్లో బుధవారం ఈ ఘటన జరిగింది. 23 ఏళ్ల ధన్య ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగినిగా పనిచేస్తూ తన తండ్రి టైలరింగ్ పనిలోనూ సాయంగా ఉంటోంది. బుధవారం ఆమె తల్లిదండ్రులు సోమసుందరం, శారద ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఊరెళ్లారు. వారి తిరిగొచ్చి చూడగా.. నెత్తుటి మడుగులో ధన్య విగతజీవిగా కనిపించింది. దీంతో గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాము పొరుగూరుకు వెళ్లేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారానికి తాళం వేశామని, వెనుకవైపు మార్గం నుంచి ఇంట్లోకి చొరబడి దుండగుడు ఈ కిరాతకానికి పాల్పడి ఉంటాడని వారు తెలిపారు. ధన్య శరీరం నిండా కత్తి గాట్లు, పోట్లు ఉన్నాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో సంఘటన స్థలంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఓ వ్యక్తి తమ బిడ్డను ప్రేమించమని తరచూ వేధిస్తున్నాడని, వాడే ఈ కిరాతకానికి ఒడిగట్ట ఉండవచ్చునని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితుడు 27 ఏళ్ల జకీర్‌ను గుర్తించారు. అప్పటికీ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి విషమస్థితిలో ఉన్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. బాధితురాలు ధన్యకు ఇటీవల వివాహ నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి జరగనుండగా ఇంత దారుణం జరిగిందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు అన్నూర్లో గురువారం బంద్ నిర్వహించారు.